KTR | ఓటేసిన పాపానికి ప్రజలను కాటేస్తున్నారు.. ఇగ కాంగ్రెస్‌ను తన్ని తరుముడే
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 31 నెలలుగా అన్ని వర్గాలను మోసం చేసిందని.. ఇక వారికి మిగిలింది 29 నెలలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సినిమా ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్నారు. యువత చేతిలో ఢిల్లీకి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందన్నారు.
- 31 నెలలుగా అన్ని వర్గాలను మోసం చేసింది.. ఇక మిగిలింది 29 నెలలే
- రేవంత్ ఒక్కడు దొరికితే యువకులు పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నరు
- కార్యకర్తలారా.. ప్రజలను వేధించే ప్రతి ఒక్కరి వివరాలు రాసుకోండి
- వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- రైతన్నలు, యువతరం కలిస్తే మళ్లీ రైతు ప్రభుత్వం వస్తది
- మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
KTR | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 31 నెలలుగా అన్ని వర్గాలను మోసం చేసిందని.. ఇక వారికి మిగిలింది 29 నెలలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సినిమా ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్నారు. యువత చేతిలో ఢిల్లీకి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. రైతన్నలు, యువతరం కలిసి కాంగ్రెస్‌ను తన్ని తరమాలని పిలుపునిచ్చారు. రేవంత్ ఒక్కడు దొరికితే యువకులు పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారని చెప్పారు. మంగళవారం మంచిర్యాలలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కల్లాల వద్ద గోడ కూలి మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ తరిమికొడతారు. తెలంగాణ యువత తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకి రాలేడు. తెలంగాణ రైతన్నలు యువతరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరుముతారు. కాంగ్రెస్‌ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో తిరిగి వస్తుంది. ఢిల్లీలో వేలాది మంది యువత పార్లమెంట్ వద్ద నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దృశ్యాలను దేశం చూసింది. అదే పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతుంది. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించే పరిస్థితి వస్తుంది. యువత మరోసారి తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. నిరుద్యోగులను నిండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ యువత నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు అని కేటీఆర్ అన్నారు.

యువసంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఎలా మోసం చేసిందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచాం. ఆ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించినా నిరుద్యోగ యువత వదిలిపెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినట్లే యువత మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడే పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టిస్తోంది. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని ఆయన మండిపడ్డారు.
మోసపోతే గోసపడుతం అని కేసీఆర్ ఆనాడే చెప్పారు..
రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చలేదు. "మోసపోతే గోసపడుతాం" అని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎనిమిది గంటలపాటు ధర్నా చేసినా ప్రభుత్వం మనసు కరగలేదు. రెండున్నర నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదు అని కేటీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా కూడా ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందాయని గుర్తుచేశారు. షాపుల్లో దొరికే యూరియాను యాప్ ద్వారా ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కాటేస్తోందని మండిపడ్డారు. నాలుగు విడతల రైతుబంధు నిధులను కూడా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు.
కరువుకు శాశ్వత పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ కావాలనే కాళేశ్వరాన్ని వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాళేశ్వరం ద్వారా మూడు మార్గాల్లో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు. మేడిగడ్డకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. కన్నెపల్లి వద్ద 94 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోందని, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను సమన్వయంతో నడిపితే ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చన్నారు.
మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగి 36 నెలలు గడిచినా మరమ్మతులు ఎందుకు చేపట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారన్నారు. రూ.400 కోట్లతో మరమ్మతులు చేస్తామని చెప్పిన వారినే ప్రభుత్వం బెదిరించి పంపించిందని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తవద్దని ఎన్‌డీఎస్‌ఏ ఎక్కడా చెప్పలేదని, రిటైర్డ్ ఇంజినీర్ల బృందం పదేపదే ఇదే విషయాన్ని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తిట్లు తిట్టడం తప్ప పాలన తెలియదని, రైతులు నీళ్లు అడిగితే రక్తం చల్లాలంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ ప్రశ్న అడిగినా "నీ జాతి ఏంటి?" అని ఎదురుదాడి చేయడం ముఖ్యమంత్రికి అలవాటైందని విమర్శించారు.

తెలంగాణలో మళ్లీ రైతు ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ నాయకులను ప్రజలు రాజకీయంగా ఉరికించి తరిమికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే రైతులకు, యువతకు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మంచిర్యాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను వేధించే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాంగ్రెస్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడొద్దన్నారు. ఏడు సముద్రాలు దాటి దాక్కున్నా ప్రజలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






