త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teej Festival | తీజ్ పండుగ‌.. పెళ్లి కాని యువ‌తులు ఇలా చేస్తే మంచి భ‌ర్త దొరుకుతాడ‌ట‌..!

Teej Festival | ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో తీజ్ పండుగ వేడుకలను లంబాడీ గిరిజనులు (బంజారాలు) ఘనంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనీ ప్రతి తండాల్లో తొమ్మిది రోజులపాటు పెళ్ళికాని యువతులు ఈ తీజ్ వేడుకలను జరుపుకుంటారు.

S

Telangana | Published On Sep 5, 2026, 9.30 pm IST

Teej Festival | తీజ్ పండుగ‌.. పెళ్లి కాని యువ‌తులు ఇలా చేస్తే మంచి భ‌ర్త దొరుకుతాడ‌ట‌..!
Advertisement

ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో తీజ్ పండుగ వేడుకలు
తీజ్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్

Teej Festival | త్రినేత్ర‌.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో తీజ్ పండుగ వేడుకలను లంబాడీ గిరిజనులు (బంజారాలు) ఘనంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనీ ప్రతి తండాల్లో తొమ్మిది రోజులపాటు పెళ్ళికాని యువతులు ఈ తీజ్ వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకల్లో తండా నాయక్, కార్బరీ, డావ్ తోపాటు బంజారా మహిళలు, పెద్దలు పాల్గొని యువతులను ఉత్సాహ పరుస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని హర్కాపూర్ తండా, గిన్నెర తండాలో జరిగిన తీజ్ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. హార్కాపూర్ తండాలో జరిగిన వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరవగా.. గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. తీజ్ వేడుకల్లో పాల్గొని కలెక్టర్ ముందుగా పూజలు నిర్వహించి, ఆపై అందరితో కలిసి నృత్యాలు చేశారు. అటు మరోపక్క గిన్నేర తండాతో పాటు హార్కాపూర్ తండాలో జరిగిన తీజ్ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేశారు. ఆపై గిరిజన తండాల్లో జరుపుకునే ఈ తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి వారు మాట్లాడారు.

బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది ఈ తీజ్ పండుగ.. తీజ్ అనగా గోదుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణమాసములో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమినీ పురస్కరించుకొని ఈ పండుగను ప్రారంభించి కృష్ణాష్టమి తర్వాత ఈ తీజ్ పండుగలను ముగిస్తారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంజారాలు నివసించే గ్రామాన్ని తాండ అని అంటారు. తాండకు చెందిన పెద్దను నాయక్ అంటారు. ఈ తీజ్ పండుగ మొదట తాండల్లోని అందరు తాండవాసులు నాయక్ ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని నాయక్ అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న గుల్లలని తీసుకొని వస్తారు. ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలు దారాలతో, గవ్వలతో, ముత్యాలతో పూసలతో బాసింగాలు కట్టి పెళ్ళి కూతురులా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు. ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణపూర్ణిమ రోజు ఉదయం లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందంగా ముస్తాబై కొత్తబట్టలు ధరించి నాయక్ ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. గుల్లలో ఆ మట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణమాసములో వచ్చే రాఖీపూర్ణిమ రోజున సాయంత్రం పూట తాండ నాయకుని ఇంటి ఆవరణలో అందరు సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్ భార్య నాన బెట్టిన గోదుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి రోజూ పెళ్లి కానీ యువతులు తమ బంజారా సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అయితే వెదురు బుట్టలే కాకుండా "మోదుగు" ఆకులతో గుల్లగా చేసి మట్టిని పోసి గోధుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడ పిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోధుమలకు నీళ్లు చల్లుతారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు "పులియాగెణో" పూర్ణకుంభం తలపై పెట్టుకొని బావి నీళ్లుకాని, బోరింగ్ నీళ్ళుకాని, చెరువు నీళ్లుకాని, తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ పూజలు నిర్వహించి, సంప్రదాయ రీతిలో నియమ నిష్టల మధ్య కృష్ణాష్టమి తర్వాత చివరగా సాంప్రదాయ రీతిలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.

ముఖ్యంగా పెళ్లి కాని యువతులు వారికి మంచి భర్తలు దొరకాలని ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారని చెప్తుంటారు. అలాగే అన్నాతమ్ములకు ప్రత్యేకగా నిలిచే రాఖీ పండుగ రోజే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలెట్టడం వారి బంధుత్వానికి గుర్తుగా ఇది ప్రారంభించే కార్యక్రమం అని, ఇది శుభసూచికంగా, మొలకలు పచ్చగా ఉంటే అందరికీ బాగుంటుందని అందరూ సుభిక్షంగా ఉంటారని వారి నమ్మకం..  చివరి రోజు కృష్ణాష్టమి తరువాత ఈ యొక్క తీజ్ వేడుకలను తమ సాంప్రదాయ రీతిలో ఆటపాటల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ ముగిస్తారు.

Advertisement
Advertisement