త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో గుర్తించిన జెడ్‌ఎస్‌ఐ

Telangana | రాష్ట్రంలో రెండు కొత్త ర‌కాల బ‌ల్లి (Hemidactylus) జాతుల‌ను గుర్తించారు. అవి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న‌ట్లు హైదరాబాద్‌లోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ZSI) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

G

Telangana | Published On Oct 2, 2026, 7.11 am IST

Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో గుర్తించిన జెడ్‌ఎస్‌ఐ
Advertisement

Telangana | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో రెండు కొత్త ర‌కాల బ‌ల్లి (Hemidactylus) జాతుల‌ను గుర్తించారు. అవి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న‌ట్లు హైదరాబాద్‌లోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ZSI) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేర‌కు ఐరోపాకు చెందిన ప్రతిష్టాత్మక ‘యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ టాక్సానమీ’లో వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ రెండు కొత్త జాతుల కలయికతో తెలంగాణకు (Telangana) మాత్ర‌మే పరిమితమైన (ఎండెమిక్‌) సరీసృపాల (Reptiles) సంఖ్య ఆరుకు చేరింది.

నల్లగొండ జిల్లా వర్ధమానిగూడెం బస్‌ షెల్టర్, గుంటు మడుగు ప్రాంతంలో హెమిడాక్టైలస్‌ కేర్నికాలా (Hemidactylus Cairnicala) బల్లిని కనుగొన్నారు. స్థానికంగా రాళ్ల కుప్పల మధ్య నివసించే అలవాటు ఉండటంతో దీనికి కేర్నికాలా అని నామకరణం చేశారు. ఇది గరిష్టంగా 49 మిల్లీమీట‌ర్ల పొడవుతో వెనుక భాగంలో ముదురు చుక్కలు, నలుపు రంగు రాళ్లపై కనిపించకుండా దాక్కునేలా రంగు కలయిక ఉంటుంది. రాత్రి వేళల్లో మాత్రమే సంచరించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

వరంగల్‌ జిల్లా పాకాల్‌ వన్యప్రాణి అభయారణ్యం పరిసరాల్లో హెమిడాక్టైలస్‌ కోయాఒరమ్‌ (Hemidactylus Koyaorum) బల్లిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంత అడవులు, కొండలను సంరక్షిస్తున్న స్థానిక కోయ, గిరిజన తెగ గౌరవార్థం ఈ జాతి బల్లికి కోయాఒరమ్‌ అని నామకరణం చేశారు. ఇది గరిష్టంగా 55.6 మిమీ పొడవు ఉంటుంది. బూడిద రంగు శరీరంపై తెల్లటి పువ్వు ఆకారంలో ఉండే నాలుగు ప్రత్యేకమైన మచ్చలు ఉన్నాయి.

తెలంగాణ‌కు ప‌రిమిత‌మైన స‌రీసృపాలు..

ఈ ప్రత్యేక జీవులు రాష్ట్రంలోని పొడి ప్రాంతాలు, రాతి గుట్టలు మరియు అడవులలో మాత్రమే జీవిస్తూ ఇక్కడి జీవవైవిధ్యానికి ప్రత్యేక గుర్తింపును తెస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడి జీవవైవిధ్యంలో భాగమైన ప్రత్యేకమైన బల్లి (గెక్కో - Gecko) జాతులకు చెందినవి. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం తెలంగాణ మొత్తం 98 రకాల ఉభయచరాలు, సరీసృపాల జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది.

హెమిడాక్టైలస్ కేర్నికాలా (Hemidactylus Cairnicala): ఇటీవల నల్లగొండ జిల్లా వర్ధమాని గూడెం, గుంటు మడుగు ప్రాంతాల్లోని రాళ్ల కుప్పల మధ్య దీనిని కనుగొన్నారు. రాత్రి వేళల్లో మాత్రమే సంచరించే ఈ బల్లి గరిష్టంగా 49 మి.మీ పొడవు ఉంటుంది.

హెమిడాక్టైలస్ కోయాఒరమ్‌ (Hemidactylus Koyaorum): వరంగల్ జిల్లా పాకాల్ వన్యప్రాణి అభయారణ్యం పరిసరాల్లో శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఈ ప్రాంత అడవులను సంరక్షిస్తున్న స్థానిక "కోయ" గిరిజన తెగ గౌరవార్థం దీనికి ఈ పేరు పెట్టారు. దీని బూడిద రంగు శరీరంపై తెల్లటి పువ్వు ఆకారంలో నాలుగు మచ్చలు ఉంటాయి.

హెమిడాక్టైలస్ ఫ్లావికాడస్ (Hemidactylus Flavicaudus): దీనిని మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రాతి కొండల ప్రాంతంలో గుర్తించారు. దీని తోక పసుపు రంగులో ఉండటం దీని ప్రత్యేకత.

హెమిడాక్టైలస్ క్సెరికోలస్ (Hemidactylus Xericolus): తెలంగాణ పీఠభూమిలోని పొడి, రాతి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక లీఫ్-టోడ్ గెక్కో జాతి.

హెమిడాక్టైలస్ ఏములస్ (Hemidactylus Aemulus): ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర పరిశోధకులు దక్కన్ పీఠభూమి పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో కనుగొన్న లీఫ్-టోడ్ గెక్కో జాతి.

హెమిడాక్టైలస్ ట్రూట్లెరి (Hemidactylus Treutleri): కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ ఎల్గందల్ ఖిల్లా (Fort) పరిసరాల్లో మరియు తెలంగాణలోని కొన్ని నిర్దిష్ట రాతి కోటల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బల్లి జాతి.

Advertisement

తాజావార్తలు

Advertisement