త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | 2000లో బషీర్‌బాగ్ కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ ఉన్నది టీడీపీలోనే

కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ అవినీతి బాగోతాలను బయటపెడతామని హెచ్చరించారు.

J

Telangana | Published On Sep 23, 2026, 6.27 pm IST

Chamala Kiran Kumar Reddy | 2000లో బషీర్‌బాగ్ కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ ఉన్నది టీడీపీలోనే

సంక్షిప్త సారాంశం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం కాకుండా, మంత్రి పదవి ఇవ్వలేదనే టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఎంపీ చామల కిరణ్ ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇది ప్రారంభమైందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో డిస్కంలను 81 వేల కోట్ల అప్పులపాలు చేశారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లలో భారీగా అవినీతి, కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు.

Advertisement
  • కేటీఆర్ మాటల వెనుక అసలు నిజాలు ఇవే
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పవర్ స్టేషన్ల వద్దకు బీఆర్ఎస్ నేతలను బృందాలుగా పంపుతూ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పోరాటాలు, విద్యుత్ రంగానికి సంబంధించి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల్లో పచ్చి అబద్ధాలు ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు.

కేసీఆర్ పార్టీ వీడటానికి అసలు కారణం అదే

2000 సంవత్సరంలో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత 2001లో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇవ్వలేదనే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారు తప్ప, ఏనాడూ తెలంగాణ ఉద్యమం కోసం గానీ, విద్యుత్ ఛార్జీల కోసం గానీ ఆయన బయటకు రాలేదని స్పష్టం చేశారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్

కాంగ్రెస్ పార్టీ వస్తే చీకటి రాజ్యం వస్తుందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, అసలు ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని కిరణ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. 2004లో అధికారంలోకి రాగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో తొలి సంతకం పెట్టిందే ఉచిత విద్యుత్ ఫైల్‌పై అని గుర్తుచేశారు.

డిస్కంలను ముంచిన బీఆర్ఎస్ తుగ్లక్ పాలన

2014లో మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పూర్తిగా అప్పులపాలు చేశారని ఆయన విమర్శించారు. కేవలం తమ పదేళ్ల తుగ్లక్ పాలనలో డిస్కంలను ఏకంగా 81 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నప్పటికీ కమిషన్ల కోసమే ఆ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు.

భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి వేల కోట్ల నష్టం కలిగించారని, యాదాద్రి ప్రాజెక్టును ఓపెన్ బిడ్డింగ్ పెట్టకుండా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి భారీగా కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, త్వరలోనే బీఆర్ఎస్ నేతల అన్ని బాగోతాలు, ఫైళ్లను బయటపెడతామని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement