త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే రౌడీయిజం, బెదిరింపులు

Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరిని ఉసిగొల్పి దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని, రౌడీయిజం, బెదిరింపులతో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.

S

Telangana | Published On Nov 25, 2026, 6.02 pm IST

Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే రౌడీయిజం, బెదిరింపులు
Advertisement

అక్ర‌మ కేసులు, అరెస్టుల‌తో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య‌పెట్ట‌లేరు
కాంగ్రెస్ నేత‌లపై మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఫైర్

Dasyam Vinay Bhaskar | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరిని ఉసిగొల్పి దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని, రౌడీయిజం, బెదిరింపులతో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత ఉద్యమంతో సాధించిన తాము ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోమని స్పష్టం చేశారు. దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. హ‌నుమ‌కొండ‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో బుధ‌వారం దాస్యం వినయ్ భాస్క‌ర్ మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 22వ తేదీ సాయంత్రం నగర ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందని విమర్శించారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, అనవసర వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకత్వం, ఉద్యమకారులకు అండగా నిలిచి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేసిన కేటీఆర్, ఇతర నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు.

పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధికి, ఐటీ కంపెనీల ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలో కృషి జరిగిందని గుర్తుచేశారు. దాడులు, బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు శాంతియుతంగా తెలంగాణ సాధించిన మేము రెచ్చగొట్టినా రెచ్చిపోం ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాలి.. దాడులు చేయడం కాదు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వ్యవహారశైలిలో మార్పు రాకపోతే చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు అసహనానికి గురై అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు, దాడులు, బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. దాడులు జరిగినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. తమకు సవాల్ విసిరిన నాయకులు నిజంగా ప్రజలపై, తమ అభివృద్ధిపై, పార్టీపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ చేశారు. తాము కూడా పార్టీ ఆదేశాల మేరకు ప్రజల కోసం రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, ప్రజలే ఎవరి వైపు ఉన్నారో తేలుస్తారని అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం

కేటీఆర్ ఐదేళ్ల సమయం ఇచ్చారని, అయితే అంతకంటే ముందే ప్రజలు తమ తీర్పు చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. రౌడీయిజం, వ్యక్తిగత దూషణలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. శాంతియుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు నమోదు చేయించడం సరికాదని విమర్శించారు. సుమారు 200 మంది కార్యకర్తలను నాలుగైదు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లకు చేరుకుని కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారని తెలిపారు. కేసులు, అరెస్టులు, బెదిరింపులతో పార్టీ శ్రేణులను భయపెట్టలేరని దాస్యం విన‌య్ భాస్క‌ర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement