త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ స‌భ పెడితేనే రైతుబంధు ప‌డ్డ‌ట్టు.. ఈరోజు మా ప్రెస్‌మీట్ ఉంద‌నే రెండు మోటార్లు ఆన్ చేసిర్రు

Harish Rao | కేసీఆర్ స‌భ పెడితేనే రైతుబంధు ప‌డ్డ‌ట్టు.. ఈరోజు మా ప్రెస్‌మీట్ ఉంద‌నే పొద్దున దేవాదుల‌లో మ‌రో రెండు మోటార్లు ఆన్ చేశార‌ని.. బీఆర్ఎస్ నిల‌దీస్తేనే మీకు సోయి వ‌స్తుందా అని రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు మండిపడ్డారు. జూలై 13న మొత్తం నీళ్లు ఎత్తుతామని, పది పంపులు నడుస్తాయని చెప్పారన్నారు. కానీ నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయని తెలిపారు.

S

Telangana | Published On Jul 21, 2026, 3.10 pm IST

Harish Rao | కేసీఆర్ స‌భ పెడితేనే రైతుబంధు ప‌డ్డ‌ట్టు.. ఈరోజు మా ప్రెస్‌మీట్ ఉంద‌నే రెండు మోటార్లు ఆన్ చేసిర్రు
Advertisement
  • బీఆర్ఎస్ నిల‌దీస్తేనే మీకు సోయి వ‌స్తుందా?
  • దేవాదుల‌ ప‌ది మోటార్లు న‌డ‌పాల్సిందే.. నిన్న‌టి వ‌ర‌కు ఐదు పంపులే న‌డిచాయి
  • కటుక ఒత్తకుండా వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నరు
  • దేవాదుల కింద రూ.700-800 కోట్ల విలువైన పంట ఎండిపోయింది
  • 50 రోజులు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు?
  • 105 టీఎంసీల నీళ్లు వెళ్లిపోవడం దారుణం
  • మీడియా స‌మావేశంలో కాంగ్రెస్ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ స‌భ పెడితేనే రైతుబంధు ప‌డ్డ‌ట్టు.. ఈరోజు మా ప్రెస్‌మీట్ ఉంద‌నే పొద్దున దేవాదుల‌లో మ‌రో రెండు మోటార్లు ఆన్ చేశార‌ని.. బీఆర్ఎస్ నిల‌దీస్తేనే మీకు సోయి వ‌స్తుందా అని రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు మండిపడ్డారు. జూలై 13న మొత్తం నీళ్లు ఎత్తుతామని, పది పంపులు నడుస్తాయని చెప్పారన్నారు. కానీ నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయని తెలిపారు. మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మోటార్లు, మంత్రులు లేనప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయ‌ని ఫైర‌య్యారు. జనగామ‌, హనుమ‌కొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖే చెబుతోందని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

ఉత్తం, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారు..

జూలై 12వ తేదీన తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి దేవాదుల పంపులు ఆన్ చేయమని నిలదీశాం. 13వ తేదీన ఉత్తం, భట్టి, పొంగులేటి హెలికాప్టర్‌లో వెళ్లి హడావుడి చేశారు. అక్కడికి వెళ్లి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా నీళ్ల మంత్రికి తెలియదు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం అని చెప్పారు. ఆ మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు. నీళ్లు ఎత్తడం లేదు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. శాయంపేట, బీమదేవపల్లి, ఎల్కతుర్తి అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. నీళ్లు ఉండి కూడా ఎందుకు ఎత్తడం లేదు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టారు. 3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 22 వేల క్యూసెక్కుల వరద ఉంది. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. పది పంపులు నడుస్తాయని చెప్పారు. నిన్నటి వరకు ఐదు పంపులే నడిచాయి. ఇక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదు కదా? చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? మీ ఆలోచన ఏమిటి? అని నిల‌దీశారు.

వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారు..

ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. సమ్మక్క బ్యారేజీ కట్టి, దేవాదుల మూడు ఫేజులు పూర్తి చేసి కేసీఆర్ నీళ్లు ఎత్తడానికి సిద్ధంగా పెట్టారు. మీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారు. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేశాం. కటుక ఒత్తకుండా ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? రూ.8 కోట్ల బిల్లులు ఇవ్వకుండా పోయిన ఏడాది 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ఆన్ చేశారు. దేవాదుల కింద రూ.700-800 కోట్ల విలువైన పంట ఎండిపోయింది. ఈసారి కూడా ఎల్‌నినో వస్తుందని చెబుతున్నా మొద్దునిద్ర పోతున్నారా? అని మండిప‌డ్డారు.

మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా?

ఎందుకు పది మోటార్లు నడపడం లేదు? నీళ్లు ఉండి కూడా ఎత్తకుంటే ఏం అనాలి? ఒడిసిపట్టాల్సిన నీళ్లను విడిచిపెడుతున్నారు. ప్రపంచమంతా చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతుంటే మీరు నీళ్లు వదిలేస్తున్నారు.
కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడా డ్రామాలు.. ఇక్కడ ఎందుకు ఎత్తరు? రామప్ప కింద 5 వేల ఎకరాలు, పాకాల కింద 29 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారు. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దు అంటారు. మంత్రులు మాత్రం 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్‌ది ఒక మాటనా? మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా?
రామప్ప కింద తూములు మూసేశారు. నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి? గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి. అయినా కలెక్టర్ ఎందుకు తూములు మూసారు? ఎవరు కరెక్ట్? మంత్రులు రైతులకు క్షమాపణలు చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

నీళ్ల విషయంలోనూ వాయిదాలే..

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇది తుగ్లక్ ప్రభుత్వం లెక్క ఉంది. రాష్ట్రాన్ని నడిపే పద్ధతి ఇదేనా? రైతు బోరు ఎండితే నీళ్ల కోసం రకరకాల మార్గాలు వెతుకుతాడు. కానీ ప్రభుత్వం ఎందుకు తపన పడటం లేదు?
రైతులు ట్యాంకర్లు, బిందెలతో పంటలకు నీళ్లు పెడుతున్నారు. రైతులకు ఉన్న సోయి రేవంత్ రెడ్డికి లేదు. తెలంగాణ రైతు ఎంత తపన పడుతున్నాడో రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదు. గ్యారెంటీల విషయంలో వాయిదాల లెక్కనే.. నీళ్ల ఎత్తిపోతల విషయంలో కూడా వాయిదాలే. కాళేశ్వరం అంటే మా మీద పడి ఏడ్చారు. దేవాదుల వద్ద ఏం అడ్డం వచ్చింది? జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 50 రోజులు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు? 2011లో దేవాదుల టన్నెల్ కూలింది. మేం బాగు చేశాం. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదు. తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై లేదు. బీఆర్ఎస్‌ను ఆపడం నీ తరం కాదు. ముందు నీళ్లు ఎత్తడంపై దృష్టి పెట్టు అని ఫైర‌య్యారు.

రోజుకు పావు టీఎంసీ ఎత్తొచ్చు..

నీ నిర్లక్ష్యం వల్ల తాగు, సాగు నీటి ఇబ్బందులు వచ్చినా, కరెంట్ సమస్య వచ్చినా, పంటల సాగు తగ్గినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. దేవాదుల సమ్మక్క బ్యారేజీ నుంచి 105 టీఎంసీల నీళ్లు ఏపీ వైపు వెళ్లిపోయాయి. మీరు ఎత్తింది కేవలం 1.9 టీఎంసీలు మాత్రమే. 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉంది. రోజుకు పావు టీఎంసీ ఎత్తే అవకాశం ఉన్నా రెండు టీఎంసీలు కూడా ఎత్తలేదు. మీ భాషలో చెప్పాలంటే ఎవరికి శిక్ష వేయాలి? మీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలి? ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి?
చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కూడా లేదా? అని నిల‌దీశారు.

ప్రాజెక్టులు ఉన్నాయి.. లిఫ్టులు ఉన్నాయి.. కానీ నీళ్లు ఎత్తడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు మీ పాలన ఉంది. మీ నిర్లక్ష్యం, అసమర్థత, తప్పుడు నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. 50 రోజుల్లో అన్నీ నిండిపోయేవి. ఎందుకు నింపలేదు? డైలాగులు దంచడమే తప్ప రిజర్వాయర్లు నింపే పని లేదా? దేవాదుల గుండా 105 టీఎంసీల నీళ్లు వెళ్లిపోవడం దారుణం. ఈరోజు కూడా దేవాదుల వద్ద 78 మీటర్ల లెవల్‌లో గోదావరి ప్రవహిస్తోంది. నీళ్లు ఉన్నాయి.. లెవల్ ఉంది.. మోటార్లు ఉన్నాయి.. అయినా నీళ్లు ఎత్తడం లేదు. రాష్ట్రాన్ని పరిపాలించే పద్ధతి ఇదేనా? జనగామ‌, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖే చెబుతోంది అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

"దేవాదుల పూర్తి చేస్తాం" అని డైలీ సీరియ‌ల్‌లా  చెబుతారు..

కరెంట్ సరఫరా చేయరు, నిధులు ఇవ్వరు, ట్రాన్స్‌ఫార్మర్లు చెక్ చేయరు. ముందే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉత్తం కుమార్ రెడ్డి ఇంకా ఎన్ని సార్లు "దేవాదుల పూర్తి చేస్తాం" అనే డైలీ సీరియల్ లాగ చెబుతారు? మిమ్మల్ని ఎవరు పూర్తి చేయొద్దు అన్నారు? 2004లో ప్రారంభమైన దేవాదులకు గ్రహణం పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పదేళ్లలో 46 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. కేసీఆర్ 3.17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికీ దేవాదుల నీళ్లు పారాయి. కేసీఆర్ నీళ్ల కోసం యుద్ధం చేస్తే.. మీరు నీళ్లపై యుద్ధం చేస్తున్నారు. మేం కాళేశ్వరం గురించి మాట్లాడితే తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతామంటున్నారు. ఎవరు కట్టొద్దన్నారు? 30 నెలలుగా అదే మాట చెబుతున్నారు. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? అని ధ్వ‌జ‌మెత్తారు.

30 నెలలుగా కాళేశ్వరం మీద పడి ఏడవడం తప్ప రేవంత్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి చేసింది ఏముంది? ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో తెలియదు. బేసిన్లు అంటే ఏమిటో తెలియదు. రాష్ట్రానికి వరం కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టు. ఈరోజు వైరా, బేతుపల్లికి నీళ్లు వస్తున్నాయంటే అది కేసీఆర్ కృషి. తాగు, సాగు నీటికి డోకా లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అన్నారం, సుందిళ్లలాగే సమ్మక్క బ్యారేజీ డిజైన్. దేవాదుల కోసం వాడుతున్నప్పుడు అదే నదిపై ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎందుకు వాడటం లేదు? అని హ‌రీశ్ ప్ర‌శ్నించారు.

ప్రజా పోరుకు సిద్ధమవుతాం..

చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. చిత్తశుద్ధితో దేవాదుల 10 మోటార్లు నడపాలి. 22 రిజర్వాయర్లు నింపాలి. 3 లక్షల 17 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించాలి. లేకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతాం. ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్లు తెరవండి అని హ‌రీశ్‌రావు హిత‌వు ప‌లికారు.

ఈ మీడియా స‌మావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

Advertisement
Advertisement