త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMDA Truck Parking | సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ.. హెచ్‌ఎండీఏ వేలం విఫలం!

HMDA Truck Parking | హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములు.. ఎకరం ధర వంద కోట్ల రూపాయల స్థాయిలో.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల ఆదాయం సమకూరుతుందన్న అంచనాలు..! కానీ తీరా వేలం నిర్వహిస్తే ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. నిధుల సమీకరణే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ( HMDA ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల ఈ-వేలం విఫలమైంది. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వానికి వేలం ప్రక్రియలో మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మూసాపేట ట్రక్ పార్క్( HMDA Truck Parking ) భూముల పరిరక్షణ కోసం మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ), బీఆర్ఎస్, వామపక్షాలు సాగించిన పోరాటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

V

Hyderabad | Published On Nov 27, 2026, 9.13 pm IST

HMDA Truck Parking | సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ.. హెచ్‌ఎండీఏ వేలం విఫలం!
Advertisement

రూ.862 కోట్ల విలువైన భూములకు ఒక్క బిడ్ కూడా రాని వైనం
ఎకరా రూ.99 కోట్లు, రూ.120 కోట్లు నిర్ణయించిన హెచ్‌ఎండీఏ
48 గంటల్లోనే రెండోసారి వేలంలో చుక్కెదురు
హరీశ్ రావు రాజకీయ వ్యూహం ఫలించిందా?

HMDA Truck Parking | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములు.. ఎకరం ధర వంద కోట్ల రూపాయల స్థాయిలో.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల ఆదాయం సమకూరుతుందన్న అంచనాలు..! కానీ తీరా వేలం నిర్వహిస్తే ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. నిధుల సమీకరణే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ( HMDA ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల ఈ-వేలం విఫలమైంది. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వానికి వేలం ప్రక్రియలో మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మూసాపేట ట్రక్ పార్క్( HMDA Truck Parking ) భూముల పరిరక్షణ కోసం మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ), బీఆర్ఎస్, వామపక్షాలు సాగించిన పోరాటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

రూ.862 కోట్ల అంచనా.. ఒక్క బిడ్ కూడా రాలేదు!

నిధుల సమీకరణలో భాగంగా హైదరాబాద్( Hyderabad ) మహానగరాభివృద్ధి సంస్థ శుక్రవారం రెండు కీలక భూభాగాలను ఈ-వేలానికి పెట్టింది. కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేట ట్రక్ పార్క్ లేఅవుట్‌లో 3.15 ఎకరాల భూమికి ఎకరా కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించింది. కోకాపేట నియోపొలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూమికి ఎకరా రూ.120 కోట్ల కనీస ధరను ఖరారు చేసింది.

మూసాపేట భూముల ద్వారా రూ.311.85 కోట్లు, కోకాపేట భూముల( Kokapet Lands ) ద్వారా రూ.550.80 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. రెండు భూభాగాలకు కలిపి కనీస ధర ప్రకారమే రూ.862.65 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బిడ్డర్ల మధ్య పోటీ పెరిగితే ఈ మొత్తం మరింత పెరిగేది. ఉదయం కోకాపేట భూములకు, మధ్యాహ్నం మూసాపేట భూములకు ఈ-వేలం నిర్వహించారు. అయితే రెండు విడతల్లోనూ ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో వేలం ప్రక్రియ విఫలమైంది.

48 గంటల్లోనే రెండో ఎదురుదెబ్బ!

హెచ్‌ఎండీఏ భూముల వేలానికి స్పందన కరవవడం ఇదే తొలిసారి కాదు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌( Banjarahills ) లోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఉన్న హుడా పార్క్ లేఅవుట్ ప్లాట్ల వేలానికి కూడా బిడ్లు రాలేదు. తాజాగా మూసాపేట, కోకాపేట భూముల వేలం కూడా విఫలం కావడంతో ప్రభుత్వ భూముల విక్రయ వ్యూహంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే కనీస ధరలు నిర్ణయించారా? భారీ ధరలే పెట్టుబడిదారులను వెనక్కి నెట్టాయా? అన్న చర్చ జరుగుతోంది.

నాలుగున్నర దశాబ్దాల నాటి భూములు.. నేటి రాజకీయ వివాదం!

మూసాపేట ట్రక్ పార్క్ భూముల వివాదం ఇప్పటిది కాదు. హైదరాబాద్ నగరంలో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు, ట్రక్కుల పార్కింగ్ అవసరాల కోసం దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో భూసేకరణ జరిగింది. కాలక్రమేణా హైదరాబాద్ విస్తరించడంతో ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రంగా మారింది. భూముల విలువ భారీగా పెరిగింది. అయితే ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను వాణిజ్య అవసరాల కోసం విక్రయించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఈ భూములను పరిరక్షించాలన్న డిమాండ్‌తో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.

2013లోనే పోరాటం.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ సమరశంఖం!

మూసాపేట ట్రక్ పార్క్ భూముల విక్రయానికి వ్యతిరేకంగా 2013లోనూ పోరాటం జరిగిన నేపథ్యం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూముల విక్రయ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాటి టీఆర్ఎస్, వామపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హరీశ్ రావు, సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు, వంటి నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో భూముల విక్రయం ముందుకు సాగలేదు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అవే భూములను వేలానికి పెట్టడంతో పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హరీశ్ రావు మరోసారి రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయి పరిశీలన నుంచి అఖిలపక్ష సమావేశాల వరకు.. కార్మికుల ఆందోళనల నుంచి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వరకు పలు రూపాల్లో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.

క్షేత్రస్థాయిలోకి హరీశ్ రావు.. కార్మికులకు భరోసా!

నవంబర్ 13న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మూసాపేట ట్రక్ పార్క్ భూములను హరీశ్ రావు సందర్శించారు. స్థానికులు, లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూముల విక్రయం వల్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే రోజు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగపడే భూములను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడాన్ని తప్పుబట్టారు.ట్రక్ పార్కింగ్‌తో పాటు నర్సరీ, ఆర్టీఏ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వంటి ప్రజోపయోగ వసతులకు సంబంధించిన ఈ భూములను పరిరక్షించాల్సిన అవసరాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భూముల వేలాన్ని కేవలం రాజకీయ అంశంగా కాకుండా వేలాది మంది కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సమస్యగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

అధికారులకు హెచ్చరికలు.. బిడ్డర్లకు కీలక సందేశం!

భూముల వేలాన్ని అడ్డుకునే క్రమంలో హరీశ్ రావు కీలక రాజకీయ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు వేలంలో పాల్గొనే పెట్టుబడిదారులకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమని హెచ్చరించారు. ప్రజా అవసరాల కోసం సేకరించిన భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు. దీంతో మూసాపేట భూముల వేలం వ్యవహారం రాజకీయంగానే కాకుండా పెట్టుబడిదారుల దృష్టినీ ఆకర్షించింది.

అఖిలపక్షాలను కలుపుకొంటూ ముందుకు!

నవంబర్ 19న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. భూముల పరిరక్షణ ఉద్యమాన్ని ఒక్క పార్టీకి పరిమితం చేయకుండా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ పోరాటాన్ని విస్తరించారు. ట్రక్ పార్క్‌పై ఆధారపడిన లారీ డ్రైవర్లు, డీసీఎం ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీల జీవనోపాధి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష కార్యాచరణకు మద్దతు ప్రకటించారు.

నిరాహార దీక్షలు.. హెచ్‌ఎండీఏ ముట్టడికి పిలుపు!

ప్రభుత్వం వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా కార్యాచరణ ప్రకటించారు హరీశ్ రావు. నవంబర్ 22, 23 తేదీల్లో నిరాహార దీక్షలకు, నవంబర్ 25న హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో నిరసనలు కొనసాగాయి. వామపక్షాలు, కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దీంతో భూముల విక్రయానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆందోళనలు మరింత విస్తరించాయి.

సీఎంకు వినతులు.. కాంగ్రెస్ అధిష్ఠానానికీ సెగ!

భూముల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు స్థానిక ప్రజాప్రతినిధులు. మరోవైపు ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హరీశ్ రావు. జాతీయ స్థాయిలో ప్రజా ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న భూముల వేలంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.  పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి( revanth reddy ).. ఇప్పుడు అదే భూములను వేలానికి పెట్టడం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాక్షేత్రంలో పోరు.. కోర్టులో న్యాయపోరు!

నవంబర్ 25న అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి బీఆర్ఎస్, వామపక్ష నేతలు, కార్మికులు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రజాక్షేత్రంలో ఆందోళనలు కొనసాగిస్తూనే.. మరోవైపు న్యాయపరంగా వేలాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. భూముల విక్రయాన్ని సవాల్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు విక్రయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రక్ పార్క్ భూముల ప్రజోపయోగాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రభుత్వ వాదన ఏంటి?

మూసాపేటలో ప్రతిపాదించిన ట్రక్ టెర్మినల్ కార్యరూపం దాల్చలేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ ప్రాంతం నివాస సముదాయాలతో విస్తరించిందని, నగరం వెలుపల ట్రక్కుల పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ప్రభుత్వ భూములను పారదర్శకంగా వేలం వేసి, వాటి ద్వారా సమకూరే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించింది. భూముల వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేయడంతో వేలానికి మార్గం సుగమమైంది.

కోర్టులో ఊరట.. వేలంలో మాత్రం చుక్కెదురు!

న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో భూముల వేలం సజావుగా సాగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. కోట్లాది రూపాయల విలువైన భూములను దక్కించుకునేందుకు ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. ఉదయం కోకాపేట భూముల వేలానికి స్పందన లేకపోగా.. మధ్యాహ్నం మూసాపేట భూముల వేలంలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. దీంతో కనీసం రూ.862 కోట్ల ఆదాయం సమకూరుతుందన్న అంచనాలు నెరవేరలేదు.

బిడ్డర్ల వెనకడుగుకు అసలు కారణమేంటి?

హెచ్‌ఎండీఏ నిర్ణయించిన భారీ కనీస ధరలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు, రాజకీయ వివాదాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మూసాపేట భూముల విషయంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హరీశ్ రావు చేసిన హెచ్చరికలు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాల్సిన భూముల చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతుండటం కూడా బిడ్డర్ల వెనకడుగుకు కారణమై ఉండొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అయితే మూసాపేటతో పాటు కోకాపేట భూములకూ బిడ్లు రాకపోవడం చూస్తుంటే భారీ కనీస ధరలు, మార్కెట్ పరిస్థితుల ప్రభావాన్ని కూడా విస్మరించలేం. వేలం విఫలానికి నిర్దిష్ట కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

రెండు వారాల పోరాటం.. వేలంలో సున్నా బిడ్లు!

నవంబర్ 13న ట్రక్ పార్క్ భూముల వద్ద ధర్నా నుంచి నవంబర్ 27న వేలం నిర్వహించే వరకు రెండు వారాల పాటు ప్రతిపక్షాల ఉద్యమం కొనసాగింది. క్షేత్రస్థాయి పరిశీలన.. కార్మికులతో సమావేశాలు.. అఖిలపక్ష ధర్నా.. రౌండ్ టేబుల్ సమావేశం.. నిరాహార దీక్షలు.. హెచ్‌ఎండీఏ ముట్టడి.. న్యాయపోరాటం.. కాంగ్రెస్ అధిష్ఠానానికి డిమాండ్లు.. బిడ్డర్లకు హెచ్చరికలు.. ఇలా పలు రూపాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ ఉద్యమంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు క్షేత్రస్థాయిలో పోరాటాన్ని కొనసాగించాయి. చివరకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాకుండా మూసాపేట భూముల వేలం విఫలం కావడం ప్రతిపక్షాలకు రాజకీయంగా కలిసొచ్చింది.

13 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్.. హరీశ్ రావు వ్యూహం ఫలించిందా?

నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రక్ పార్క్ భూముల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం.. నేడు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ ఉద్యమం. రెండు సందర్భాల్లోనూ భూముల విక్రయం ముందుకు సాగకపోవడం గమనార్హం. ప్రజా ఉద్యమం, అఖిలపక్షాల సమన్వయం, కార్మికుల భాగస్వామ్యం, పెట్టుబడిదారులకు హెచ్చరికలు. ఇలా పలు రూపాల్లో హరీశ్ రావు సాగించిన పోరాటం తాజా రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వేలం విఫలానికి ప్రతిపక్షాల పోరాటమే ఏకైక కారణమని నిర్ధారించలేకపోయినా, భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు మాత్రం ఇది తాత్కాలిక రాజకీయ విజయంగా చెప్పుకోవచ్చు.

సర్కారు తదుపరి అడుగేంటి?

మొత్తానికి.. కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించినా వేలంలో మాత్రం ఎదురుదెబ్బ తప్పలేదు. వందల కోట్ల ఆదాయం సమకూరుతుందన్న అంచనాలు నెరవేరలేదు. మరోవైపు ట్రక్ పార్క్ భూముల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి తాజా పరిణామం రాజకీయంగా మరింత బలాన్నిచ్చింది. ఇక ప్రభుత్వం కనీస ధరలను సవరించి మరోసారి వేలానికి సిద్ధమవుతుందా? మూసాపేట భూముల విక్రయ ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటుందా? లేక హరీశ్ రావు, అఖిలపక్షాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాయా? హెచ్‌ఎండీఏ భూముల వేలం వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Advertisement
Advertisement