త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Districts Reorganization | తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ? 10 జిల్లాల రద్దుపై సర్కార్ కసరత్తు!

చిన్న జిల్లాలు రావడం వల్ల అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకోవడం, పాలనను క్రమబద్ధీకరించడం కోసం ఈ నిర్ణయం తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

J

Telangana | Published On Jan 7, 2026, 8.12 pm IST

Telangana Districts Reorganization | తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ? 10 జిల్లాల రద్దుపై సర్కార్ కసరత్తు!
Advertisement

Telangana Districts Reorganization | తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో నుంచి ఓ 10 జిల్లాలను తీసేసి మొత్తం 23 జిల్లాలే ఉండేలా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జిల్లాల సంఖ్యను తగ్గించి, పాలన సౌలభ్యం కోసమే వాటిని 23 జిల్లాలకు కుదించాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

10 జిల్లాలు రద్దు అయ్యే అవకాశం?

తక్కువ జనాభా ఉన్న, తక్కువ వైశాల్యం ఉన్న చిన్న జిల్లాలను వాటికి పక్కనే ఉన్న పెద్ద జిల్లాల్లో విలీయం చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన. సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు లాంటి చిన్న జిల్లాలతో పాటు మరో ఆరు జిల్లాలను రద్దు చేసి వాటిని పక్కనే ఉన్న పాత జిల్లాల్లో కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదిక

ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఆయన దీని గురించి గతంలోనే చెప్పారు. దీనివల్ల నియోజకవర్గాల వారీగా అభివృద్ధి జరుగుతుందని, పర్యవేక్షణ కూడా సులువు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.

కొన్ని జిల్లాల పేర్లు మార్పు

అలాగే కొన్ని జిల్లాలకు పేర్లు కూడా మార్చాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలోచించనుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి దివంగత నేత జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

చిన్న జిల్లాలు రావడం వల్ల అదనపు ఖర్చులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకోవడం, పాలనను క్రమబద్ధీకరించడం కోసం ఈ నిర్ణయం తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సీఎం ముందుచూపు

అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల సరిహద్దులకు అనుగుణంగా జిల్లాలు లేకపోవడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై పూర్తిస్థాయి నివేదిక కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  చిన్న జిల్లాలు రద్దు చేసి వాటిని పాత జిల్లాల్లో కలపడం, లేదా పక్కన ఉన్న జిల్లాల్లో కలిపే ప్రతిపాదనపై తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement