Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?
Sanju Samson | భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్ మరోసారి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కేవలం మూడు ఇన్నింగ్స్‌లో మాత్రమే ఆడే అవకాశం దొరికింది. ఈ మూడు ఇన్నింగ్స్‌లో మొత్తం 12 బంతులు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు.
Sanju Samson | భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్ మరోసారి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కేవలం మూడు ఇన్నింగ్స్‌లో మాత్రమే ఆడే అవకాశం దొరికింది. ఈ మూడు ఇన్నింగ్స్‌లో మొత్తం 12 బంతులు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. తర్వాత నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇక జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన జట్టులో శాంసన్ పేరు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం 12 బంతుల్లో ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్ విజేతను పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రపంచకప్ హీరో..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్ శాంసన్‌నే నమ్మకుంది. తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శాంసన్ వరుసగా కీలక మ్యాచుల్లో 97, 89, 89 రన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స ఆడాడు. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చి వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్‌ను కోల్పోయాడు. శాంసన్ అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు ప్రపంచకప్ గెలువడంలో కీలక పాత్ర పోషించాడు.
12 బంతులతోనే నమ్మకం పోయిందా?
ప్రపంచకప్ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో మాత్రం సంజూ శాంసన్ బ్యాట్‌తో పరుగులు చేయలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5 (4 బంతులు), 0 (తొలి బంతి), 1 (7 బంతులు) మాత్రమే చేశాడు. మొత్తం 12 బంతులు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. మాంచెస్టర్ టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు శాంసన్‌తో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే, జింబాబ్వే పర్యటన జట్టులోనే పూర్తిగా చోటు కోల్పోతాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.
సంజూపైనే ఎందుకు?
ఈ పర్యటనలో శాంసన్‌తో పాటు పలువురు బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. అయినా వారికి జట్టులో చోటు కల్పించి, సంజూను తప్పించారు. జింబాబ్వే పర్యటనకు ఇటీవలి ప్రదర్శననే ప్రామాణికంగా తీసుకుంటే.. ప్రతీ ఆటగాడికి వర్తింజేశారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కొంతకాలంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మహ్మద్ షమీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇటీవల సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అయితే, శాంసన్ వ్యవహారం కొంత భిన్నంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దూకుడుగా ఆడాలంటున్న టీమ్ మేనేజ్‌మెంట్
కోచ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక బ్యాటర్లు భయం లేకుండా దూకుడుగా ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. వికెట్ గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాలని ప్రోత్సహిస్తోంది. అలాంటి వాతావరణం ఏర్పడాలంటే ఆటగాళ్లకు తమ స్థానంపై భరోసా ఉండాలి. కేవలం మూడు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన జట్టులో నుంచి తప్పిస్తే భవిష్యత్‌లో బ్యాటర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ ఆదర్శమని చెప్పడమే కారణమా?
ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు చిన్ననాటి హీరో, స్ఫూర్తి అన్నీ మహేంద్ర సింగ్ ధోనీ అని శాంసన్ చెప్పాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే శాంసన్‌కు ప్రతికూలంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కెప్టెన్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ విభేదాలపై గతంలో వార్తలు వచ్చాయి. అయితే, శాంసన్ కామెంట్స్‌కు, ఎంపిక కాకపోవడానికి సంబంధం ఉందని నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జట్టు సమతుల్యతపై ప్రభావం
ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఎడమచేతి బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన కుడిచేతి బ్యాటర్ సంజూ శాంసన్‌ను తప్పించడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. వికెట్‌కీపర్‌గా, మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు చేసే బ్యాటర్‌గా శాంసన్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అలాంటి ఆటగాడిని కేవలం మూడు ఇన్నింగ్స్ ఆధారంగా తప్పించడం జట్టు భవిష్యత్ వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆలోచనా విధానంపై చర్చ
సంజూ శాంసన్ కెరీర్‌లో ఇలాంటి ఒడిదొడుకులు కొత్తకాదు. గతంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా తిరిగి బలంగా జట్టులోకి వచ్చాడు. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కొద్ది రోజులకే జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే, శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం ఆటగాడి ప్రదర్శన ఏమాత్రం తగ్గినా జట్టులో స్థానం ఉండదని సంకేతాన్ని జట్టుకు పంపినట్లుగా ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్...మరోవైపు ప్రమోషన్స్ - కాజల్ అగర్వాల్ డబుల్ డ్యూటీ
- ●Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు 'భరోసా' నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ
- ●Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి తుమ్మల
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..
- ●Etala Rajendar | మోదీ చేసినట్టు 10 శాతం చేసినా కచ్చితంగా గెలుస్తం
- ●Nizamabad | భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య

Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్...మరోవైపు ప్రమోషన్స్ - కాజల్ అగర్వాల్ డబుల్ డ్యూటీ

Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు 'భరోసా' నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ

Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి తుమ్మల

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..






