త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?

కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ వార్తలను ఖండించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సీఎం రేవంత్ రెడ్డి పాత కేసులను గుర్తుచేస్తూ సబ్‌స్టేషన్ కాంట్రాక్టులపై సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Sep 29, 2026, 8.32 pm IST

RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?

సంక్షిప్త సారాంశం

కేటీఆర్ పాస్‌పోర్టును జప్తు చేయాలని ఏసీబీ కోర్టు లేఖ రాసిందంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, కోర్టులు లేఖలు రాయవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి 52 రోజులు జైలు జీవితం గడిపారని, సీఎం అయినప్పటికీ ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికీ కోర్టులోనే ఉందని గుర్తుచేశారు. ఫార్ములా-ఈ రేస్ నిధుల బదిలీ అంతా ప్రభుత్వ విధానం, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే జరిగిందని, కేటీఆర్ వ్యక్తిగత ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా రాలేదని పేర్కొన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ కాంట్రాక్టులను ప్యాకేజీలుగా మార్చి ఎస్సీ, ఎస్టీలను దూరం చేస్తూ రూ.1,500 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.

Advertisement
  • కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు వార్తలు పూర్తిగా అవాస్తవం
  • కోర్టులు లేఖలు రాయవు
  • సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్టు జప్తు వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలపై మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో సహా నలుగురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ కోర్టు రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌కు లేఖ రాసినట్లు ఈనాడు పత్రికతో పాటు పలు సోషల్ మీడియా ఛానల్స్‌లో వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతోనే ఇలాంటి పుకార్లను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు.

న్యాయస్థానాలు ఆర్డర్లు ఇస్తాయి.. లేఖలు రాయవు

మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రదర్శిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా స్పందించారు. "జర్నలిస్టు మిత్రులకు నా విన్నపం ఒక్కటే.. ఏదైనా సమాచారం వస్తే ముందుగా ధ్రువీకరించుకోవాలి. ఊహాజనిత వార్తల వల్ల పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు లేఖ రాసిందని రాశారు. ప్రాథమిక న్యాయ సూత్రాల ప్రకారం కోర్టులు ఎవరికీ లేఖలు రాయవు, కేవలం ఆదేశాలు (Orders) మాత్రమే ఇస్తాయి. ఫార్ములా-ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ సీనియర్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వివరాలు పరిశీలిస్తున్నారు. ఏసీబీ ఒక మెమో ఫైల్ చేసినట్లు మాత్రమే తెలుస్తోంది తప్ప, అటు లక్ష్మణ్ గారికి గానీ, ఇటు కేటీఆర్ గారికి గానీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదు" అని వెల్లడించారు.

నా పాస్‌పోర్ట్ సీజ్ అయింది.. ఆయనదీ చేయాలనేదే రేవంత్ తొండి

కేటీఆర్ విదేశాలకు వెళ్లి ప్రవాస భారతీయులను కలవడం, భవిష్యత్ తెలంగాణ విజన్, ఏఐ (AI) వంటి సాంకేతికతలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. "నా పాస్‌పోర్టును కోర్టు సీజ్ చేసింది కాబట్టి.. కేటీఆర్ పాస్‌పోర్టును కూడా అలాగే చేయాలనే మొండి వైఖరితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2015లో నాటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు వేం నరేందర్ రెడ్డి ఎన్నిక కోసం రూ.50 లక్షల లంచం ఇస్తూ రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి 52 రోజులు జైలులో ఉన్నారు. అందుకే ఏసీబీ కోర్టు ఆయన పాస్‌పోర్టును సీజ్ చేసింది. సీఎం అయ్యాక కూడా ఇప్పటికీ రేవంత్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. కేటీఆర్ దేశం విడిచి వెళ్లిపోతారనే అనుమానం ఎవరికీ లేదు.. ఆయన ఎక్కడికీ పారిపోరు" అని స్పష్టం చేశారు.

ఫార్ములా-ఈ లావాదేవీలన్నీ పక్కా అధికారికం

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. "రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే నిధుల బదిలీ జరిగింది. రూ.55 కోట్ల నగదు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారమే ఫార్ములా-ఈ సంస్థకు చేరింది. ఇందులో ఒక్క రూపాయి కూడా కేటీఆర్ వ్యక్తిగత ఖాతాలోకి రాలేదని స్వయంగా ఏసీబీ అధికారులే చెబుతున్నారు. కేటీఆర్‌ను ఏ1 చేయాలని రాజకీయ ఒత్తిడి తెచ్చినా ఆయన విచారణకు పూర్తిగా సహకరించారు. ఏసీబీ, ఈడీ పిలిచిన ప్రతిసారీ హాజరై సందేహాలను నివృత్తి చేశారు తప్ప ఒక్క వాయిదా కూడా కోరలేదు. అలాంటి నాయకుడిపై లేనిపోని బురదజల్లడం సరికాదు" అని హెచ్చరించారు.

రూ.1500 కోట్ల సబ్‌స్టేషన్ స్కామ్.. కాంట్రాక్టుల్లో దళితులకు మోసం

విద్యుత్ శాఖలోని సబ్‌స్టేషన్ల నిర్వహణ కాంట్రాక్టుల్లో ప్రభుత్వం రూ.1,500 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన కాంట్రాక్ట్ రిజర్వేషన్లను కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. "ఒక్కొక్క సబ్‌స్టేషన్‌కు విడిగా టెండర్లు పిలిస్తే దళిత నిరుద్యోగులు పోటీపడతారని తెలిసి.. ఉద్దేశపూర్వకంగానే ఐదారు సబ్‌స్టేషన్లను కలిపి భారీ ప్యాకేజీలుగా మార్చారు. దీంతో చిన్న కాంట్రాక్టర్లు దూరమై, బడా సంస్థలకు లబ్ధి చేకూరుతోంది. దళితులంటే ప్రేమ అని చెప్పుకునే రేవంత్ సర్కార్ ఆచరణలో వారి పొట్ట కొడుతోంది" అని మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రిపై కవితాస్త్రం

ప్రభుత్వ తీరుపై ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆవేదనను తెలియజేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశించి రాసిన ఒక కవితను ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా చదివి వినిపించారు.

"అయ్యా భట్టి.. తీసుకో ఇక ఛుట్టి..

అలసిపోయా మీకు కమీషన్ కట్టి కట్టి..

నమ్మి ఓటేస్తే.. వేశారు మాపై తట్టెడు మట్టి..

ఎట్లా కట్టాలే మా పల్లెల్లో రోజూ చిట్టి..

అప్పు కట్టమంటున్నాడు మా ఊరి శెట్టి..

వచ్చే జన్మలో అయినా పోతదా మా ఈ వెట్టి..

మా భయ్యా భట్టి.. ఒట్టిమాటలు కట్టిపెట్టి..

దయచేసి తీసుకోండి ఇక ఛుట్టి.."

Advertisement
Advertisement