త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRS | టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబ‌ర్‌లో ఇంద్ర‌వెల్లిలో భారీ బ‌హిరంగ స‌భ‌

TRS | ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు (Meshram Anand Rao) తెలంగాణ రక్షణ సేన (TRS)లో చేరారు.

G

Telangana | Published On Sep 13, 2026, 12.57 pm IST

TRS | టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబ‌ర్‌లో ఇంద్ర‌వెల్లిలో భారీ బ‌హిరంగ స‌భ‌
Advertisement

TRS | త్రినేత్ర‌.న్యూస్‌: ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు (Meshram Anand Rao) తెలంగాణ రక్షణ సేన (TRS)లో చేరారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ ప్ర‌ధాన‌ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఆనంద రావుతోపాటు పలువురు సర్పంచులు, ముఖ్య నాయకుల కూడా టీఆర్ఎస్‌లో చేరారు. నాగోబా (Nagoba) భక్తురాలైన కవిత ఆ అమ్మవారి ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని విశ్వసిస్తారు. ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద అయిన మేస్రం ఆనందరావు చేరికతో తమ బలం రెట్టింపు అయ్యిందనే భావనలో ఉన్నారు.

ఇంద్రవెల్లిలో బహిరంగ సభ

అక్టోబర్ నెలలో ఇంద్రవెల్లి (Indravelli) కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేలా కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజ‌యవంతం కావ‌డంతో జోష్ మీద ఉన్న పార్టీ క్యాడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకు ఈనెల 20న కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నాల్లో కవిత ఉన్నారు. కొడంగల్ బహిరంగ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ నిర్వహించే తేదీని ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్ రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణా తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement