త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

CM Revanth Reddy | "పదేండ్లు ఆ సారు (కేసీఆర్) ఏం చేసిండు. రెండేండ్లు మీ తమ్ముడు (సీఎం రేవంత్ రెడ్డి) ఏం చేసిండు. లెక్కేయండి. ఆయన ఇచ్చింది నేనేమన్న ఆపిననా?.ఆయన ఇచ్చింది నేనేమన్న గుంజుకున్ననా?..ఆయన ఏదన్న సంపాదించి పెడితే నేను ఎక్కడన్న తాకట్టు పెట్టిన్నా? ఆయన ఇచ్చిన 8 లక్షల 11 వేల కోట్ల రూపాయల అప్పులకు నెల నెలా 7వేల కోట్లు మిత్తి కట్టుకుంటనే..నడుము ఒంగిపోయినా సరే.. తల తాకట్టు పెట్టి రూపాయి రూపాయి కూడగట్టి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా

S

Telangana | Published On Aug 13, 2026, 8.12 pm IST

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
Advertisement

రిజిస్ట్రేషన్లు జరిగేలా ఆదేశిస్తాం
క్యూర్‌లో మొదటి విడతలో
లక్ష ఇండ్లు కడతాం
కేసీఆర్ పథకాలేవీ నేను ఆపలేదు
అప్పులు భారమైనా..
సంక్షేమ పథకాలు ఆపలేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వచ్చే బోనాలు ఇందిరమ్మ టవర్స్ లోనే
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : "పదేండ్లు ఆ సారు (కేసీఆర్) ఏం చేసిండు. రెండేండ్లు మీ తమ్ముడు (సీఎం రేవంత్ రెడ్డి) ఏం చేసిండు. లెక్కేయండి. ఆయన ఇచ్చింది నేనేమన్న ఆపిననా?.ఆయన ఇచ్చింది నేనేమన్న గుంజుకున్ననా?..ఆయన ఏదన్న సంపాదించి పెడితే నేను ఎక్కడన్న తాకట్టు పెట్టిన్నా? ఆయన ఇచ్చిన 8 లక్షల 11 వేల కోట్ల రూపాయల అప్పులకు నెల నెలా 7వేల కోట్లు మిత్తి కట్టుకుంటనే..నడుము ఒంగిపోయినా సరే.. తల తాకట్టు పెట్టి రూపాయి రూపాయి కూడగట్టి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా. మీకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా. కరువు రావాలని.. జనాలు చచ్చిపోవాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు పోయి.. అఘోర పూజలు చేసిండ్రు. నా సంకల్పం మంచిది కాబట్టి దేవుడు నా వైపే ఉన్నడు. ఎల్ నినో వచ్చినా.. ఎల్లంపల్లి నిండింది. 22 ఏ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూమి లేకుంటే.. మీరే కొనుక్కొని ఉంటే అటువంటి ఇండ్లను రిజిస్టర్ చేయాల్సిందిగా ఆదేశిస్తాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, నవీన్ యాదవ్, కాలె యాదయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే...

అప్పులు కడుతూనే మంచి పనులు..

గత ప్రభుత్వం మిగిల్చిపోయిన 8 లక్షల కోట్ల అప్పులకు..అసలు, వడ్డీ చెల్లిస్తూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మహిళా సంఘాలకు 65వేల కోట్ల రూపాయల లింకేజ్ ఏర్పాటు చేయించాం. సన్న బియ్యం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కేసీఆర్ డబుల్ ఇండ్లు ఉన్నడు. ఊరించి ఊరించి చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు అన్నడు. 50 కిలోమీటర్లు అవతల కట్టిండు. కానీ ఇక్కడ పని చేసేవారు పని ముగించుకొని అంత దూరం ప్రయాణించి ఇంటికి చేరుకునేదెన్నడు. అందుకే..ఎక్కడుంటే వారికి అక్కడే ఇండ్లు కట్టించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నాం. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో 11 ఎకరాల భూమి వెతికి.. ఫ్లాట్లు కడుతున్నాం. కేవలం మీరు 5 లక్షలు చెల్లించండి. మిగతాది ప్రభుత్వం కడుతుంది. నిర్మాణం క్వాలిటీలో ఎలాంటి రాజీపడం.

దేవుడు నా వైపే ఉన్నాడు

నాకు వయసు ఉంది… ఓపిక ఉంది. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం. కొంతమంది తమిళనాడు, కర్ణాటక వెళ్లి.. వర్షాలు కురవొద్దని జనాలు చనిపోవాలని ప్రభుత్వం బద్నాం కావాలని అఘోర పూజలు చేశారు. నా సంకల్పం మంచిది కాబట్టి దేవుడు నా వైపు ఉన్నాడు. అందుకే ఎల్ నినో వచ్చినా ఎల్లంపల్లి నిండింది. హైదరాబాద్ కు మంచినీటి సమస్యలేకుండా దేవుడే వానలు కురిపించాడు" అని సీఎం ముగించారు.

డ్రా తీసి ఎంపిక చేస్తాం : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు ఉండబోవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. " వచ్చే బోనాలు ఇందిరమ్మ ఇండ్లలోనే జరుపుకునేలా ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తాం. తల తాకట్టు పెట్టైనా మాట నెరవేర్చుకుంటాం. లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా తీసి ఎంపిక చేస్తాం. మీ సొంత ఇంటిలాగా నాణ్యతను పర్యవేక్షించుకోవచ్చు. మీరు ఉంటున్న చోటనే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మిస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. చివరి పేదవాడి వరకు ఇస్తూనే ఉంటాం" అని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement