త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | ప్ర‌పంచ‌క‌ప్‌లో అమెరికా ఓట‌మి.. ముదిరిన వివాదం

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్‌–2026లో ప్రీక్వార్టర్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో బెల్జియం చేతిలో అమెరికా 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ త‌ర్వాత వివాదం మ‌రింత ముదిరింది. యూఎస్ జ‌ట్టు టోర్నీ నిష్క్ర‌మించిన త‌ర్వాత‌.. ఇరాన్‌, బెల్జియం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఫిఫాపై విమ‌ర్శ‌లు గుప్పించాయి.

P

Sports | Published On Jul 7, 2026, 3.54 pm IST

FIFA 2026 | ప్ర‌పంచ‌క‌ప్‌లో అమెరికా ఓట‌మి.. ముదిరిన వివాదం
Advertisement
  • ఫిఫా ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు
  • ట్రంప్‌, ఫిఫాపై మండిప‌డ్డ ఇరాన్‌, బెల్జియంపై ఆగ్ర‌హం

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్‌–2026లో ప్రీక్వార్టర్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో బెల్జియం చేతిలో అమెరికా 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ త‌ర్వాత వివాదం మ‌రింత ముదిరింది. యూఎస్ జ‌ట్టు టోర్నీ నిష్క్ర‌మించిన త‌ర్వాత‌.. ఇరాన్‌, బెల్జియం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఫిఫాపై విమ‌ర్శ‌లు గుప్పించాయి. మరోవైపు అమెరికా అభిమానులు కూడా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆట‌తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అస‌లు లొల్లి మొద‌లైంది ఇక్క‌డే..

అమెరికా స్టార్ స్ట్రైక‌ర్ ఫోలారిన్‌ బాలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్‌ ఆటోమేటిక్‌ సస్పెన్షన్‌ను ఫిఫా ఎత్తివేయడమే వివాదానికి కేంద్రబిందువైంది. బోస్నియా అండ్‌ హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో రెడ్‌కార్డు కార‌ణంగా బాలోగ‌న్ త‌ర్వాతి మ్యాచ్‌లో ఆడ‌కూడ‌దు. అయిన‌ప్ప‌టికీ బెల్జియంతో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో ఆడేందుకు ఫిఫా అనుమ‌తి ఇచ్చింది. ఈ నిర్ణయానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోతో మాట్లాడినట్లు వార్త‌లు వ‌చ్చాయి. క్రీడ‌ల్లో రాజ‌కీయం జోక్యం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. పలు దేశాలు, ఫుట్‌బాల్‌ నిపుణులు ఫిఫా నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించారు.

ఇరాన్ ఏమ‌న్న‌దంటే..?

అమెరికా పరాజయం పాలైన త‌ర్వాత ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రతినిధి ఘాటుగా స్పందించారు. "రాజకీయాలపై ఫుట్‌బాల్‌ సాధించిన ఈ అవమానకర విజయాన్ని ఇప్పుడు ప్రపంచమంతా సంబరంగా జరుపుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. టోర్నీ ప్రారంభం నుంచే తమ జట్టుపై వివక్ష చూపుతున్నారని ఇరాన్‌ ఆరోపిస్తోంది. జట్టు ప్రధాన కోచ్‌ అమీర్‌ ఘాలెనోయీ తమ జట్టును "ఈ ప్రపంచకప్‌లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న జట్టు"గా అభివర్ణించారు. వీసాల జారీలో జాప్యం, ప్రయాణ ఆంక్షలు, ఇతర సమస్యలు జట్టు సన్నాహకాలను దెబ్బతీశాయని ఆరోపించారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం టోర్నీపై పడిందని, అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించలేదని ఇరాన్ వాద‌న‌.

ట్రంప్‌, ఫిఫాపై బెల్జియం సెటైర్లు

అమెరికాపై గెలుపొందాక బెల్జియం సైతం తనదైన శైలిలో స్పందించింది. ఇంజ్యూరీ టైమ్‌లో రొమేలు లుకాకు గోల్ చేసిన త‌ర్వాత పలువురు బెల్జియం ఆటగాళ్లు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఫేమ‌స్ డ్యాన్స్‌ స్టెప్‌ను అనుకరిస్తూ సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ త‌ర్వాత బెల్జియం అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో "ఇదీ చూపించండి" అంటూ చేసిన పోస్టు కూడా చర్చనీయాంశమైంది. బాలోగన్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన నిర్ణయాన్ని ఉద్దేశించేలా ఈ వ్యాఖ్య చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, బెల్జియం కెప్టెన్‌ యూరి టీలెమాన్స్ సైతం బాలోగన్‌ వివాదంపై స్పందించారు. "ఆ నిర్ణయం గురించి తెలిసిన వెంటనే జట్టుగా సమావేశమయ్యాం. మైదానంలో ఆటతోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదే చేశాం. మా జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది" అని వ్యాఖ్యానించాడు.

సొంత జట్టుపై అభిమానుల ఆగ్రహం

ఓటమి తర్వాత అమెరికా అభిమానులు తమ జట్టును సోషల్‌ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. జట్టు ప్రదర్శనను సిగ్గుచేట‌ని, నిరాశ‌జ‌న‌కంగా ఉందంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు బెల్జియం జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను అభినందించారు. మ్యాచ్‌లో ఆ జ‌ట్టు విజ‌యానికి పూర్తిగా అర్హ‌మ‌ని వ్యాఖ్యానించారు. అయితే, యూఎస్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించినా.. బాలోగన్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత వివాదం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణ‌గేలా లేదు. ఈ ఘటనతో ఫిఫా తటస్థ వైఖ‌రిపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కీలక టోర్నీల నిర్వహణలో ప్రపంచ ఫుట్‌బాల్‌ సంస్థ రాజకీయ ఒత్తిళ్లకు పూర్తిగా అతీతంగా వ్యవహరించగలదా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యూఎస్ ఎగ్జిట్ త‌ర్వాత ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోగా.. మరింత ముదురుతున్న పరిస్థితి క‌నిపిస్తోంది.

Advertisement
Advertisement