త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే.. ఆ ఫోటో మర్చిపోయారా?

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాటి ఫోటో చూపిస్తూ కేసీఆర్ కుటుంబంపై ఏమన్నారంటే?

J

Telangana | Published On Nov 18, 2026, 12.51 pm IST

Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే.. ఆ ఫోటో మర్చిపోయారా?

సంక్షిప్త సారాంశం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురికి మాత్రమే ఉన్నత పదవులు దక్కాయని ఎంపీ చామల విమర్శించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, నెలకు రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. నవంబర్ 19న సిద్దిపేట సభలో కోటికి పైగా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అవసరమైతే కేటీఆర్ కుటుంబం కూడా ఈ పథకాన్ని తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Advertisement
  • కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ పాత్రను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 32 మందికి పైగా ఎంపీలు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.

సోనియా గాంధీతో నాటి ఫోటో చూపిస్తూ విమర్శలు

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ అంశం లేదంటూ కేటీఆర్ మాట్లాడటం సరికాదని ఎంపీ చామల అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు సోనియా గాంధీని కలిసిన నాటి ఫోటోను ఆయన ప్రదర్శించారు.

"ఆ రోజు హస్తంలో ఉన్న ఐదు వేళ్ల మాదిరిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు కలిసి సోనియా గాంధీ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత మీ ఇంట్లోని ఆ ఐదుగురికే ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పదవులు దక్కాయి" అని చామల విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని కేసీఆర్ విస్మరించి తానే ఆ పదవిని చేపట్టారని, అమెరికా ఉద్యోగం వదిలి వచ్చిన కేటీఆర్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం.. సంక్షేమ పథకాల ప్రస్తావన

మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎంపీ చామల ఆరోపించారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రం నెలకు రూ. 8 వేల కోట్ల మేర కేవలం వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

పేదలకు సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 'మహిళా శక్తి' పథకాల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంటే, కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం తగదన్నారు.

రేపు సిద్దిపేట సభలో రూ. 5 లక్షల బీమా.. చేర్యాల ఘటనపై ఫైర్

రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని అందిస్తున్నామని, బుధవారం (నవంబర్ 19) సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఎంపీ చామల వెల్లడించారు. ప్రజల కోసం తెస్తున్న ఈ పథకాన్ని బీఆర్ఎస్ నేతలు స్వాగతించాలని, అవసరమైతే కేటీఆర్ కుటుంబంలోని ఐదుగురు కూడా సిద్దిపేట సభకు వచ్చి ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

సోమవారం చేర్యాలలో నిర్వహించిన పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలనే రసాభాస సృష్టించే ప్రయత్నం చేశారని ఎంపీ చామల విమర్శించారు. రోజువారీ ప్రెస్‌మీట్లు, ట్వీట్లతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, ఎన్నికల ప్రయోజనాల కోసమే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్న బీఆర్ఎస్‌కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement