త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | ప్రజలకు చేరువగా పోలీసింగ్.. సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు : డీజీపీ సీవీ ఆనంద్‌

DGP CV Anand | రాష్ట్రంలో పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేయాలని, సాంకేతికత ఆధారంగా సేవలను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

P

Telangana | Published On Jul 3, 2026, 8.48 pm IST

DGP CV Anand | ప్రజలకు చేరువగా పోలీసింగ్.. సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు : డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

DGP CV Anand | రాష్ట్రంలో పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేయాలని, సాంకేతికత ఆధారంగా సేవలను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు. “పోలీసు ప్రజల మధ్యే ఉండాలి. ఫీల్డ్‌లో కనిపించాలి. స్టేషన్‌కే పరిమితమైతే ప్రజలకు దూరమవుతారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి అధికారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శిస్తూ కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలు, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్ సంస్కృతికి బదులుగా అధికారులు ఫీల్డ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

భూవివాదాల వంటి సివిల్ స్వభావం ఉన్న వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. “పోలీసింగ్ అంటే చట్ట పరిధిలోనే ఉండాలి. అనవసర జోక్యం వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని డీజీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు ప్రచారాలపై నిరంతర నిఘా అవసరమని కూడా ఆయన తెలిపారు. సాంకేతిక వినియోగంపై డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్యం, లాటీ యాప్ వంటి డిజిటల్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన ఆధారాలను ఈ-సాక్ష్యం పోర్టల్‌లో సమయానికి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీసీటీఎన్‌ఎస్ అప్‌డేషన్ 60 నుంచి 70 శాతం పూర్తయిందని పేర్కొంటూ, మిగతా జిల్లాలు కూడా వేగం పెంచాలని సూచించారు.

సైబర్ నేరాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ, “సైబర్ క్రైమ్ ఇప్పుడు సవాల్‌గా మారింది. ప్రతి అధికారి సాంకేతికంగా అప్డేట్‌గా ఉండాలి” అని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న సైబర్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. నార్కోటిక్స్, గంజాయి నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచిస్తూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం పోలీసుల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా డీజీపీ సమీక్షించారు. “ప్రాణాలు కోల్పోవడం ఒక్క సంఖ్య కాదు, ప్రతి కేసు వెనుక ఒక కుటుంబం ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. వాహనాల తనిఖీలు పెంచాలని, అత్యవసర సేవల స్పందనను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో 112 అత్యవసర సేవలను డ్రోన్ ఇంటిగ్రేషన్‌తో అనుసంధానించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులను డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు. అత్యవసర కాల్‌కు స్పందించి ప్రాణాలు కాపాడిన ఘటనలు, హత్య కేసుల దర్యాప్తు, మోస్ట్ వాంటెడ్ నిందితుల అరెస్టులో చూపిన చురుకుదనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. వారికి డీజీపీ కార్యాలయంలో రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. సమర్థవంతమైన పోలీసింగ్ కోసం ప్రతి అధికారి సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని డీజీపీ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement