త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారం ఎక్కువ భాగం కొనసాగిన బలహీన మార్కెట్ సెంటిమెంట్‌నే సూచీలు కొనసాగించాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళనలు మదుపరులను రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడే పరిస్థితిలో ఉంచడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.

S

Business | Published On Aug 14, 2026, 10.14 am IST

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారం ఎక్కువ భాగం కొనసాగిన బలహీన మార్కెట్ సెంటిమెంట్‌నే సూచీలు కొనసాగించాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళనలు మదుపరులను రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడే పరిస్థితిలో ఉంచడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 289.22 పాయింట్లు (0.37 శాతం) నష్టపోయి 77,790.74 వద్ద కొనసాగింది. నిఫ్టీ కూడా 79 పాయింట్లు (0.32 శాతం) క్షీణించి 24,316.85 వద్ద ట్రేడయ్యింది. మార్కెట్ల‌ పతనానికి ప్రధాన కారణాల్లో మొదటిది భౌగోళిక రాజకీయ ఆందోళనలు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ వారం నిఫ్టీ 50, బీఎస్ఈ సెన్సెక్స్‌ రెండూ దాదాపు 0.8 శాతం చొప్పున పడిపోయాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

సమీప కాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాల కంటే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలే మార్కెట్‌ల‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కాల్పుల విరమణ చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ప్రకటించింది. అలాగే ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగిస్తామని అమెరికా హెచ్చరించిన తర్వాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై ఆందోళనలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 87.16 డాలర్లకు చేరుకోగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 81.29 డాలర్ల వద్ద పెద్దగా మార్పు లేకుండా కొనసాగింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి కాస్త మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.39 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.04 శాతం మేర లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement