త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha Resignation | రాజీనామా చేయండి.. సురేఖకు హైకమాండ్ ఆదేశం

సీఎం రేవంత్‌పై కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

J

Telangana | Published On Aug 24, 2026, 7.18 pm IST

Konda Surekha Resignation | రాజీనామా చేయండి.. సురేఖకు హైకమాండ్ ఆదేశం
Advertisement
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్
  • మంత్రి పదవి నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని (రాజీనామా) కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు
  • ఓ సీనియర్ మంత్రి ద్వారా కొండా సురేఖకు వర్తమానం పంపిన ఢిల్లీ పెద్దలు
  • ఉమ్మడి వరంగల్ నేతల మద్దతు కరువు
  • ఖర్గేను కలిసినా దక్కని భరోసా

Konda Surekha Resignation | త్రినేత్ర.న్యూస్: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గౌరవ ప్రదంగా తప్పుకోవాల్సిందిగా కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే.. ఈ ఆదేశాలను నేరుగా ఆమెకు కాకుండా.. ఓ సీనియర్ మంత్రి ద్వారా చెప్పించినట్టు తెలిసింది. ఆ సీనియర్ మంత్రి.. మంత్రి కొండా సురేఖను పిలిపించుకొని మాట్లాడారు.. హై కమాండ్ ఆదేశాన్ని పాటించాల్సిందిగా ఆమెకు చెప్పినట్టు సమాచారం.

ఆయనతోనే చెప్పిస్తున్నారు

మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కాంగ్రెస్ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ వేర్వేరుగా అధిష్టానానికి నివేదికలు పంపారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకున్నారు. పార్టీకి నష్టం కాకూడదనే కోణంలో వారు కలగజేసుకొని సమస్యను సమసిపోయేలా చేశారు. అయితే ఈ సారి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు అటు పార్టీకి..ఇటు ప్రభుత్వానికి మరోవైపు ముఖ్యమంత్రి పరువుకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉండడంతో ఇక అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. అయితే.. గతంలో సురేఖ వ్యవహారంలో కలగజేసుకున్న సీనియర్ మంత్రికే ..అధిష్టానం నేరుగా ఫోన్ చేసింది. చర్యలు తీసుకునే కన్నా..ఆమె గౌరవ ప్రదంగా తప్పుకుంటే బావుంటుందని సలహా ఇచ్చింది. దీంతో సదరు మంత్రి కొండా సురేఖను పిలిపించుకొని భేటీ అయ్యారు. అధిష్టానం వద్ద ఉన్న అన్ని నివేదికల సారాంశాన్ని ఆమెకు వివరించారు. ఒకట్రెండు రోజులు సమయం తీసుకొని .. రాజీనామా సమర్పించాల్సిందిగా.. సురేఖకు సలహా ఇచ్చినట్టు సమాచారం.

సురేఖకు మద్దతు కరువు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేపథ్యం కలిగిన కొండా సురేఖకు ఈ దఫా ఏ ఎమ్మెల్యే నుంచి కూడా మద్దతు లభించలేదు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయన్న భావనలో అధిష్టానం ఉండడంతో ఎవ్వరూ..సురేఖకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆదివారం సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను కలిసి అనేక అంశాలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. భేటీలో ఆమెకు అనుకూల హామీ రాలేదని సమాచారం. ఇక ఆలస్యం చేయకుండా.. సురేఖ పై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం..తనదైన శైలిలో ఆ బాధ్యతను సీనియర్ మంత్రి కి అప్పగించింది.ఈ ఎపిసోడ్ లో మిగిలింది మంత్రి కొండా సురేఖ నిర్ణయమే.

Advertisement
Advertisement