త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హ‌రీశ్ రావు

Harish Rao | కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project) విష‌యంలో ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌చారంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేర‌ని, వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు.

G

Telangana | Published On Aug 14, 2026, 10.54 am IST

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project) విష‌యంలో ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌చారంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేర‌ని, వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు. కాళేశ్వరం (Kaleshwaram) లేకుండానే రికార్డు పంటలు పండాయని ప్రచారం చేస్తున్న మీరు.. మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్ర‌శ్నించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం.. ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా?, మీరు మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగుతాయా? అని నిల‌దీశారు.

ఎల్లంపల్లి-మిడ్‌మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు అన్న వాస్తవాన్ని ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ (SRSP), నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేర‌ని చెప్పారు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై మీరు చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు (Telangana) శాపంగా మారింద‌న్నారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని చెప్పారు.

అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపాల‌ని హిత‌వుప‌లికారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ (GRMB) ఎజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఎజెండా అంశాలు తొలగించకుండా ఈనెల 18న జరిగే మీటింగ్‌కు హాజరైతే బీఆర్ఎస్ (BRS) చూస్తూ ఊరుకోదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చరించారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్‌ సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement