త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGEJAC | డీఏల‌పై మెలిక‌.. ఉద్యోగ సంఘాల్లో చీలిక‌

TGEJAC | సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల‌కు గానూ రెండు డీఏలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింద‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్ర‌క‌టించ‌డంతో.. ప్ర‌భుత్వ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ద‌సరా పండుగ‌కు ఒక డీఏ, వ‌చ్చే ఏడాది ఉగాది పండుగ‌కు మ‌రో డీఏ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ప్ర‌క‌టించ‌డంతో సంతోష‌ప‌డ్డారు. కానీ ఆ సంతోషం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆవిరైపోయింది.

S

Telangana | Published On Sep 23, 2026, 6.31 pm IST

TGEJAC | డీఏల‌పై మెలిక‌.. ఉద్యోగ సంఘాల్లో చీలిక‌
Advertisement

రెండు డీఏలకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌న్న ల‌చ్చిరెడ్డి
అది ప్ర‌తిపాద‌న మాత్ర‌మే అన్న మారం జ‌గ‌దీశ్వ‌ర్
నాలుగు డిమాండ్ల‌పై స్ప‌ష్ట‌త ఎక్క‌డా అని నిల‌దీత‌
సీఎస్‌తో చ‌ర్చ‌లు అసంతృప్తిక‌ర‌మ‌న్న టీజీఈజేఏసీ
ఉద్యోగ సంఘాల ప్ర‌క‌ట‌న‌ల‌పై గంద‌ర‌గోళం

TGEJAC | త్రినేత్ర న్యూస్ : సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల‌కు గానూ రెండు డీఏలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింద‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్ర‌క‌టించ‌డంతో.. ప్ర‌భుత్వ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ద‌సరా పండుగ‌కు ఒక డీఏ, వ‌చ్చే ఏడాది ఉగాది పండుగ‌కు మ‌రో డీఏ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ప్ర‌క‌టించ‌డంతో సంతోష‌ప‌డ్డారు. కానీ ఆ సంతోషం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆవిరైపోయింది. ఎందుకంటే టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేత‌లు.. రెండు డీఏల‌ను ఇవ్వాల‌ని కేబినెట్ ముందు ప్ర‌తిపాదిస్తామ‌ని మాత్ర‌మే సీఎస్ చెప్పార‌ని ప్ర‌క‌టించ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం కూడా స్పందించ‌లేదు.

రెండు డీఏల‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింది : ల‌చ్చిరెడ్డి

బుధ‌వారం స‌చివాల‌యంలో సీఎస్ సంజ‌య్ జాజుతో స‌మావేశం అనంత‌రం తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ... సీఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లతో ఈనెల 6న ఉద్యోగ సంకల్ప సభ నిర్వహించాం. మొత్తం 68 డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకు ప్రభుత్వం సానుకులంగా స్పందించింది.. అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం చూపించింది. తమ డిమాండ్ల విషయంలో చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ సంజయ్‌ జాజుకు ధన్యవాదాలు. మొదటి డీఏ 3.64, రెండో డీఏ 2.74 కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కమిటీ నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని లచ్చిరెడ్డి పేర్కొన్నారు.

ఆ నాలుగు డిమాండ్ల‌పై స్ప‌ష్ట‌త ఏదీ..? : మారం జ‌గ‌దీశ్వ‌ర్

ఉద్యోగ, ఉపాధ్యాయు గెజిటెడ్ పెన్షనర్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ప్రతిపాదించిన నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూతో జరిగిన చర్చలు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండానే ముగిశాయని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు. అయితే, టీజీఈజేఏసీ ప్రధానంగా లేవనెత్తిన నాలుగు డిమాండ్లలో ఏ ఒక్క అంశంపైనా నేడు స్పష్టమైన టీజీఈజేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

స‌మావేశంలో సీఎస్ ఏమ‌న్నారంటే..?

దసరాకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని, అయితే దీనిని కేబినెట్‌కు తాము కేవలం ప్రతిపాదిస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. నెలకు గతంలో లాగ రూ. 2,000 కోట్ల విలువైన పెండింగ్ బిల్లులు చెల్లించాలని టీజీఈజేఏసీ కోరగా, నెలకు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ. 1,000 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు చేయగలమని ప్రభుత్వం తెలిపింది. పీఆర్సీ నివేదిక ఈ రోజు వరకు తెప్పించకుండా ఒకటి లేదా రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని, అనంతరం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం దాట వేసే ప్రయత్నం చేసింది. సీపీఎస్‌పై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ, కమిటీ ఏర్పాటుకు లేదా నివేదికకు ఎలాంటి కాలపరిమితిని వెల్లడించలేదు. కమిటీని ఏర్పాటు చేయలేదు ముఖ్యంగా 2024 సెప్టెంబ‌ర్ 1వ తేదీ నాటికి నియమితులైన ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశాలపై బుధ‌వారం జరిగిన సమావేశంలో స్పష్టమైన నిర్ణయం, లేదా కాలపరిమితి లేకపోవడంతో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా భావిస్తున్నామని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు.

ఉద్యోగ సంఘాల్లో చీలిక‌

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజుతో చ‌ర్చ‌ల అనంద‌రం ఉద్యోగ సంఘాల్లో చీలిక వ‌చ్చింది. రెండు డీఏలు ఇస్తామన్న ప్ర‌భుత్వ హామీని రెవెన్యూ సంఘం స్వాగతించింది. అయితే, రెండు డీఏలకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించడం పట్ల టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పెండింగ్ బిల్లులపై సీఎం, డిప్యూటీ సీఎం హామీ ఇవ్వాలని కోరుతున్నాయి.

Advertisement
Advertisement