త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palla Rajeshwar Reddy | రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తిపోయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy | ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 246 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాలు, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయన్నారు.

P

Telangana | Published On Jul 7, 2026, 5.22 pm IST

Palla Rajeshwar Reddy | రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తిపోయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
Advertisement

Palla Rajeshwar Reddy | ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 246 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాలు, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయన్నారు. ఆరుద్ర కార్తెలోనే నాట్లు పోయాల్సి ఉన్నా, ప్రస్తుతం నార్లు వేసే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, కందులు, మ‌క్కజొన్న పంటలు అనేక ప్రాంతాల్లో మొలకెత్తలేదని, సాగునీటితో పాటు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

కన్నేపల్లి పంప్‌హౌస్‌తో పాటు సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ పని చేయడం లేదని ఆరోపించారు. ప్రాణహితలో ప్రవహిస్తున్న నీటిని వినియోగించి జలాశయాలను నింపే అవకాశాన్ని కూడా వదులుకుంటోందని అన్నారు. వెంటనే కన్నేపల్లి పంప్ మోటార్లను ప్రారంభించి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పల్లా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ, రైతులపై చిత్తశుద్ధి ఉంటే నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లతో చర్చించి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలతో వాటికి నష్టం జరుగుతోందని ఆరోపించిన ఆయన, గతంలో మేడిగడ్డ వద్ద కూడా కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధ్యమైందని, సాగునీటి విస్తీర్ణం పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంద‌న్నారు. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజెంటేషన్‌కు తమకు ఆహ్వానం అందలేదని, అది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని పల్లా వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సమావేశంలో ఉపేంద్ర చారి, విద్యాసాగర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement