త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్.. రెండేండ్లు బాధ్య‌త‌లు

CV Anand | ఎట్ట‌కేల‌కు తెలంగాణ డీజీపీ పేరు ఖ‌రారైంది. కొత్త డీజీపీగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరును ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Apr 28, 2026, 5.41 pm IST

CV Anand | తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్.. రెండేండ్లు బాధ్య‌త‌లు
Advertisement

CV Anand | త్రినేత్ర‌.న్యూస్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ డీజీపీ పేరు ఖ‌రారైంది. కొత్త డీజీపీగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరును ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ పూర్తిస్థాయి డీజీపీగా రెండేండ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ప్ర‌స్తుత డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఏప్రిల్ 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

కాగా, రాష్ట్రానికి పూర్తి కాల‌పు డీజీపీ (హెడ్‌ ఆఫ్‌ ది పోలీస్‌ ఫోర్స్‌- HOPF) లేరు. ప్ర‌స్తుతం డీజీపీగా కొన‌సాగుతున్న శివ‌ధ‌ర్ రెడ్డి ఇన్‌చార్జ్‌గానే నియ‌మితుల‌య్యారు. అంత‌కుముందు డీజీపీలు అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్ కూడా ఇన్‌చార్జ్‌లుగానే ప‌నిచేశారు. అయితే రాష్ట్ర‌ తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్‌శర్మ మొద‌ట‌ తాత్కాలిక డీజీపీగా పనిచేసినా తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్‌ 13న పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్‌ 12 వరకు కొనసాగారు. అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ త‌ర్వాత యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబరు వరకు పనిచేశారు. తాజాగా నియ‌మితులైన సీవీ ఆనంద్.. తెలంగాణకు మూడో పూర్తి కాల‌పు డీజీపీగా రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.

హోం శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా శిఖా గోయ‌ల్

ప్ర‌స్తుతం హోం శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా సీవీ ఆనంద్ కొన‌సాగుతున్నారు. సీవీ ఆనంద్ స్థానంలో సీనియ‌ర్ ఐపీఎస్ శిఖాగోయ‌ల్‌ను నియ‌మిస్తూ సీఎస్ రామ‌కృష్ణారావు ఇటీవ‌లే ఉత్త‌ర్వులు జారీ చేశారు. శిఖా గోయల్‌కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొన‌సాగింపు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఉత్త‌ర్వులు 2026 మే 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

సీవీ ఆనంద్ వ‌ర్సెస్ శిఖా గోయ‌ల్‌

అయితే డీజీపీ పోస్టు కోసం శిఖా గోయ‌ల్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు స‌మాచారం. డీజీపీ జితేంద‌ర్ ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలోనే శిఖా గోయ‌ల్ డీజీపీ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. అదే స‌మ‌యంలో సీవీ ఆనంద్ కూడా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ శివధర్‌రెడ్డికి ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు అవకాశం కల్పించారు. ఈ నెల 31న శివ‌ధ‌ర్ రెడ్డి ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌డంతో.. ఇప్పుడైనా డీజీపీ పోస్టును ద‌క్కించుకోవాల‌ని శిఖా గోయ‌ల్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ట్లు పోలీసు వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగింది. ఇప్పుడు కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. హోం శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న సీవీ ఆనంద్ స్థానంలో శిఖా గోయ‌ల్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్ డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టేందుకు మార్గం సుగ‌మ‌మైంది. శిఖా గోయ‌ల్ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింద‌ని పోలీసు వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement