Telangana | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును మరో మూడేండ్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రిటైర్‌మెంట్ వయసుపై సచివాలయంలో ఉద్యోగులు, అధికారుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 61 ఏండ్ల వయసును 64 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పదవీ విరమణ వయసు పెంపుపై జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో సుమారు 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు అవుతుంది. పదవీ విరమణ వయసు మూడేండ్ల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కార్‌పై పడుతుందనే ముందు చూపులో భాగంగానే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా చర్చ కొనసాగుతోంది. మూడేండ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరి.. లేదంటే కొత్తగా రాబోయే ప్రభుత్వానికి పదవీ విరమణ ప్రయోజనాలు గుదిబండగా మారనున్నాయి. రిటైర్మెంట్ అయిన వారి పెండింగ్ బిల్లులు రూ.10వేల కోట్ల వరకు ఉన్నట్లు ఒక అంచనా. ఇక టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు లేనట్టే..! ప్రభుత్వ ఉద్యోగులకు మరో మూడేండ్ల పాటు పదవీ విరమణ వయసు పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తుండడంతో నిరుద్యోగ అభ్యర్థులు భగ్గుమంటున్నారు. రేవంత్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉందని మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఉద్యోగ విరమణలతో ఖాళీలు ఏర్పడుతాయని, కానీ వారికే రిటైర్మెంట్ వయసు పెంచిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఎలాంటి కొత్త నియామకాలు ఉండవనేది స్పష్టమవుతున్నదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.