త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | పోలీసింగ్‌లో సాంకేతికతకు పెద్దపీట : డీజీపీ సీవీ ఆనంద్‌

DGP CV Anand | రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో కమిషనరేట్ల పరిధులు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులు, గ్రామాల విభజన, జ్యూరిస్డిక్షన్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

P

Telangana | Published On Jun 8, 2026, 5.45 pm IST

DGP CV Anand | పోలీసింగ్‌లో సాంకేతికతకు పెద్దపీట : డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

DGP CV Anand | రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో కమిషనరేట్ల పరిధులు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులు, గ్రామాల విభజన, జ్యూరిస్డిక్షన్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్కిళ్లు, జోన్లు, గ్రామాల పునర్విభజనకు సంబంధించి అన్ని శాఖలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని డీజీపీ సూచించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల పరిపాలనా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాలతో పాటు నేపాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు గృహ సేవకులుగా పనిచేస్తూ నేరాల్లో పాల్గొన్న ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సర్వెంట్ల సమగ్ర వివరాలను సేకరించాలని డీజీపీ స్పష్టం చేశారు. వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని డిజిటల్ డేటాబేస్ రూపంలో అందుబాటులో ఉంచాలని సూచించారు.

సాంకేతిక పోలీసింగ్‌పై దృష్టి

పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ద్వారా సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలు, కోర్ అప్లికేషన్ల వినియోగం, టీజీ కాప్స్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. డయల్-100 సేవలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలు, వాహనాల తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేగంగా అందుబాటులోకి తీసుకురావచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పోలీసింగ్, డ్రోన్ల వినియోగం, హెచ్‌ఆర్‌ఎంఎస్, డేటా ఇంటెలిజెన్స్, స్మార్ట్ అప్లికేషన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. “తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ – యూజింగ్ టెక్నాలజీ” లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.

మహిళా పోలీసులకు మరిన్ని అవకాశాలు

సమావేశంలో మహిళా పోలీసుల సంక్షేమం, సేవా అవకాశాలపై కూడా చ‌ర్చించారు. మహిళా పోలీసులకు 33 శాతం రిజర్వేషన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, లా అండ్ ఆర్డర్, ఫీల్డ్ డ్యూటీల్లో మరింత భాగస్వామ్యం కల్పించాలని డీజీపీ సూచించారు. అక్టోబర్‌లో మహిళా పోలీస్ కాన్ఫరెన్స్, నవంబర్‌లో పోలీస్ రిట్రీట్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సంద‌ర్భంగా మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, వెహికల్ ఆడిట్, సిబ్బంది వినియోగం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ బ్యూరోతో పాటు ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ కమిషనర్ ఎం రమేష్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement