త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGHRC | బాచుప‌ల్లిలో ఎస్టీపీ క్లీన్ చేస్తుండ‌గా ముగ్గురు మృతి.. సుమోటోగా విచార‌ణ‌కు స్వీక‌రించిన‌ టీజీహెచ్ఆర్సీ

TGHRC | మియాపూర్ బాచుప‌ల్లి ప‌రిధిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో సెప్టిక్ ట్యాంక్ / సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) సంప్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చడం వల్ల ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, సుమోటోగా విచారణకు స్వీకరించింది.

S

Telangana | Published On Nov 25, 2026, 2.36 pm IST

TGHRC | బాచుప‌ల్లిలో ఎస్టీపీ క్లీన్ చేస్తుండ‌గా ముగ్గురు మృతి.. సుమోటోగా విచార‌ణ‌కు స్వీక‌రించిన‌ టీజీహెచ్ఆర్సీ
Advertisement

TGHRC | త్రినేత్ర న్యూస్ : మియాపూర్ బాచుప‌ల్లి ప‌రిధిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో సెప్టిక్ ట్యాంక్ / సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) సంప్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చడం వల్ల ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఈ ఘటనకు సంబంధించిన వార్తలు న‌వంబ‌ర్ 25న ఆంధ్రజ్యోతి, సాక్షి, ది హిందూ, డెక్కన్ క్రానికల్, ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, నమస్తే తెలంగాణ, దిశ తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండానే సెప్టిక్ ట్యాంక్ / ఎస్టీపీ సంప్ శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ విషాద ఘటనపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన శుభ్రపరిచే పనుల సమయంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం, రక్షణకు సంబంధించిన అంశాలతో పాటు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించడంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఉల్లంఘనలపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది.

ఘటనకు దారితీసిన పరిస్థితులు, సెప్టిక్ ట్యాంకులు / ఎస్టీపీ సంప్‌ల శుభ్రపరిచే పనులకు వర్తించే భద్రతా చర్యలు, నిబంధనలు, అపార్ట్‌మెంట్ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యతలు, నిర్వహించిన తనిఖీలు / విచారణ వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యలపై నివేదిక సమర్పించాల‌ని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు.

ముగ్గురు కార్మికుల మృతికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టిన విచారణ వివరాలు, మృతుల కుటుంబాలకు అందించిన లేదా అందించనున్న సహాయం, ఎక్స్‌గ్రేషియా పరిహారం, ఇతర సహాయ చర్యల వివరాలు, అలాగే బాధిత కుటుంబాల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. సంబంధిత అధికారులు తమ నివేదికలను డిసెంబ‌ర్ 22 లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

Advertisement
Advertisement