త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొత్త కళ.. రూ.360 కోట్లతో సర్కార్ భారీ ప్రణాళిక

తెలంగాణ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల రూపురేఖలు మారనున్నాయి. ప్రజల సౌకర్యార్థం రూ.360 కోట్లతో ఆధునిక హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

J

Telangana | Published On Jul 7, 2026, 5.32 pm IST

Ponguleti Srinivas Reddy | రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొత్త కళ.. రూ.360 కోట్లతో సర్కార్ భారీ ప్రణాళిక
Advertisement
  • రూ.360 కోట్లతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల కోసం శాశ్వత భవనాల నిర్మాణం
  • 107 తహసీల్దార్, 10 ఆర్డీవో, 48 సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల కోసం నిధుల మంజూరు
  • 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల నిర్మాణం
  • ప్రైవేట్ సంస్థలతో ఈ నిర్మాణాలు చేపడుతుండగా, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా వారిదే

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : అద్దె భవనాల్లో, కనీస సౌకర్యాలు లేని శిథిలావస్థకు చేరిన ఆఫీసుల్లో పనులు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల (Revenue and Registration departments) రూపురేఖలను మార్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏకంగా రూ.360 కోట్లతో దశలవారీగా ఆధునిక హంగులతో శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొత్త భవనాల వివరాలు ఇవే

పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం తొలి విడతలో అద్దె భవనాల్లో నడుస్తున్న 107 తహసీల్దార్ (Tahsildar), 10 ఆర్డీవో (RDO) ఆఫీసులకు ఒకే నమూనాలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లు మంజూరు చేశారు.

అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో రూ.97 కోట్లతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (Sub-Registrar Offices), ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించనున్నారు. వీటితో పాటు నిజామాబాద్, వరంగల్‌లో డీఐజీ ఆఫీసులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ శాశ్వత భవనాల నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు (Telangana Housing Corporation) అప్పగించారు. స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఓఆర్ఆర్ పరిధిలో 'ఇంటిగ్రేటెడ్' ఆఫీసులు

హైదరాబాద్ శివారులో రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా (Clusters) విభజించి, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆఫీసులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు ఈ భవనాల మెయింటెనెన్స్ (Maintenance) బాధ్యత కూడా ఆ సంస్థలదే కావడం విశేషం. ఇప్పటికే 4 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

కొత్తగా నిర్మించే ఈ భవనాల ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు (Transparent services) అందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement