త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy | కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వ‌స్తే ముక్కు నేల‌కు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. హుజూరాబాద్‌లో తానూ రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. అనంతరం జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి (Revanth Reddy) డిపాజిట్ వస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు.

G

Telangana | Published On Sep 8, 2026, 10.08 am IST

Padi Kaushik Reddy | కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వ‌స్తే ముక్కు నేల‌కు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Advertisement

 

Padi Kaushik Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. హుజూరాబాద్‌లో తానూ రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. అనంతరం జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి (Revanth Reddy) డిపాజిట్ వస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష.. ఉపయోగించిన పదజాలం తెలంగాణ సమాజం మొత్తం చూసిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్ట‌ర్ సంజ‌య్‌, మాధ‌వ‌రం కృష్ణారావుతో క‌లిసి ఆయ‌న‌ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు.

శాసనసభ్యులను అవమానించార‌ని, అసెంబ్లీలో మహిళా జర్నలిస్టులపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని విమ‌ర్శించారు. కత్తులతో నరుకుతామని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు అన్నారని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీతో తనపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఎత్తుకు పోయి, తమ పార్టీ బీ ఫారంపై గెలిచినా వ్యక్తి కడియం శ్రీహరి (Kadiyam Srihari) అని, అలాంటి వ్య‌క్తి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎంపీ అయినప్పుడు క‌డియం శ్రీహ‌రికి ఎథిక్స్ గుర్తు రాలేదా అని ధ్వ‌జ‌మెత్తారు.

ఎవ‌రినో అంటే స్పీక‌ర్‌కు ఆపాదించారు..

ఎమ్మెల్సీ తాతా మధు ఎవరినో ఒక మాట అంటే కాంగ్రెస్ నాయకులు దానిని స్పీకర్‌కు ఆపాదించార‌ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్ట‌ర్ కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) విమ‌ర్శించారు. అసలు స్పీకర్‌ని అవమానించింది కాంగ్రెస్ నాయకులేన‌ని చెప్పారు. మూడేండ్లుగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారని మండిప‌డ్డారు. ఇంకెన్ని రోజులు చేస్తారని ప్ర‌శ్నించారు. అధికార మదంతో విర్రవీగకూడ‌ద‌ని, బాధ్యతతో వ్యవహరించాల‌ని హిత‌వు ప‌లికారు. రేవంత్ రెడ్డి భాష వల్లే తెలంగాణలో మహిళలపై క్రైమ్ రేట్ పెరిగిందని ఆరోపించారు.

ఇది సర్కార్ కాదు సర్కస్ అని పలు మార్లు రుజువైంద‌న్నారు. ముఖ్యమంత్రి వాడిన భాష మేము ఎక్కడ వాడలేద‌ని చెప్పారు. అసెంబ్లీకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు మగ పోలీసులు, మగ ఎమ్మెల్యేలకు మహిళా పోలీసులను పెట్టి అడ్డుకున్నారని చెప్పారు. మగ ఎమ్మెల్యేలకు మహిళా పోలీసులతో నెట్టి దాడి చేయించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా ఎమ్మెల్యేల ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తించార‌ని, పోలీస్ అధికారి శిల్పవల్లి తీరు బాధాకరమ‌ని చెప్పారు. మీరు చదువుకున్న ఆఫీస‌ర్ అని, ఇదేనా సంస్కారమ‌ని మండిప‌డ్డారు. జుట్టు పట్టి లాగి, చీర లాగి అవమానకరంగా ప్రవర్తించార‌ని, ఇది పద్దతి కాదన్నారు.

 

Advertisement
Advertisement