CM Revanth Reddy | తెలంగాణ టార్గెట్.. దేశ జీడీపీలో 10 శాతం
CM Revanth Reddy | తెలంగాణను దేశంలోనే కీలక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో 'తెలంగాణ రైజింగ్ 2047' పాలసీని రూపొందించినట్లు వెల్లడించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
- 2047 నాటికి గ్లోబల్ ఎకనామిక్ పవర్‌గా తెలంగాణ
- వచ్చే రెండేళ్లలో మిగిలిన హామీలన్నీ అమలు చేస్తాం
- కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి.. కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోను
- మోదీ హయాంలో రూ.120 లక్షల కోట్ల అప్పులు.. అదానీకి అండగా కేంద్రం
- అమిత్ షాకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి
- విద్య, ఉపాధి, పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | తెలంగాణను దేశంలోనే కీలక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో 'తెలంగాణ రైజింగ్ 2047' పాలసీని రూపొందించినట్లు వెల్లడించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామని తెలిపారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలను అమలు చేసిందని, వచ్చే రెండేళ్లలో మిగిలిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రకటించారు. అభివృద్ధి లక్ష్యాలతోపాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీఆర్ఎస్ నాయకత్వం, విద్య, ఉపాధి, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కుపై వేట.. మోదీ పాలనపై నిప్పులు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న పేదల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరిగినప్పుడు ప్రపంచంలో ఎవరైనా స్పందించవచ్చని పేర్కొన్నారు. చెగువేరా ప్రపంచంలో ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లి పోరాటం చేశారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్.. గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధి అంటే ప్రతి పేదవాడి అభివృద్ధిగా భావించారని, కానీ మోదీ పాలనలో జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మోదీ 12 ఏళ్లలో సృష్టించిన భయాన్ని యువత 12 రోజుల్లో తొలగించిందని వ్యాఖ్యానించారు. మోదీ విదేశీ పర్యటనలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఆయన 'విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా'గా మారారని అన్నారు. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడుతుందని, ఆ పార్టీకి ప్రజాసేవ కంటే అధికారం ముఖ్యమని విమర్శించారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నంతకాలం కాంగ్రెస్ ఉంటుందని, మరో వెయ్యి సంవత్సరాలు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తరఫున కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.

మోదీని కలిస్తే తప్పేంటి?.. కేసీఆర్‌నైనా కలుస్తా
ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్‌కు వెళ్లి బిర్యానీ తిని వచ్చారని, అలాంటప్పుడు తాను మోదీని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఖేలో ఇండియా కార్యక్రమానికి 8 వేల మంది క్రీడాకారులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీని ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలా వద్దా అన్నది ఆయన ఇష్టమని, తాను తన మర్యాదను చూపించానని పేర్కొన్నారు. తాను ఏబీవీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ అవసరమని భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని వివరించారు. రాహుల్ గాంధీ తన నాయకుడని, కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయనే నాయకుడని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా పెద్దగా పాత్ర లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే బీజేపీకి ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. యాత్రల కోసం నాయకులు వస్తుంటారని, వెళ్లిపోతుంటారని, వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తామని అన్నారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని సవాల్ విసిరారు.
నా కథలో కేసీఆర్ రావణాసురుడు
బీఆర్ఎస్ నాయకత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, కేటీఆర్‌ను మాత్రం సీరియస్‌గా తీసుకోనని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో తండ్రిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ నాయకుడయ్యారని విమర్శించారు. కేటీఆర్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. తనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల టీమ్ అని, ప్రజల కోసమే పోరాడుతానని చెప్పారు. 17 ఏళ్లకే తెలంగాణ సీఎం అయ్యానని, స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏ టీమ్‌కు చెందిన వ్యక్తో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఫూల్స్ ప్యారడైజ్‌లో ఉన్నారని, ఇటీవలే సిద్ధిపేటకు వెళ్లి కాంగ్రెస్ జెండా ఎగురవేసి వచ్చామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన కథలో కేసీఆర్ రావణాసురుడని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఉండాలనే ఆ పార్టీ కొనసాగుతోందని, లేకుంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లమని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది కేసీఆరేనని, ఇప్పుడు అదే అంశం ఆయనను చుట్టుకుందని విమర్శించారు.
మోదీ హయాంలో అప్పులు రూ.120 లక్షల కోట్లు
దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధానుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకువస్తే, మన్మోహన్ సింగ్ వాటిని కొనసాగించారని వివరించారు. మోదీకి ముందు ప్రధానుల హయాంలో దేశ అప్పులు రూ.53 లక్షల కోట్లుగా ఉండగా, గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రూ.120 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ అదానీ జేబులో వేస్తోందని విమర్శించారు. అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం అదానీ జేబులో నుంచి నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి, యువత ఉపాధికి వినియోగిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అందే విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, దీనివల్ల పాఠశాలల్లో హాజరు శాతం పెరిగిందని వెల్లడించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయడానికి ఇంటర్ కాలేజీలు దూరంగా ఉండటం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారని, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
ఐటీఐలకు కొత్త రూపు.. రూ.4వేల కోట్లతో ఐటీసీలు
ఐటీఐల్లో పాతకాలపు విద్యా విధానమే కొనసాగుతోందని, అందుకే వాటిని ఐటీసీలుగా మారుస్తున్నామని సీఎం తెలిపారు. ఐటీసీల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో టాటా సంస్థ 86 శాతం వ్యయాన్ని భరిస్తోందని వివరించారు. విద్యార్థులు కేవలం కంపెనీల్లో ఉద్యోగాలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో సొంత కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలు తెలంగాణలో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయబోతున్నాయని వెల్లడించారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అన్ని అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని ప్రపంచ పారిశ్రామిక పటంలో కీలక కేంద్రంగా నిలపాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
సీట్ల పెంపుతో దక్షిణాదికి అన్యాయం?
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రాల జనాభా, జీడీపీ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని సూచించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా అమలైతే దక్షిణ భారతదేశ ప్రాధాన్యత తగ్గిపోతుందని, ఉత్తర భారతదేశ సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫార్ములాతో దేశంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఎంతో కీలకమని, వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతోనే కూలిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణకు రొనాల్డోను తీసుకొస్తాం
తెలంగాణలో క్రీడలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే మెస్సీని తీసుకువచ్చామని చెప్పారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో మారడోనా కూడా తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడని వెల్లడించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన స్నేహితుడని పేర్కొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ విధానం
బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు కూడా గుర్తుకు రావడం లేదని, నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లినప్పుడు వారిని గుర్తుపట్టేందుకు నేమ్ బోర్డులు చూడాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మోదీ, అమిత్ షాలు హిందువులను ఒకటి చేయడానికి ప్రయత్నిస్తుంటే, అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలను ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తోందని చెప్పారు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీలను కూడా కలుపుకుని వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ మైనారిటీ రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు

Rafale fighter jets | రఫేల్ యుద్ధవిమానాలు అదృశ్యమంటూ వార్తలు.. ఖండించిన ఐఏఎఫ్ మాజీ అధికారి

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే




