త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Adluri Laxman | నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన వృద్ధులకు సురక్షితమైన ఆశ్రయం, దుస్తులు, పౌష్టికాహారం, ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు 33 జిల్లాల్లో దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.

S

Telangana | Published On Oct 1, 2026, 5.56 pm IST

Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
Advertisement
  • చేయూత పింఛన్ ద్వారా 15.60 లక్షల మందికి లబ్ది
  • జిల్లాల్లో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి
  • పది లక్షల వరకు నగదు రహిత వైద్యం
  • వృద్ధుల సంరక్షణ కోసం 1700 మందికి జెరియాట్రిక్ కేర్ వింగ్‌లో శిక్షణ
  • 30 డే కేర్‌ కేంద్రాల్లో ఉచిత సేవలు
  • సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Adluri Laxman | త్రినేత్ర న్యూస్‌: నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన వృద్ధులకు సురక్షితమైన ఆశ్రయం, దుస్తులు, పౌష్టికాహారం, ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు 33 జిల్లాల్లో దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. ప్రస్తుతం 10 వృద్ధాశ్రమాలు నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. వృద్ధుల గౌరవం, భద్రత, ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు ప్ర‌జా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. వృద్ధులు తమ సమస్యలను సులభంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారిని నియమించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల అమలు, వారి హక్కుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1990 డిసెంబర్‌ 14న తీర్మానం 45/106 ద్వారా అక్టోబర్‌ 1ను అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. వృద్ధుల సేవలను గుర్తించడం, వారి జీవనాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలపై సమాజంలో అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 3.53 కోట్ల జనాభాలో 32.69 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, వృద్ధుల సంక్షేమంపై అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 1 వరకు వారోత్సవాలు నిర్వహించారని, ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివిధ అవగాహన, వైద్య, సామాజిక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి వివ‌రించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా పిల్లల్లో బాధ్యత పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను సమర్థంగా అమలు చేస్తూ వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

త్వ‌రిత‌గ‌తిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

వృద్ధుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నిర్వహణ ట్రిబ్యునళ్లలో కేసుల దాఖలు ప్రక్రియను సులభతరం చేశామ‌ని అడ్లూరి తెలిపారు. గతేడాది నిర్వహణ ట్రిబ్యునళ్లలో 2,505 భరణం కేసులు దాఖలు కాగా 1,346 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో దాఖలైన 409 అప్పీళ్లలో 234 పరిష్కరించారనీ తెలిపారు. తల్లిదండ్రులను నిరాదరించిన పిల్లల నుంచి ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరున బదలాయించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలోని అథారిటీల వద్ద 209 కేసులు నమోదుకాగా 135 పరిష్కరించారనీ అప్పిలేట్‌ అథారిటీ వద్ద నమోదైన 18 అప్పీళ్లలో 15 పరిష్కరించడం జరిగిందని వివరించారు.

14567కు ఫోన్‌ చేస్తే చేయూత

వృద్ధులకు అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు 14567 టోల్‌ఫ్రీ ఎల్డర్‌ లైన్‌ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. వేధింపులు, నిరాదరణ, ఒంటరితనం, ఆశ్రయం వంటి సమస్యలపై వృద్ధులు ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో సహాయక బృందాలు స్పందించి వారికి అండగా నిలుస్తున్నాయన్నారు.

వృద్ధుల‌కు ఆర్థిక, వైద్య భ‌రోసా

రాష్ట్రంలో సామాజిక భద్రతకు చేయూత పింఛన్లు కీలకంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైన 15.60 లక్షల మంది వృద్ధులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్‌ అందిస్తూ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

వృద్ధుల సంరక్షణలో అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి చెప్పారు. వారి సంర‌క్ష‌ణ‌కు నైపుణ్యం కలిగిన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు 1,700 మందికి జెరియాట్రిక్‌ కేర్ గివింగ్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 30 డే కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల్లో పౌష్టికాహారం, వైద్య సేవలు, ఆటలు, వినోద కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారనీ వివరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వృద్ధులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. వృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్‌ ఏర్పాటు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రత్యేక గుర్తింపు కార్డులు, మెరుగైన వైద్య సదుపాయాలు, ఆర్థిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజేంద్ర బోయి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, పలువురు అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వృద్ధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement