త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | జై ఉస్మానియా.. జ‌య‌హో ఉస్మానియా.. ఘనంగా ఓయూ 109వ వ్య‌వ‌స్థాప‌క వేడుక‌లు

Osmania University | ఉస్మానియా విశ్వవిద్యాలయ 109వ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26న జరగనున్న వ్యవస్థాపక వేడుకలకు ప్రారంభ సూచికగా ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు నిర్వహించిన పౌండేషన్ డే వాక్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

S

Telangana | Published On Apr 25, 2026, 1.53 pm IST

Osmania University | జై ఉస్మానియా.. జ‌య‌హో ఉస్మానియా.. ఘనంగా ఓయూ 109వ వ్య‌వ‌స్థాప‌క వేడుక‌లు
Advertisement

Osmania University | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ 109వ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26న జరగనున్న వ్యవస్థాపక వేడుకలకు ప్రారంభ సూచికగా ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు నిర్వహించిన పౌండేషన్ డే వాక్‌కు అనూహ్య స్పందన వచ్చింది. గతాన్ని స్మరిస్తూ, భవిష్యత్తుకు బాటలు వేస్తూ... ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెస‌ర్ కుమార్ మొలుగరం జెండా ఊపి వాక్‌ను ప్రారంభించారు.

చారిత్రక ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఓయూ 109వ వ్యవస్థాపక ఆరంభ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ప్రాంగణం మొత్తం ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, ఎన్‌సిసి (NCC), ఎన్‌ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు సహా దాదాపు వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేకంగా రూపొందించిన తెల్లటి టీ-షర్టులు ధరించడంతో ప్రాంగణం శ్వేతవర్ణ సంద్రంలా మారింది. "జై ఉస్మానియా" “జయహో ఉస్మానియా” నినాదాలతో క్యాంపస్ మార్మోగింది. శతాబ్ద కాలనికి పైగా సామాజిక మార్పుకు, విద్యా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓయూ స్ఫూర్తిని చాటుతూ, ఆర్ట్స్ కాలేజీ నుండి ఇంజనీరింగ్ కాలేజీ వరకు మార్నింగ్ వాక్ కొనసాగింది.

వాక్ అనంతరం ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరిగిన సభలో ఓయూ వీసీ ప్రొఫెస‌ర్ కుమార్ మొలుగరం మనమంతా ఓ సజీవ చరిత్రలో భాగస్వాములమంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ సంస్థకు పునాది వేసిన హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి దూరదృష్టికి రుణపడి ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఓయూ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవటం కేవలం ఒక్క రోజు వేడుక మాత్రమే కాదని.. సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనలు చేస్తూ, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దుతున్న ఒక గొప్ప వారసత్వాన్ని గౌరవించుకోవటమని అన్నారు. ఇప్పటికే 109 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓయూ... వందల ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి, ప్రపంచానికి ఉన్నత విద్యారంగంలో దిక్సూచిగా అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. రేపు ఉదయం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే వ్యవస్థాపక వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు, వాలంటీర్లు చేసిన ఫ్లాష్ మాబ్స్, మెడ్లీ డ్యాన్స్ ప్రదర్శనలు వేడుకల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ బి. లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement