త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క బీసీకీ సీటు ఇవ్వరా? కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

J

Telangana | Published On Sep 30, 2026, 7.08 pm IST

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

సంక్షిప్త సారాంశం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలనూ ఓసీలకే కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్, 42 శాతం రిజర్వేషన్ల హామీలు ఏమయ్యాయని, కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచి తమ సత్తా చాటుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు, తెలంగాణ కాంగ్రెస్ చేతలకు పొంతన లేదని, బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లను అగ్రవర్ణాలకే కేటాయించడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌లు నిప్పులు చెరిగారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. "తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమాలు, అత్యధిక జనాభా ఉన్నప్పటికీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఓసీలకే ఎలా కేటాయిస్తారు? టికెట్ ఇవ్వడానికి బీసీల్లో గ్రాడ్యుయేట్లు లేరా? బీసీ సమాజం కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదా?" అంటూ సూటి ప్రశ్నలు సంధించారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల హామీ ఏమైంది?

ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్.. తీరా అధికారం చేతికి వచ్చాక ఆ వర్గాలను విస్మరించిందని తలసాని విమర్శించారు. హైదరాబాద్‌లో సమగ్ర సర్వే కనీసం 25 శాతం కూడా పూర్తి కాలేదని, ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. సిరిసిల్ల పర్యటనలో భద్రత పేరుతో పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు నిదర్శనమని, చేనేతలకు ఇవ్వాల్సిన ఆర్డర్లను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ఖైరతాబాద్‌పై గెలుపు ధీమా

రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్ఠానం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని తలసాని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో తమ పార్టీ కచ్చితంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని, ఖైరతాబాద్‌లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: దాసోజు శ్రవణ్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిన నీతులకు, తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు ఏమాత్రం సంబంధం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ దుయ్యబట్టారు. చనగాని దయాకర్ వంటి నిబద్ధత కలిగిన బీసీ నేతలను కాదని ఉన్నత వర్గాలకే పట్టం కట్టారని, కాంగ్రెస్‌లో బీసీల ఆత్మగౌరవం తాకట్టు పడిందని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గుర్తించి బీసీలు తమ ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె. విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement