త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Budget 2026-27 | తెలంగాణ బడ్జెట్ 2026-27 హైలైట్స్: రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్.. విద్య, వ్యవసాయానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్ల భారీ అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో నూతన పథకాలకు శ్రీకారం చుడుతూ, కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయించారు.

J

Telangana | Published On Mar 20, 2026, 12.33 pm IST

Telangana Budget 2026-27 | తెలంగాణ బడ్జెట్ 2026-27 హైలైట్స్: రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్.. విద్య, వ్యవసాయానికి పెద్దపీట!

సంక్షిప్త సారాంశం

తెలంగాణ ప్రజా ప్రభుత్వం వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను సమర్పించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌లో పల్లెల అభివృద్ధి, విద్య, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అగ్ర ప్రాధాన్యం దక్కింది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కల్పించే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా', విద్యార్థులకు 'బ్రేక్ ఫాస్ట్ పథకం', ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య భద్రత (EHS) వంటి విప్లవాత్మక పథకాలను ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Telangana Budget 2026-27 | తెలంగాణ రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20, 2026న శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. పన్నుల భారం లేకుండా సమతుల్యంగా ఈ బడ్జెట్‌ను తీసుకువచ్చినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

బడ్జెట్ స్వరూపం (రూపాయల్లో):

  • మొత్తం బడ్జెట్ అంచనా: రూ. 3,24,234 కోట్లు.
  • రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు.
  • మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు

తలసరి ఆదాయం: 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931 కి చేరుకుంది. ఇది దేశ సగటు కంటే 1.9 రెట్లు ఎక్కువ.

వృద్ధి రేటు: తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదైంది.

భవిష్యత్ లక్ష్యం: 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర అభివృద్ధి జోన్లు: రాష్ట్రాన్ని CURE (కోర్ అర్బన్), PURE (పెరి-అర్బన్), RARE (రూరల్ అగ్రి) అనే మూడు ప్రధాన ఆర్థిక మండలాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు.

కొత్తగా ప్రకటించిన కీలక పథకాలు ఇవే!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: జూన్ 2, 2026 నుండి రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు.

విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం: ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా అందిస్తారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ఇప్పటి వరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నారు.

ఉద్యోగులకు నగదు రహిత వైద్యం (EHS): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తారు. దీని ద్వారా 1,998 వ్యాధులకు 421 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు.

ఉద్యోగులకు ప్రమాద బీమా: ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 1 కోటి 20 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.

సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం: రాష్ట్ర యువతకు విదేశాల్లో (UAE, జర్మనీ తదితర దేశాల్లో) సురక్షితమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

వివిధ శాఖలకు నిధుల కేటాయింపు (రూపాయల్లో)

బడ్జెట్‌లో సంక్షేమానికి, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ శాఖల వారీగా చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.

  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి: రూ. 33,688 కోట్లు.
  • విద్యా రంగం: రూ. 26,674 కోట్లు.
  • వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ. 23,179 కోట్లు.
  • నీటి పారుదల శాఖ: రూ. 22,615 కోట్లు.
  • విద్యుత్ శాఖ: రూ. 21,285 కోట్లు.
  • పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ: రూ. 17,907 కోట్లు.
  • వైద్య, ఆరోగ్య శాఖ: రూ. 13,679 కోట్లు.
  • రోడ్లు, భవనాలు, రవాణా శాఖ: రూ. 12,789 కోట్లు.
  • బీసీ (BC) సంక్షేమం: రూ. 12,511 కోట్లు.
  • హోం శాఖ (పోలీస్): రూ. 11,907 కోట్లు.
  • ఎస్సీ (SC) సంక్షేమం: రూ. 11,784 కోట్లు.
  • ఎస్టీ (ST) సంక్షేమం: రూ. 7,937 కోట్లు.
  • గృహ నిర్మాణ శాఖ (ఇందిరమ్మ ఇండ్లు): రూ. 7,430 కోట్లు.
  • పౌర సరఫరాల శాఖ: రూ. 7,366 కోట్లు.
  • మైనారిటీ సంక్షేమం: రూ. 3,769 కోట్లు.
  • పరిశ్రమల శాఖ: రూ. 3,490 కోట్లు.
  • మహిళ, శిశు సంక్షేమం: రూ. 3,143 కోట్లు.
  • న్యాయ శాఖ: రూ. 2,367 కోట్లు.
  • పశు సంవర్థక, మత్స్య శాఖ: రూ. 1,529 కోట్లు.
  • పర్యాటక రంగం: రూ. 1,224 కోట్లు.
  • కార్మిక సంక్షేమ శాఖ: రూ. 998 కోట్లు.
  • ఐటీ (IT) శాఖ: రూ. 875 కోట్లు.
  • చేనేత రంగం: రూ. 258 కోట్లు.

ప్రత్యేక కేటాయింపులు

రాజీవ్ యువ వికాసం పథకం: యువత ఆర్థిక స్వయంసమృద్ధికి రూ. 6,000 కోట్లు.

గోదావరి పుష్కరాలు (2027): ఘనంగా నిర్వహించేందుకు రూ. 500 కోట్లు.

హాస్టళ్ల వంటశాలల ఆధునీకరణ: విద్యార్థుల ఆరోగ్యం కోసం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల కిచెన్ల ఆధునీకరణకు రూ. 100 కోట్లు.

Advertisement

తాజావార్తలు

Advertisement