త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు భ‌ద్రంగా ఉంటాయ‌న్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావ‌ణ్‌

Dasoju Sravan | విద్యార్థుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌నే ఇంత‌ సుల‌భంగా లీక్ చేశార‌ని.. మ‌రి రేపు క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు భ‌ద్రంగా ఉంటాయ‌న‌డానికి గ్యారెంటీ ఏంద‌ని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్రావ‌ణ్ కుమార్ ప్ర‌శ్నించారు. 1.79 లక్షల మంది JEE Advanced 2026 విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లను ఐఐటీ రూర్కీ బ‌హిర్గ‌తం చేయ‌డంపై ఆయ‌న ఫైర‌య్యారు.

S

Telangana | Published On Jun 5, 2026, 12.38 pm IST

Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు భ‌ద్రంగా ఉంటాయ‌న్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావ‌ణ్‌
Advertisement

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: విద్యార్థుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌నే ఇంత‌ సుల‌భంగా లీక్ చేశార‌ని.. మ‌రి రేపు క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు భ‌ద్రంగా ఉంటాయ‌న‌డానికి గ్యారెంటీ ఏంద‌ని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్రావ‌ణ్ కుమార్ ప్ర‌శ్నించారు. జాతీయ స్థాయి ప‌రీక్ష‌ల్లో అర్హత సాధించ‌డానికి మాత్ర‌మే విద్యార్థులు త‌మ వివ‌రాల‌ను ఇచ్చార‌ని.. ఒక‌ విద్యా సంస్థ‌ మార్కెటింగ్ డేటాబేస్‌లోకి వెళ్ల‌డానికి కాద‌ని మండిప‌డ్డారు. 1.79 లక్షల మంది JEE Advanced 2026 విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లను ఐఐటీ రూర్కీ బ‌హిర్గ‌తం చేయ‌డంపై ఆయ‌న ఫైర‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

మ‌ళ్లీ విద్యార్థులే న‌ష్ట‌పోతున్న‌రు..

విద్యార్థులు తమ డేటాను ఒక జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధించడానికి ఇచ్చారు. అంతేగానీ ఒక విద్యాసంస్థ మార్కెటింగ్ డేటాబేస్‌లోకి వెళ్లడానికి కాదు. విద్యార్థుల డేటాను ఇంత సులభంగా లీక్ చేసి, దుర్వినియోగం చేయగలిగితే రేపు ప్ర‌శ్న‌ప‌త్రాలు సుర‌క్షితంగా ఉంటాయ‌న్న గ్యారెంటి లేదు. JEE డేటా లీక్ అయింది. ఇప్పుడు మళ్లీ విద్యార్థులే నష్టపోతున్నారు. ఇదొక పద్ధతిగా మారింది. విద్యాసంస్థలు సులభంగా తప్పించుకుంటాయి. నిందితులు దర్జాగా తిరుగుతారు, ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. కానీ విద్యార్థులు మాత్రం తమ జీవితాల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు అని దాసోజు విచారం వ్య‌క్తం చేశారు.

ఇది చిన్న సాంకేతిక లోపం కాదు..

ఇది పాలనాపరమైన ఎమర్జెన్సీ. ఇది కేవలం ఒక చిన్న సాంకేతిక లోపం కాదు. ఇది ఏదో ఒకచోట జరిగిన ఒంటరి సంఘటన అంతకన్నా కాదు. భారతదేశ పరీక్షా వ్యవస్థ మన దేశపు అతి చిన్న వయస్కులైన పౌరుల అత్యంత సున్నితమైన డేటాను కలిగి ఉంది. కానీ దీన్ని ఒక చిన్న కాలేజీ కంప్యూటర్ ల్యాబ్ భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు అని ఆయ‌న చెప్పారు.

రీడ్ -ఓన్లీ..

IIT రూర్కీ 1.79 లక్షల రిజల్ట్ రికార్డులను, 1.87 లక్షల అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌లను ఎటువంటి అథెంటికేషన్ (authentication) అవసరం లేకుండా, బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉంచేసింది. ఈ డేటాలో పూర్తి పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లు ఉన్నాయి. అయితే ఐఐటీ రూర్కీ దీన్ని స‌మ‌ర్థించుకుంది. ఇది కేవలం రీడ్-ఓన్లీ (Read-only) మాత్రమే" అని పేర్కొన‌డం స‌రికాదు అంటూ శ్రావ‌ణ్ హెచ్చ‌రించారు.

క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా..

