త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వ‌కూడ‌ద‌నే.. సబ్ రిజిస్ట్రార్‌ల అధికారాల్లో కోత‌: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. రిజిస్ట్రేష‌న్ చార్టీల‌ను (Registration Charges) పెంచే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Jun 4, 2026, 7.10 pm IST

Ponguleti Srinivas Reddy | అక్రమాలకు తావివ్వ‌కూడ‌ద‌నే.. సబ్ రిజిస్ట్రార్‌ల అధికారాల్లో కోత‌: మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. రిజిస్ట్రేష‌న్ చార్టీల‌ను (Registration Charges) పెంచే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింద‌ని గుర్తుచేశారు. రిజిస్ట్రేష‌న్ చార్టీల‌ను ఒక్క శాతం పెంచినా వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచనతో ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామన్నారు. గచ్చిబౌలిలోని తాలిమ్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అంతకుముందు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్‌ల (Sub Registrar) అధికారాలను కుదించామ‌న్నారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ.2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ల‌లో ఎకరానికి రూ.5 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించామ‌ని వెల్ల‌డించారు. సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే సమీక్షిస్తామని వెల్ల‌డించారు. ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ప్ర‌జ‌లు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు.

ఏ త‌ప్పూ చేయ‌లే..

తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, దేవుడి దయతో ఇంతవరకు వచ్చాన‌ని మంత్రి చెప్పారు. త‌నకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తాని స్ప‌ష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేద‌ని, అలాంటి వ్యక్తిని కాద‌న్నారు. ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేద‌ని, చట్ట ప్రకారం పనిచేస్తున్నాని తెలిపారు. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డవారిపై, ఏసీబీ ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశార‌న్నారు. మూడు, నాలుగేండ్ల‌పాటు ఫైళ్లను తొక్కిపెట్టారని చెప్పారు. తాను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేశాన‌ని వెల్ల‌డించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా నిర్ణయాలు తీసుకున్నాని వివరించారు. ఎవర్ని క్షమించలేద‌ని, ఉపేక్షించలేద‌న్నారు.

నిషేధిత జాబితాలో అసైన్డ్ భూములు

గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టామ‌న్నారు. భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను డిజిటలైజేషన్ చేస్తామ‌ని చెప్పారు. ఫ్యూచర్ సిటీ రద్దుచేయడం సాధ్యంకాద‌ని, ఫ్యూచర్ సిటీ లో లాండ్స్ ఫ్రీ గా ఇవ్వడం లేదు. రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాద‌ని తెలిపారు.

విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు..

ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామ‌ని మంత్రి తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. మొదటి దశలో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 13 క్లష్టర్‌లుగా విభ‌జించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక‌ భారం ప‌డ‌కుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధల‌తో నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. నిర్మాణంతో పాటు ఐదు సంవ‌త్సరాల నిర్వహాణ బాధ్యత‌ను కూడా ఆ సంస్ధలకే అప్పగించామ‌న్నారు. మూడు నుంచి ఐదు ఎక‌రాల స్ధలంలో కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్బిణీల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక వ‌స‌తులు, విశాల‌మైన వెయిటింగ్ ఏరియా మ‌హిళ‌ల కోసం ఫీడింగ్ రూమ్‌, చిన్నపిల్లల కోసం క్రెచ్‌, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవానలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించామ‌ని చెప్పారు. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న భావనాన్ని డిసెంబర్‌లోగా అందుబాటులోకి తీసుకోస్తామ‌న్నారు. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో శంకుస్థాపన చేయబోతున్నామ‌ని, రెండో విడ‌త‌లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని తెలిపారు.

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం విజ‌య‌వంతం..

మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయమంతమైద‌ని, నిరుపేదల సొంత ఇంటి కలలను తీర్చే అవకాశం త‌న‌కు దక్కిందని మంతి చెప్పారు. ఇది త‌న‌కు చాలా తృప్తినిచ్చింద‌ని పేర్కొన్నారు. ప్రారంభంలో ఎన్ని వత్తిడిలు వచ్చినా వెనుకకు తగ్గలేద‌ని, దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement