త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gongidi Sunitha | ఉన్న‌వాటికే మ‌ళ్లీ దాత‌ల‌ సాయం కోరుతున్న‌రు.. యాద‌గిరిగుట్ట ఈవోపై చ‌ర్య‌లు తీసుకోవాలి

Gongidi Sunitha | యాద‌గిరిగుట్ట‌లో అభివృద్ధి ప‌నుల‌కు పాల‌క మండ‌లి స‌భ్యులు నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని.. అయినా దాత‌ల సాయం కోరుతూ ఈవో భవాని శంకర్ క‌ర‌ప‌త్రం విడుద‌ల చేయ‌డం ఆల‌య‌ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం కాదా అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 29, 2026, 3.26 pm IST

Gongidi Sunitha | ఉన్న‌వాటికే మ‌ళ్లీ దాత‌ల‌ సాయం కోరుతున్న‌రు.. యాద‌గిరిగుట్ట ఈవోపై చ‌ర్య‌లు తీసుకోవాలి
Advertisement
  • ఇది ఆల‌య ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం కాదా?
  • ఈవో క‌ర‌ప‌త్రం పాల‌క‌మండ‌లికే అవ‌మానం
  • మేం మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు వెళ్తాం
  • మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమ‌ర్శ‌లు

Gongidi Sunitha | త్రినేత్ర న్యూస్: యాద‌గిరిగుట్ట‌లో అభివృద్ధి ప‌నుల‌కు పాల‌క మండ‌లి స‌భ్యులు నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని.. అయినా దాత‌ల సాయం కోరుతూ ఈవో భవాని శంకర్ క‌ర‌ప‌త్రం విడుద‌ల చేయ‌డం ఆల‌య‌ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం కాదా అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే దిగ‌జార్చార‌ని విమ‌ర్శించారు. అందాల పోటీల‌కు కూడా గుట్ట‌ ఆల‌య నిధుల‌ను సిగ్గులేకుండా వాడుకున్నార‌ని ఫైర‌య్యారు. క‌ర‌ప‌త్రంలో 16 ప‌నుల కోసం సాయం కోరుతూ క‌ర‌ప‌త్రం విడుద‌ల చేసిన ఈవోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ చేసిన శంకుస్థాప‌న‌ల‌కే రేవంత్ మ‌ళ్లీ చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఈవో ఇలాంటి తప్పుడు పనులు చాలా చేస్తున్నారు. స్వామివారి నిత్యకల్యాణ మండపాన్ని నిర్మించేందుకు పాలక మండలి చైర్మన్ తన సొంత నిధులు 9 కోట్లు ఇస్తానని ప్రకటించారు. సమావేశంలో తీర్మానం చేశారు. మళ్ళీ ఆ తొమ్మిది కోట్ల కోసం దాతల సాయాన్ని ఎలా కోరతారు? ముఖ ద్వారాల నిర్మాణానికి కూడా 4 కోట్ల రూపాయల సాయాన్ని కూడా చైర్మన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని కూడా దాతలు ఇవ్వాలని ఈవో ఎలా అడుగుతారు? గోశాలకు కేసీఆర్ హయాంలోనే 13 ఎకరాలు కేటాయించారు. దాని కోసం కూడా దాతల సాయం కోరుతున్నారు. డైనింగ్ హాల్, కిచెన్ ను కూడా గతంలోనే నిర్మించారు. వాటికి మళ్ళీ దాతల సాయం కోరడం దేవాలయ ప్రతిష్టను దిగజార్చడం కాదా? ఈవో కరపత్రం పాలకమండలికే అవమానం.

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ దేవాలయ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తోంది. కేసీఆర్ యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలిపారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా విలువ ఇవ్వరు. కేసీఆర్ 1300 కోట్ల రూపాయలతో యాదగిరి గుట్ట ఆలయాన్ని పునరుద్ధరించారు. దేవాలయం ఈవో ఓ కరపత్రం విడుదల చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం దాతలు కావలెను అని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది విచారకరం. దేవాలయ నిర్మాణంలో కేసీఆర్ ఎప్పుడూ దాతల సాయం కోరలేదు. ఆలయం పూర్తయిన తర్వాత బంగారం తాపడం కోసం మాత్రమే కేసీఆర్ దాతల సాయం కోరారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కరపత్రం తెచ్చిన ఈవోపై చర్యలు తీసుకోవాలి. 43 కోట్లతో వేద పాఠశాల కోసం కేసీఆర్ 2023లో శంకుస్థాపన చేశారు. గత మే లో మళ్ళీ అవే పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకు కూడా దాతల సాయం కోరుతారా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండానే సీఎం శంకుస్థాపన చేశారా? ఇది సీఎంకు అవమానకరం కాదా? సిగ్గు చేటు అనిపించడం లేదా? కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడితే రేవంత్ రెడ్డికి కొన్ని కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదా? దీక్షాపరుల నిర్మాణం కోసం కేసీఆర్ హాయాంలో మంచి భవనాన్ని నిర్మించారు. ఆ భవనం కోసం మళ్ళీ 43 కోట్ల సాయాన్ని ఈవో దాతల నుంచి ఎలా అడుగుతారు?

రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. ఇప్పుడు యాదగిరిగుట్ట ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కేసీఆర్ హాయాంలో కళ్యాణ కట్టను గొప్పగా నిర్మించారు. మళ్ళీ కల్యాణ కట్టకు దాతల సాయం ఎందుకు? అద్దె గదుల వద్ద కల్యాణ కట్ట ఏర్పాటుకు ట్రస్ట్ బోర్డు సభ్యుడు 9 లక్షలు ఇస్తానని తీర్మానం చేశారు. అయినా ఈ పనికి కూడా దాతల సాయం కోరారు. కొండపైన లైటింగ్ ఏర్పాటు కోసం చిరంజీవి భార్య, ట్రస్టు బోర్డు సభ్యురాలు సురేఖ 76 లక్షల విరాళం ప్రకటించారు. ఆ పనులకు కూడా దాతల సాయం కోరతారా?

అందాల పోటీల‌కు సిగ్గులేకుండా వాడుకున్న‌రు

భక్తులను అవమానపరిచిన ఈవో భవాని శంకర్ పై చర్యలు తీసుకోవాలి. అందాల పోటీలకు కూడా యాదగిరిగుట్ట దేవాలయ నిధులను సిగ్గులేకుండా వాడుకున్నారు. అందాల పోటీలకు దేవాలయ నిధులు ఖర్చు చేసి దేవాలయ అభివృద్ధి పనులకు దాతల సాయం కోరతారా? దాతల సాయం పేరిట కుంభకోణానికి తెర లేపుతున్నారు. రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేసినా ఇప్పటివరకు ఒక్క పైసా కేటాయించలేదు.

రేవంత్ స‌మాధానం చెప్పాలి..

కొండాసురేఖ బర్తరఫ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మా ఆరోపణలపై వెంటనే సమాధానం చెప్పాలి. యాదగిరి దేవాలయ ప్రతిష్టను కాపాడుకునేందుకు మేం ఎంత దూరమైనా వెళతాం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయిస్తాం.

ఈ ప్రెస్ మీట్‌లో యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నేతలు వెంకటయ్య, మహేందర్, అనురాధ, రామిరెడ్డి, నరహరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement