త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు సర్వసమ్మతి

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో విభేదాలు పక్కనబెట్టి 11 దేశాలు ఏకగ్రీవ ప్రకటన చేశాయి. మిడిల్ ఈస్ట్‌లో శాంతి, టెర్రరిజంపై మోదీ వ్యూహం ఫలించింది.

J

National | Published On Sep 13, 2026, 12.46 pm IST

BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు సర్వసమ్మతి

సంక్షిప్త సారాంశం

న్యూఢిల్లీలో జరిగిన 11 దేశాల బ్రిక్స్ సదస్సు రెండో రోజున 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026'ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పుతిన్, జిన్‌పింగ్ సహా ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగి ఐక్యతను చాటారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధంపై సంయమనం పాటించాలని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని బ్రిక్స్ స్పష్టం చేసింది. ఏకపక్ష ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఉల్లంఘనలపై డబ్ల్యూటీవో (WTO) వేదికగా పోరాడాలని తీర్మానించాయి.

Advertisement

BRICS Summit New Delhi | త్రినేత్ర.న్యూస్ : న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (BRICS) వార్షిక సదస్సు రెండో రోజున ప్రపంచ దృష్టిని ఆకర్షించే కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమిస్తూ.. 11 దేశాల కూటమి 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026'ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇరువైపులా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిలబడి దిగిన బ్రిక్స్ 'ఫ్యామిలీ ఫోటో' అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

గత మే నెలలో విదేశాంగ మంత్రుల స్థాయిలో కుదరని ఏకాభిప్రాయాన్ని భారత్ తన దౌత్య చొరవతో సాధించింది. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై నెలకొన్న భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి, ఉమ్మడి ప్రకటనను విడుదల చేసేలా చేయడంలో న్యూఢిల్లీ విజయవంతమైంది. "ఎలాంటి అభ్యంతరాలు లేకుండా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది" అని ప్రధాని మోదీ సభలో ప్రకటించారు.

PM Modi Flanked by Putin and Xi BRICS Adopts New Delhi Declaration

మిడిల్ ఈస్ట్‌లో శాంతికి పిలుపు

పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం అంతర్జాతీయ సమాజానికి ఏమాత్రం మేలు చేయదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించగా, పశ్చిమాసియాకు అమెరికా 'పోలీస్‌'గా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది.

టెర్రరిజంపై రాజీలేని పోరు

భారత్ అధ్యక్షతన రూపొందిన ఈ డిక్లరేషన్‌లో సరిహద్దు ఉగ్రవాదం, టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్‌లు, ఉగ్రవాదులకు దొరుకుతున్న సురక్షిత స్థావరాలపై (Safe Havens) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, టెర్రరిజంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేయాలని 11 దేశాలు ముక్తకంఠంతో తీర్మానించాయి. ఐక్యరాజ్యసమితి సమగ్ర ఉగ్రవాద నిరోధక ఒప్పందాన్ని (CCIT) త్వరితగతిన ఆమోదించాలని డిమాండ్ చేశాయి.

ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్యంపై నిలదీత

కొన్ని దేశాలు ఏకపక్షంగా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధమని బ్రిక్స్ కూటమి తప్పుబట్టింది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమలవుతున్న ఏకపక్ష ఆర్థిక ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని సభ్య దేశాలు డిమాండ్ చేశాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల ద్వారా సాగే అక్రమ నగదు చలామణీని అడ్డుకోవడానికి సరిహద్దుల మధ్య పటిష్ట సహకారం అవసరమని డిక్లరేషన్ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement