త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nothing Phone 4b | న‌థింగ్ ఫోన్ 4బి వ‌చ్చేసింది.. భార‌త్‌కు స్పెష‌ల్ ఎడిష‌న్‌.. అదిరిపోయిన ఏఐ ఫీచ‌ర్లు..

Nothing Phone 4b | మొబైల్స్ త‌యారీ సంస్థ న‌థింగ్ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ న‌థింగ్ ఫోన్ 4బిని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ప్ర‌త్యేకమైన డిజైన్‌ను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని, రోజువారీ వినియోగంలో సమర్థవంతమైన పనితీరును అందించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Jul 7, 2026, 5.27 pm IST

Nothing Phone 4b | న‌థింగ్ ఫోన్ 4బి వ‌చ్చేసింది.. భార‌త్‌కు స్పెష‌ల్ ఎడిష‌న్‌.. అదిరిపోయిన ఏఐ ఫీచ‌ర్లు..
Advertisement

Nothing Phone 4b | మొబైల్స్ త‌యారీ సంస్థ న‌థింగ్ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ న‌థింగ్ ఫోన్ 4బిని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ప్ర‌త్యేకమైన డిజైన్‌ను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని, రోజువారీ వినియోగంలో సమర్థవంతమైన పనితీరును అందించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. డిజైన్ పరంగా నథింగ్ తన ప్రత్యేకతను మరోసారి కొనసాగించింది. ఫోన్ 4ఎ ప్రోలో ఉన్న హై-స్ట్రెంగ్త్ పాలీకార్బొనేట్ యూనీబాడీ డిజైన్‌ను కొనసాగిస్తూ, కొత్తగా అభివృద్ధి చేసిన గ్లిఫ్ బార్ ను ఇందులో అందించింది. ఫోన్ బాడీపై ప్రత్యేక ప్రైమర్, కలర్ కోటింగ్, యూవీ టాప్ లేయర్ ఉపయోగించడం వల్ల వేలిముద్రలు సులభంగా పడకుండా ఉండటంతోపాటు చేతిలో సాఫ్ట్ ఫినిష్ అనుభూతిని ఇస్తుంది.

ఆర్‌సీబీ కోసం ప్ర‌త్యేక వేరియెంట్‌..

ఫోన్ వెనుక భాగంలో 45 మినీ ఎల్ఈడీలతో రూపొందించిన కొత్త గ్లిఫ్ గ్రిడ్ ఉంది. ఇవి ఐదు స్క్వేర్‌లుగా ఉంటాయి. గత వెర్షన్‌తో పోలిస్తే 40 శాతం ఎక్కువ ప్రకాశాన్ని అందిస్తాయి. లైట్ లీకేజ్ లేకుండా రూపొందించిన ఈ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ద్వారా జొమాటో, ఉబెర్ వంటి యాప్‌ల డెలివరీ ప్రోగ్రెస్, కెమెరా కౌంట్‌డౌన్, ప్రత్యక్ష క్రికెట్ స్కోర్లు వంటి సమాచారాన్ని చూడవచ్చు. మన్నిక విషయంలో కూడా ఫోన్ ను అప్‌డేట్ చేశారు. దీనికి ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. అలాగే పాత ఫోన్ 3ఎ లైట్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువ బెండ్ రెసిస్టెన్స్ ఉందని కంపెనీ వెల్లడించింది. నథింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో భాగస్వామ్యంగా నథింగ్ ఫోన్ 4బి ఆర్‌సీబీ లిమిటెడ్ ఎడిషన్ ను కూడా విడుద‌ల చేసింది. ఆర్‌సీబీ రెండో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. ప్రత్యేక ఎరుపు రంగు, ఆర్‌సీబీ బ్రాండింగ్, కలెక్టర్ ఎడిషన్ ప్యాకేజింగ్, ప్రత్యేక వాల్‌పేపర్లు ఇందులో ఉంటాయి. ఇది ఆర్‌సీబీతో కలిసి విడుదలైన తొలి అధికారిక స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

భార‌త్ వేరియెంట్ ప్ర‌త్యేకం..

భారత్‌కు ప్రత్యేకంగా ఈ ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ మోడ‌ల్ ను అందించారు. గ్లోబల్ వెర్షన్‌లో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, భారతీయ వినియోగదారులకు భారీ సామర్థ్యం క‌లిగిన బ్యాటరీని అందించడం విశేషం. నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటివరకు వచ్చిన అత్యధిక బ్యాటరీ సామర్థ్యం ఇదేనని కంపెనీ పేర్కొంది. ఫోన్ 4ఎ తో పోలిస్తే దాదాపు గంటపాటు అదనపు స్క్రీన్ టైమ్ లభిస్తుందని తెలిపింది. ఈ బ్యాటరీని సేఫ్ సెల్ టెక్నాలజీతో రూపొందించారు. 1,200 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా మొత్తం సామర్థ్యంలో 90 శాతం నిల్వ ఉంటుంద‌దని, ఇది సుమారు మూడు సంవత్సరాల భారీ వినియోగానికి సమానమని కంపెనీ వెల్లడించింది. 33 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 27 నిమిషాల్లో 50 శాతం, 80 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. 7.5వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే యూట్యూబ్‌ను 22 గంటలు, ఇన్‌స్టాగ్రామ్‌ను 27 గంటలు లేదా నిరంతర గేమింగ్‌ను 9 గంటల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెస‌ర్‌..

పనితీరు కోసం ఇందులో 4 నానోమీటర్ ప్రాసెస్‌పై రూపొందిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించారు. నథింగ్ ఓఎస్ ఆప్టిమైజేషన్‌తో కలిపి ఫోన్ 3ఎ లైట్‌తో పోలిస్తే సీపీయూ పనితీరు 15 శాతం, జీపీయూ పనితీరు 25 శాతం మెరుగుపడిందని తెలిపింది. భారీ గేమింగ్ సమయంలో కూడా ఫోన్ చల్లగా ఉండేందుకు మొత్తం 20,829 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ ఏరియాతోపాటు 4,400 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్‌ను అమర్చారు. బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలో 90 ఎఫ్‌పీఎస్ వరకు గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో 6.77 ఇంచుల శాంసంగ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120హెడ్జ్‌ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 2000 నిట్స్ బ్రైట్‌నెస్, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 160 స్థాయిల వాల్యూమ్ ట్యూనింగ్ ను కూడా అందించారు.

అద్భుత‌మైన కెమెరాలు..

కెమెరా విభాగంలో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్‌తో వస్తుంది. దీనికి డ్యూయల్ యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. రెండోది 119.5 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కాగా ఈ ఫోన్‌లో ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేసిన అల్ట్రా ఎక్స్‌డీఆర్ టెక్నాలజీని అందించారు. వివిధ ఎక్స్‌పోజర్‌లతో 13 రా ఫ్రేమ్‌లను కలిపి నీడలు, హైలైట్‌లను సమతుల్యం చేసి సహజమైన ఫోటోలను అందిస్తుంది. తీసిన చిత్రాలను నేరుగా గూగుల్ ఫొటోస్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయవచ్చు. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక కెమెరాతో 4కే వీడియోను 30 ఎఫ్‌పీఎస్ వరకు రికార్డ్ చేయవచ్చు. అలాగే ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే డ్యూయల్ వీడియో క్యాప్చర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

ఆక‌ట్టుకునే ఏఐ ఫీచ‌ర్లు..

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 4.1తో వస్తుంది. లాక్ స్క్రీన్ డెప్త్ ఎఫెక్ట్, కొత్త క్విక్ సెట్టింగ్స్, అమోలెడ్ స్క్రీన్ బర్న్-ఇన్‌ను తగ్గించే పిక్సెల్ స్థాయి మైక్రో షిఫ్టింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కంపెనీ కొత్త ఎసెన్షియల్ ఏఐ టూల్స్‌ను కూడా ఇందులో అందించింది. ఫిజికల్ ఎసెన్షియల్ కీ లేదా హోమ్ స్క్రీన్ విడ్జెట్‌ల ద్వారా వీటిని ఉపయోగించవచ్చు. ఎసెన్షియల్ వాయిస్ మాట్లాడిన విషయాలను అవసరం లేని పదాలను తొలగించి, వ్యాకరణ దోషాలను సరిచేసి, 100కిపైగా భాషల్లో అనువదించిన టెక్స్ట్‌గా మారుస్తుంది. ఎసెన్షియల్ స్పేస్ ఫొటోలు, స్క్రీన్‌షాట్‌లు, వాయిస్ నోట్స్‌ను భద్రపరిచి, వాటి ఆధారంగా టు-డూ లిస్టులు, సారాంశాలను రూపొందిస్తుంది. ఎసెన్షియల్ సెర్చ్ వెబ్ సెర్చ్ ఫలితాలతోపాటు ఎసెన్షియల్ స్పేస్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఒకే చోట చూపిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల పరంగా మూడు ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్న‌ట్లు నథింగ్ తెలిపింది.

ధ‌ర ఎంతంటే..

నథింగ్ ఫోన్ 4బిలో డిస్‌ప్లేకు హెచ్‌డీఆర్10 ప్లస్ రేటింగ్ ఇచ్చారు. అందువ‌ల్ల దృశ్యాలు అద్బుతంగా క‌నిపిస్తాయి. అలాగే ఏజీసీ డీటీ-స్టార్ 2 ప్రొటెక్షన్ ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్, డ్యూయల్ నానో సిమ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, ఐపీ64 రేటింగ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్-సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.34,999 ఉండ‌గా, 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.38,999గా ఉంది. 7.5 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్‌తో వరుసగా రూ.29,999, రూ.33,699 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, వైట్, కొత్త బ్లూ రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది. జూలై 14 నుంచి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక నథింగ్ ఫోన్ 4బి ఆర్‌సీబీ ఎడిషన్ ను జూలై 7న సాయంత్రం 4 గంటల నుంచి ఒకరోజు పాటు బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో మాత్రమే ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ విధానంలో విక్రయించనున్నారు.

Advertisement
Advertisement