Bhatti Vikramarka | నీళ్లే కాదు.. కరెంట్‌ను కూడా పొదుపుగా వాడుకోండి
Bhatti Vikramarka | ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో వర్షాలు లేవు.. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ లేదు. ఈ కరువు వల్ల ఒక్క నీళ్లకే సమస్య వచ్చి పడలేదు. కరెంట్‌కు కూడా ఇబ్బందే. ఎందుకంటే సరైన నీరు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి చేయడం కష్టమే. మొత్తానికి మొత్తం థర్మల్ విద్యుత్ పైనే ఆధారపడితే.. బొగ్గును సమకూర్చుకోవడం కూడా కష్టమే. ఈ కరువు నేపథ్యంలో నీళ్లనే కాదు.. కరెంట్‌ను కూడా పొదుపుగా వాడుకోవాలని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
సమస్య తీవ్రతను ముందే గ్రహించాలి
తాగునీటికి, ఆహారానికి ఇబ్బందులు తలెత్తొద్దు
కరువు సమస్యను ప్రతి ఇంటికి చేరవేస్తున్నాం
తెలంగాణలో గరిష్ట స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
థర్మల్ విద్యుత్‌ను క్రమబద్దంగా వినియోగించండి
పగటిపూట సోలార్ పవర్ వాడండి..
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో వర్షాలు లేవు.. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ లేదు. ఈ కరువు వల్ల ఒక్క నీళ్లకే సమస్య వచ్చి పడలేదు. కరెంట్‌కు కూడా ఇబ్బందే. ఎందుకంటే సరైన నీరు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి చేయడం కష్టమే. మొత్తానికి మొత్తం థర్మల్ విద్యుత్ పైనే ఆధారపడితే.. బొగ్గును సమకూర్చుకోవడం కూడా కష్టమే. ఈ కరువు నేపథ్యంలో నీళ్లనే కాదు.. కరెంట్‌ను కూడా పొదుపుగా వాడుకోవాలని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోలార్ పవర్‌ను సమర్థవంతంగా వాడుకుంటూ, తదుపరి అవసరాలకు థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా వినియోగించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు" అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు ఆయన రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. "కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సమస్య తీవ్రతను ముందే గ్రహిస్తే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సొంతంగా సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతుంది" అని అన్నారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకూడదు..
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషింపజేసి, సమర్థవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, సాగునీటితో పాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఎవరికి వారు సంసిద్ధమయ్యేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో టీవీ ఛానెళ్లు తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని అభినందించారు.
సౌర విద్యుత్ వల్ల తగ్గనున్న ఆర్థిక భారం
మన జీవన విధానంలో విద్యుత్ అత్యంత ప్రధానమైనదని, ఎల్ నినో వల్ల పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన 'ఎనర్జీ మేనేజ్‌మెంట్' అమలు చేస్తోందని వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను (సోలార్ పవర్) గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. సోలార్ సమయాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ, తదుపరి అవసరాలకు థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా వినియోగించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని స్పష్టం చేశారు.
వర్షాకాలంలోనూ 'వేసవి' స్థాయి డిమాండ్
ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి అనే తేడా లేక ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, బోర్‌వెల్స్ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వాడకం భారీగా పెరిగిందన్నారు. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, కానీ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుత డిమాండ్ ఏప్రిల్ (వేసవి) నాటి గరిష్ట (పీక్) స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో తెలంగాణ ముందుంటుందని తెలిపారు. ఏసీలు, ఫ్యాన్లు, మోటార్ల వాడకంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
సమాజంలో చైతన్యం తీసుకురావాలి..
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి విషయ నిపుణులను ఆహ్వానించి ఈ సదస్సును ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను భట్టి విక్రమార్క అభినందించారు. వ్యవసాయ, విద్యుత్, సాగునీటి భూగర్భ జల శాఖలతో పాటు అనుబంధ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుని సదస్సును నిర్వహించడం ప్రణాళికా శాఖ ప్రతిభకు, సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. ఇటువంటి అవగాహన సదస్సులను భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేస్తూ పూర్తి స్థాయి చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాలనాధికారులు తమ విధులతో పాటు సమాజానికి మేలు చేసే ఇటువంటి అంశాలలో ప్రజలను చైతన్యవంతం చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి పాటిల్ ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