JEE క్వాలిఫై అయిన విద్యార్థులను IIT మద్రాస్ నేరుగా సంప్రదించి తమ 'BS ప్రోగ్రామ్‌ల' మార్కెటింగ్ కోసం ఈ డేటాను వాడుకుంటున్నట్లు తేలింది. దీని కోసం విద్యార్థుల అనుమతి తీసుకున్నార‌న‌డానికి ఎటువంటి అధికారిక నిబంధనలు లేదా ఫ్రేమ్‌వర్క్ లేదు. విద్యార్థులకు కనీసం సమాచారం కూడా ఇవ్వ‌లేదు. పైగా ఈ డేటా యాక్సెస్ అన్ని విద్యాసంస్థలకూ సమానంగా ఇచ్చారా? అనే విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌ని రహ‌స్యంగానే ఉంది అని ఆయ‌న పేర్కొన్నారు.

ఇదొక ప‌ద్ధ‌తిగా మారింది..

విద్యాసంస్థలు బాధ్యతారాహిత్యానికి వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఇంకొక‌టి లేదు. మొన్న‌టికిమొన్న NEET పేపర్ లీకైంది. త‌ర్వాత‌ CBSE మూల్యాంకన (Evaluation) వివాదాలు వ‌చ్చాయి. ఇప్పుడు JEE డేటా లీకైంది. ఇలా ఏ స‌మ‌స్య వ‌చ్చినా విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్‌ను కోల్పోవాల్సి వ‌స్తోంది. ప‌రీక్ష ఏదైనా, త‌ప్పిదం ఎవ‌రిదైనా విద్యార్థులే నష్టపోతున్నారు. దేశంలో ఇదొక పద్ధతిగా మారింది అంటూ దాసోజు శ్రావ‌ణ్ మండిప‌డ్డారు.

న్యాయపరమైన ప‌రిష్కారం లేదు..

భారత్‌ 2023లోనే 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్' ను ఆమోదించింది. డేటా షేరింగ్‌కు ముందే అనుమతి తీసుకోవడం, మీ డేటా ఎవరి వద్ద ఉందో తెలుసుకునే హక్కు, డేటా లీక్ అయితే న్యాయపరమైన పరిష్కారాన్ని అందించాలి. కానీ దీని పూర్తి అమలు నిబంధనలు 2027, మే నుండి మాత్రమే అమల్లోకి వస్తాయి. ఫిర్యాదులను స్వీకరించాల్సిన 'డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా' ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో
డేటా బహిర్గతమైన 1.79 లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి న్యాయపరమైన పరిష్కారం లేక‌పోవ‌డం ఆలోచించాల్సిన విషయం.

ఇలా వెలుగులోకి..

దుబాయ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రైలన్ అనిల్, JEE అడ్వాన్స్‌డ్ 2026 రిజల్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపాల వివరాలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం.. పబ్లిక్‌గా యాక్సెస్ చేయగలిగేలా ఉన్న ఒక స్టోరేజ్ లొకేషన్ వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థుల రికార్డులు, అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌ ఫైళ్లు బహిర్గతమైనట్లు వెల్ల‌డైంది.

గోప్య‌త‌కు భంగం..

క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం కారణంగా అభ్యర్థుల వ్యక్తిగత డేటా ఎటువంటి అథెంటికేషన్ లేకుండానే ఆన్‌లైన్‌లో బహిర్గతమై ఉండవచ్చని ఓ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు పేర్కొన్నారు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ క్లెయిమ్‌పై ఐఐటీ రూర్కీ పబ్లిక్‌గా స్పందిస్తూ ఈ సమస్యను ప్రాధాన్య క్ర‌మంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
కాగా వ్యక్తిగత డేటా బహిరంగంగా అందుబాటులో ఉండటం అనేది గోప్యత (privacy) పరంగా ఆందోళన కలిగిస్తుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

విద్యార్థుల‌కు స‌మాధానం కావాలి: ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

JEE డేటా ఎంతకాలం పాటు బహిరంగంగా అందుబాటులో ఉంది? బాధితులైన 1.79 లక్షల మంది విద్యార్థులందరికీ వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారా? ఏ న్యాయపరమైన ప్రాతిపదికన IIT మద్రాస్ మార్కెటింగ్ కోసం JEE అభ్యర్థుల డేటాను యాక్సెస్ చేసింది? ఇంకా ఏయే సంస్థలకు JEE/NEET డేటా అందింది. దీన్ని ఎవరు ఆమోదించారు? అన్ని జాతీయ పరీక్షా పోర్టల్‌లను కవర్ చేసేలా ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ (Security Audit) జరుగుతోంది? మౌనంగా ఉండటం అంటే నేరానికి సహకరించడమే. భారత‌ విద్యార్థులకు సమాధానాలు కావాలి, ప్రెస్ రిలీజ్‌లు కాదు అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement