త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urea | సినిమా టికెట్ల మాదిరే.. ఆన్‌లైన్‌లో యూరియా బుక్ చేసుకోవ‌చ్చు..

Urea | యూరియా కోసం రైతులు ఇక నుంచి క‌ష్టాలు ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇంట్లో ఉండి సినిమా టికెట్ల‌ను బుక్ చేసుకున్న‌ట్టే.. ఆన్‌లైన్‌లోనే యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించేందుకు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ క‌స‌ర‌త్తు చేస్తుంది.

S

Telangana | Published On Dec 16, 2025, 5.05 pm IST

Urea | సినిమా టికెట్ల మాదిరే.. ఆన్‌లైన్‌లో యూరియా బుక్ చేసుకోవ‌చ్చు..
Advertisement

Urea | హైద‌రాబాద్ : విత్త‌నాలు, ఎరువుల కోసం రైతులు వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యాల ముందు బారులు తీరుతున్న ఘ‌ట‌న‌ల‌ను రోజూ ఎక్క‌డో ఒక చోట చూస్తూనే ఉంటాం. ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క ఎరువులు, విత్త‌నాల కోసం ప‌డిగాపులు కాస్తూనే ఉంటారు. కానీ చివ‌రి రైతు వ‌ర‌కు అవి అంద‌వు. దాంతో చాలా మంది అన్న‌దాతులు నిరాశ‌తోనే వెనుతిరుగుతారు. మ‌రి ముఖ్యంగా యూరియా కోసం రైతులు ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతుంటారు. అయితే యూరియా కోసం రైతులు ఇక నుంచి క‌ష్టాలు ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇంట్లో ఉండి సినిమా టికెట్ల‌ను బుక్ చేసుకున్న‌ట్టే.. ఆన్‌లైన్‌లోనే యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించేందుకు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ క‌స‌ర‌త్తు చేస్తుంది.

ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అగ్రిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బీ గోపి ప‌లు విష‌యాల‌పై మాట్లాడారు. వ్య‌వ‌సాయానికి శాస్త్ర సాంకేతిక‌త‌ను జోడిస్తున్నామ‌ని తెలిపారు. యూరియా పంపిణీ కోసం ప్ర‌త్యేక యాప్‌ను తీసుకురాబోతున్నామ‌ని పేర్కొన్నారు. యూరియా కొనుగోలు కోసం ఈపాస్ సిస్ట‌మ్‌ను అవ‌లంభిస్తామ‌న్నారు. ల్యాండ్ రికార్డు ఆధారంగా యూరియా స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. గ‌తంలో యూరియా బ‌స్తాలు ప‌క్క‌దారి ప‌ట్టేవ‌ని, భ‌విష్య‌త్‌లో ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉండాల‌నే ఆలోచ‌న‌తోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ యాప్‌లో ఆన్‌లైన్‌లోనే ఇంటి నుంచి యూరియాను బుక్ చేసుకోవ‌చ్చ‌ని డైరెక్ట‌ర్ గోపి తెలిపారు. ఈ యాప్‌ను ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్ఐసీ రూపొందించింద‌ని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10వేల యూరియా పంపిణీ కేంద్రాలు ఉన్నాయ‌ని, ఈ సంఖ్య‌ను పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. వీటిలో 30 శాతం కేంద్రాలు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉంటే, మిగ‌తా 70 శాతం ప్ర‌యివేటు సంస్థ‌ల చేతిలో ఉన్నాయ‌న్నారు. మొత్తంగా ⁠యూరియా పంపిణి ఒకే వద్ద కాకుండా డిసెంట్రలైజ్డ్ చేయాలని చూస్తున్నామ‌ని తెలిపారు. ⁠దాని కోసం అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

యూరియా కోసం ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

యూరియా కావాల‌నుకునే ప్ర‌తి ఒక్క రైతు ప‌ట్టాదార్ పాస్ బుక్ క‌లిగి ఉండాలి. మొబైల్ నంబ‌ర్ కూడా త‌ప్ప‌నిస‌రి. ప‌ట్టాదారు పాస్‌బుక్ వివ‌రాల‌ను మొద‌ట యాప్‌లో న‌మోదు చేయాలి. వెంట‌నే ఆ స‌మాచారం సంబంధిత జిల్లాకు చేరుతుంది. బుకింగ్ ఐడీ కూడా జ‌న‌రేట్ అవుతుంది. ఇది 24 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేస్తుంది. ఆ లోపు యూరియా పంపిణీ కాక‌పోతే.. మరోసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా మన జిల్లాలో, మండలంలో, గ్రామంలో ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.

కౌలు రైతుల‌కు కూడా యూరియా స‌ర‌ఫ‌రా

కౌలు రైతులు కూడా బుక్ చేసుకొని యూరియా తీసుకోవచ్చు. ఆధార్ వివ‌రాల‌తో పాటు పట్టదార్ పాస్ బుక్ వివ‌రాల‌ను యాప్‌లో న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత భూమి య‌జ‌మాని మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని కౌలుదారు తెలుసుకుని ఎంట్రీ చేయాలి. అనంత‌రం యూరియా పంపిణీ జ‌రుగుతుంది. డీలర్‌లు కూడా బుకింగ్ ఆధారంగానే యూరియా అమ్మకాలు చేపట్టాలని డైరెక్ట‌ర్ గోపి సూచించారు.

చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు ఒకే విడ‌త‌లో యూరియా పంపిణీ

చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు ఒకే విడ‌త‌లో యూరియా పంపిణీ చేస్తామ‌ని డైరెక్ట‌ర్ గోపి ప్ర‌క‌టించారు. పెద్ద రైతులు ఒకేసారి 20 నుంచి 30 యూరియా బ‌స్తాలు తీసుకెళ్తే ఇబ్బంది ఉంటుంది. కాబ‌ట్టి వారికి రెండు, మూడు ద‌శ‌ల్లో యూరియా పంపిణీ చేస్తాం. మొత్తానికి నెల రోజుల్లోనే పెద్ద రైతుల‌కు కావాల్సినంతా యూరియాను మూడు విడ‌త‌ల్లో పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

పంట‌ను బ‌ట్టి యూరియా పంపిణీ

రైతు త‌న పొలంలో వేసే పంట‌ను బ‌ట్టి యూరియా పంపిణీ ఉంటుంద‌ని అగ్రిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ గోపి స్ప‌ష్టం చేశారు. వ‌రి, ప‌త్తి, మొక్క‌జొన్న‌, మిర్చితో పాటు ఇత‌ర పంట‌ల‌కు యూరియా స‌ర‌ఫ‌రా చేస్తాం. అయితే ఏ పంట సాగు చేస్తున్నారో దాన్ని బ‌ట్టి తాము యూరియా స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. యూరియా ఎక్కువ కావాలని వేసే పంట కాకుండా మరో పంటను యాప్‌లో టిక్ చేస్తే.. పంట కొనే సమయంలో ఇబ్బంది అవుతుంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement