త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?

ఒకనాడు రాజకీయ ప్రత్యర్థులను వారి సొంత గడ్డపై కట్టడి చేసిన వ్యూహాన్నే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ రచిస్తున్న ఈ కొత్త రాజకీయ ప్రణాళిక రాష్ట్రంలో ఎజెండాను ఎటువైపు మళ్లిస్తుందనే చర్చకు తెరతీసింది.

S

News | Published On Sep 7, 2026, 5.22 pm IST

ఆపరేషన్ ‘కౌంటర్ ఫోర్ట్రెస్’: కేసీఆర్ పాత వ్యూహాన్నే రివర్స్ చేస్తున్నారా రేవంత్?

సంక్షిప్త సారాంశం

గత ఎన్నికల అనుభవాలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ కీలక నేతల ప్రాతినిధ్య స్థానాలను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా, ప్రభుత్వ పనితీరునే ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సిట్లు గెలవడం కంటే రాజకీయ చర్చను ఎవరి మైదానంలో నిలపాలి అనేదానిపై జరుగుతున్న ఈ వ్యూహాత్మక పోరులో, రాబోయే పరిణామాలు తెలంగాణ రాజకీయ ఎజెండాను ఎలా మారుస్తాయనేదే ఈ విశ్లేషణ.

Advertisement

                            ఎజెండా ఎవరిది? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వేదికగా రేవంత్ కొత్త రాజకీయ చదరంగం!

 

రాజకీయాల్లో ఒక వ్యూహానికి శాశ్వత యజమాని ఎవరూ ఉండరు. ఒక దశలో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టిన ఎత్తుగడే, కాలం మారిన తర్వాత అదే ప్రత్యర్థి చేతిలో ఆయుధంగా మారవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం కూడా దాదాపు అలాంటిదే. ఒకప్పుడు కాంగ్రెస్‌లోని కీలక నేతలను వారి సొంత నియోజకవర్గాల్లోనే ఇరుకున పెట్టడం ద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకున్న కేసీఆర్ వ్యూహాన్ని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో రూపంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపైనే ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

సిరిసిల్లలో కేటీఆర్... సిద్దిపేటలో హరీశ్‌రావు... గజ్వేల్‌లో కేసీఆర్. బీఆర్ఎస్‌కు రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ మూడు కేంద్రాలనే రేవంత్ వరుసగా ప్రస్తావించడం యాదృచ్ఛికం కాదు. అసలు లక్ష్యం అక్కడ వెంటనే ఎన్నిక గెలవడమేనా? లేక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలను వారి సొంత రాజకీయ నేలకే పరిమితం చేయడమా? ఇక్కడే ఈ వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది.

కొడంగల్ అనుభవం... ఒక రాజకీయ జ్ఞాపకం

తెలంగాణ ఏర్పాటుకు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రత్యర్థి పార్టీల బలమైన స్థానాలను టార్గెట్ చేయడం గులాబీ పార్టీ రాజకీయ శైలిలో కనిపించింది. 2014లో జనగామ నుంచి పోటీ చేసిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓటమి కాంగ్రెస్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. 2018 నాటికి ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్‌కు బలమైన ముఖాలుగా ఉన్న పలువురు సీనియర్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభావశీల నేతగా ఉన్న డీకే అరుణ గద్వాలలో ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ ఆందోల్‌లో పరాజయం పాలయ్యారు. గీతారెడ్డి జహీరాబాద్‌లో, షబ్బీర్ అలీ కామారెడ్డిలో ఓటమి చూశారు. అయితే ఆ ఎన్నికల్లో రాజకీయంగా అత్యంత చర్చనీయాంశమైన ఫలితం కొడంగల్‌ది . అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై TRS ప్రత్యేక దృష్టి పెట్టింది. కొడంగల్‌లో రాజకీయ శక్తిని కేంద్రీకరించింది. చివరకు రేవంత్ 9,319 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి రేవంత్ రాజకీయ జీవితాన్ని ఆపలేదు. కానీ ప్రత్యర్థి బలమైన నేతను అతని సొంత నియోజకవర్గంలోనే ఎంగేజ్ చేస్తే దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆయన ప్రత్యక్షంగా చూసిన ఎన్నిక అది. ఇప్పుడు అదే కొడంగల్ జ్ఞాపకం తెలంగాణ రాజకీయాల్లో మరో రూపంలో తిరిగి కనిపిస్తోందా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.

ఇప్పుడు టార్గెట్ మూడు పవర్ సెంటర్లు

నకిరేకల్ వేదికగా రేవంత్ చేసిన తాజా వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం ఇదే. సిరిసిల్లలో కేటీఆర్‌ను, సిద్దిపేటలో హరీశ్‌రావును మాత్రమే కాదు... కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ను కూడా రాజకీయ సవాల్ పరిధిలోకి తీసుకొచ్చారు. అసెంబ్లీకి రావడం లేదంటూ కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్‌లో ఉప ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. అక్కడితో ఆగలేదు. సెప్టెంబర్ చివర్లో సిరిసిల్లకు, అక్టోబర్‌లో సిద్దిపేటకు వెళతానని రేవంత్ టైమ్‌లైన్ కూడా ప్రకటించారు. అంటే ఇది కేవలం సభలో విసిరిన సవాల్ మాత్రమే కాదన్న సంకేతాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. సీటు గెలవడం ఒక్కటే విజయమా?

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ — ఇవి కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాదు. ప్రస్తుతం BRS రాజకీయ నిర్మాణంలో మూడు కీలక నాయకత్వ కేంద్రాలు. అందుకే రేవంత్ టార్గెట్ చేస్తున్నది నియోజకవర్గాలనా? లేక నాయకత్వ కేంద్రాలనా? అన్నదే అసలు ప్రశ్న. రాజకీయాల్లో ప్రతి దాడి తక్షణ ఎన్నికల ఫలితం కోసం మాత్రమే ఉండదు. సిద్దిపేటను కాంగ్రెస్  అంత సుళువుగా గెలవకపోవచ్చు. సిరిసిల్లలోనూ పరిస్థితి అంత సులభం కాదు. గజ్వేల్‌కు కూడా ప్రత్యేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యూహాన్ని కేవలం “ఈ మూడు సీట్లు గెలుస్తారా?” అనే కోణంలోనే చూడటం పూర్తి విశ్లేషణ కాదు. కేటీఆర్, హరీశ్‌రావు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు, రైతు సమస్యలు, ఉద్యోగాలు, పాలన వంటి అంశాలపై నిరంతరం ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఇద్దరు నేతలను వారి సొంత నియోజకవర్గాల్లోనే రాజకీయంగా బిజీ చేయగలిగితే? తమ ప్రాంతాల్లో కేడర్‌ను సమీకరించుకోవడం, స్థానిక విమర్శలకు సమాధానం చెప్పడం, కాంగ్రెస్ కార్యక్రమాలకు ప్రతిస్పందించడం వంటి అవసరాలు పెరిగితే? అది అధికార పార్టీకి చిన్న రాజకీయ ప్రయోజనం ఎంత మాత్రం  కాదు. అందుకే ఇక్కడ కాంగ్రెస్‌కు విజయం కొలిచే ప్రమాణం కేవలం ఓట్ల లెక్క కాకపోవచ్చు. ప్రత్యర్థి నాయకత్వం తన సమయాన్ని ఎక్కడ ఖర్చు చేయాలో నిర్ణయించే స్థాయికి రాజకీయ ఒత్తిడి తీసుకెళ్లగలదా అన్నది కూడా ఒక ప్రమాణమే.

మూడు నియోజకవర్గాలు... మూడు వేర్వేరు లక్ష్యాలు

అయితే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లను ఒకే రాజకీయ కొలమానంతో చూడటం కూడా సరైంది కాదు. సిరిసిల్లలో కేటీఆర్‌ను, సిద్దిపేటలో హరీశ్‌రావును వారి సొంత రాజకీయ స్థావరాల్లో మరింతగా ఎంగేజ్ చేయడం కాంగ్రెస్‌కు ఒక వ్యూహాత్మక లక్ష్యంగా కనిపిస్తోంది. గజ్వేల్ విషయంలో మాత్రం సమీకరణం కొంచెం భిన్నంగా ఉంది. అక్కడ రేవంత్ సవాల్ నేరుగా కేసీఆర్ రాజకీయ హాజరుపైనే ఉంది. అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శను ఎన్నికల సవాల్‌గా మార్చడం ద్వారా, కేసీఆర్‌ను మళ్లీ ప్రత్యక్ష రాజకీయ పోరులోకి లాగాలని కాంగ్రెస్ చూస్తోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే మూడు నియోజకవర్గాలు ఒకే వ్యూహంలో భాగమైనా, వాటి వెనుక రాజకీయ ఉద్దేశాలు ఒకటిగా ఉండకపోవచ్చు.

కానీ BRS రేవంత్ వేసిన బోర్డుపైనే ఆడుతుందా?

ఇక్కడే కథకు రెండో వైపు మొదలవుతుంది. రేవంత్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చుట్టూ రాజకీయ చర్చను కేంద్రీకరించాలనుకుంటే, BRSకు అదే చర్చలోకి దిగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, ఎన్నికల హామీల అమలు, రైతు సమస్యలు, ఉద్యోగాలు వంటి అంశాలను ముందుకు తెస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ప్రభుత్వ పనితీరునే ప్రధాన రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కొనసాగితే రాజకీయ పోరు మరో ఆసక్తికర దశకు వెళ్తుంది. రేవంత్ — “మీ కంచుకోటల్లోనే తేల్చుకుందాం” అంటారు. BRS — “ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల లెక్క చెప్పండి” అంటుంది. అప్పుడు అసలు పోటీ నియోజకవర్గాల్లో మాత్రమే ఉండదు. ప్రజల ముందు ఏ అంశం ప్రధాన చర్చగా నిలవాలన్నదానిపైనే ఉంటుంది. రాజకీయాల్లో చాలా సందర్భాల్లో ఎన్నికల కంటే ముందే గెలవాల్సిన పోరు ఇదే — ఎజెండా ఎవరిది?

రేవంత్ వ్యూహానికి రిస్క్ కూడా ఉంది

ఈ వ్యూహం కాంగ్రెస్‌కు ఎంత అవకాశాన్ని ఇస్తుందో, అంతే ప్రమాదాన్ని కూడా మోస్తోంది. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ సాధారణ రాజకీయ నేలలు కావు. అక్కడ సంవత్సరాలుగా నిర్మించుకున్న కేడర్, స్థానిక నాయకత్వ నెట్‌వర్క్, వ్యక్తిగత అనుబంధాలు ఉన్నాయి. కేవలం సీఎం సభ పెట్టడం వల్ల లేదా రాజకీయ సవాళ్లు విసరడం వల్ల ఆ నిర్మాణాలు ఒక్కసారిగా కదిలిపోవు. అక్కడ కాంగ్రెస్‌కు విశ్వసనీయమైన స్థానిక నాయకత్వం కావాలి. కేడర్ కావాలి. ప్రభుత్వ పథకాలను రాజకీయ మద్దతుగా మార్చగలిగే స్థాయి సంస్థాగత బలం కావాలి. అవి లేకుండా పోటీని కేవలం రేవంత్ వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ హరీశ్‌రావు, రేవంత్ వర్సెస్ కేసీఆర్‌గా మార్చితే మరో ప్రమాదం ఉంది. అగ్రనేతలను డిఫెన్స్‌లోకి నెట్టాలన్న ప్రయత్నం, వారినే మళ్లీ తమ పార్టీ శ్రేణుల కేంద్రీకృత నాయకులుగా నిలబెట్టవచ్చు. అంతేకాదు, “మన నియోజకవర్గంపై అధికార పార్టీ ప్రత్యేక దాడి చేస్తోంది” అనే భావన స్థానిక BRS కేడర్‌లో ఏర్పడితే, చెల్లాచెదురుగా ఉన్న శ్రేణులు మరింతగా ఏకం కావచ్చు. అందుకే ఈ వ్యూహం పదునైనదే. కానీ ఏకపక్షంగా కాంగ్రెస్‌కే లాభం చేస్తుందని ఇప్పుడే చెప్పలేం.

అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది

తెలంగాణ రాజకీయాల్లో గతంలో TRSకు ప్రయోజనం చేకూర్చిన ఒక రాజకీయ పద్ధతిని ఇప్పుడు రేవంత్ మరో రూపంలో ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే తేడా ఉంది. 2018లో రేవంత్ ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. అప్పట్లో TRS అధికార పార్టీ. ఇప్పుడు BRS ప్రతిపక్షం. రాజకీయ పాత్రలు పూర్తిగా మారిపోయాయి. అందువల్ల పాత వ్యూహాన్ని తిరిగి ఉపయోగించడం మాత్రమే సరిపోదు. కొత్త రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా అది పనిచేయాలి. సిరిసిల్లలో సభ పెట్టడం ఒక విషయం. అక్కడ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించడం మరో విషయం. సిద్దిపేటలో హరీశ్‌రావును సవాల్ చేయడం ఒక విషయం. ఆయన స్థానిక పట్టును నిజంగా కదిలించడం మరో విషయం. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఉప ఎన్నికకు ఆహ్వానించడం ఒక విషయం. ఆ సవాల్‌ను రాష్ట్రవ్యాప్త రాజకీయ కథనంగా మలచడం మరో విషయం. అందుకే రాబోయే రోజుల్లో చూడాల్సింది కేవలం రేవంత్ ఎక్కడ సభ పెడతారన్నది కాదు. ఆ సభల తర్వాత రాజకీయ చర్చ ఎటు తిరుగుతుంది? కేటీఆర్, హరీశ్‌రావు తమ నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి వస్తుందా?

కోటలపై గురి.. కాని... అసలు గేమ్ ఎజెండాదే!

కేసీఆర్ ఈ సవాళ్లకు నేరుగా స్పందిస్తారా? లేక రేవంత్ విసిరిన సవాళ్లను పక్కనపెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, పనితీరు, ప్రజా సమస్యలపైనే BRS తన పోరాటాన్ని కొనసాగిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. రేవంత్ వ్యూహం సఫలమైతే కేటీఆర్, హరీశ్‌రావు తమ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. కేసీఆర్ కూడా గజ్వేల్ కేంద్రంగా వస్తున్న సవాళ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలా BRS అగ్రనేతలను వారి సొంత నియోజకవర్గాల చుట్టూ రాజకీయంగా బిజీ చేయగలిగితే కాంగ్రెస్‌కు అది వ్యూహాత్మకంగా కలిసి రావచ్చు.

అదే సమయంలో BRS ఈ సవాళ్ల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వ హామీల అమలు, పాలనలో లోపాలు, ప్రజా సమస్యలనే ప్రధాన అంశాలుగా కొనసాగిస్తే రేవంత్ వ్యూహం ఆశించిన స్థాయిలో ఫలించకపోవచ్చు. అందుకే ఈ పోరులో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లలో ఎవరు ఎవరిని సవాల్ చేస్తారన్నదొక్కటే ముఖ్యం కాదు. రేవంత్ తన సవాళ్లతో BRSను డిఫెన్స్‌లోకి నెట్టగలుగుతారా? లేక ప్రభుత్వ పనితీరునే BRS చర్చలో ఉంచి కాంగ్రెస్‌ను తిరిగి డిఫెన్స్‌లోకి నెడుతుందా? అన్నదే రాబోయే తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆసక్తికరమైన అంశం.

Advertisement
Advertisement