త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

తగిన కారణం లేకుండా భర్త తల్లిదండ్రులకు దూరంగా 'వేరు కాపురం' పెట్టాలని భార్య డిమాండ్ చేయడం చట్టప్రకారం క్రూరత్వం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

J

National | Published On Aug 6, 2026, 11.00 pm IST

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

సంక్షిప్త సారాంశం

ఎలాంటి బలమైన కారణం లేకుండా అత్తమామల నుంచి వేరు కాపురం కావాలని పట్టుబట్టడం విడాకులకు దారి తీస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దుబాయ్‌లో ఉంటున్న భర్తను వదిలి కేరళ వచ్చిన భార్య.. అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెడితేనే వస్తానని కండీషన్ పెట్టింది. భార్య ఆరోపణల్లో వాస్తవం లేదని, వేరుగా ఉండాలన్న ఆమె డిమాండ్‌కు సరైన కారణం లేదని హైకోర్టు ఆధారాలతో సహా తేల్చింది. దీంతో కింది కోర్టు తీర్పును కొట్టివేస్తూ, భర్తకు విడాకులు (Divorce) మంజూరు చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.

Advertisement

Wife Demanding Separate Residence | త్రినేత్ర.న్యూస్ : వివాహ బంధంలో భార్యాభర్తల (Husband and Wife) మధ్య మనస్పర్ధలు సహజమే. అయితే, ఎలాంటి బలమైన కారణం లేకుండా భర్త తల్లిదండ్రులకు దూరంగా 'వేరు కాపురం' పెట్టాలని భార్య డిమాండ్ చేయడం చట్టప్రకారం క్రూరత్వం (Cruelty) కిందకే వస్తుందని కేరళ హైకోర్టు (Kerala High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ సతీష్ నైనన్, జస్టిస్ పి. కృష్ణకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ (Division Bench) ఒక విడాకుల కేసులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

కేసు నేపథ్యం ఏంటంటే..

దుబాయ్‌లో నివాసం ఉంటున్న ఒక జంట మధ్య తలెత్తిన వివాదం ఈ కేసుకు కారణం. వివాహమైన తర్వాత దుబాయ్‌లో అత్తమామలతో కలిసే భార్య కాపురం చేసింది. అయితే, ఏడో నెల గర్భంతో ఉన్నప్పుడు కేరళకు వచ్చిన ఆమె.. బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి దుబాయ్ వెళ్లేందుకు నిరాకరించింది. భర్తతో కనీసం మాట్లాడకుండా, కాల్స్ బ్లాక్ చేసి తన సోదరుడి ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేసిందని భర్త కోర్టుకు తెలిపాడు. అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెడితేనే తిరిగి వస్తానని ఆమె కండీషన్ పెట్టినట్లు భర్త తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన ప్రమేయం లేకుండానే బిడ్డకు నామకరణం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు కూడా చేసేశారని ఆరోపించాడు.

ఫ్యామిలీ కోర్టు తీర్పు.. హైకోర్టులో అప్పీల్

మొదట కాపురం కోసం (Restitution of conjugal rights) భర్త పిటిషన్ వేసినా, కౌన్సెలింగ్‌లోనూ భార్య వేరు కాపురం డిమాండ్‌కే కట్టుబడి ఉండటంతో.. పరిష్కారం లేక విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును (Family Court) ఆశ్రయించాడు. అయితే, అత్తమామలు తనను సరిగా చూసుకోలేదని, అందుకే విడిగా ఉండాలని నిర్ణయించుకున్నానని భార్య వాదించింది. భార్య వాదనను సమర్థించిన ఫ్యామిలీ కోర్టు.. విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో న్యాయం కోసం భర్త కేరళ హైకోర్టులో అప్పీల్ చేశాడు.

ఆడియో కాల్స్‌తో బట్టబయలైన నిజం

ఈ కేసు విచారణలో భర్త సమర్పించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కీలకంగా మారాయి. అత్తమామలు, భర్తతో తనకు ఎలాంటి సమస్యా లేదని ఒక ఆడియోలో భార్య స్వయంగా తన మామగారితో మాట్లాడుతూ ఒప్పుకుంది. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఈ విషయాన్ని ఆమె అంగీకరించింది. దీని ఆధారంగా.. భార్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని హైకోర్టు తేల్చింది.

"సరైన కారణం లేకుండా భర్త కుటుంబాన్ని వదిలి వేరుగా నివసించాలని డిమాండ్ చేయడం, విడిగా ఉండటం ముమ్మాటికీ క్రూరత్వం కిందకే వస్తుంది" అని కోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి జస్టిఫికేషన్ లేకుండా భర్తను వదిలేసినందుకు గాను.. భర్తకు విడాకులు (Divorce) మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.

Advertisement
Advertisement