త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswara Rao | వరి వేయకుండా ష‌ర‌తులు పెట్టింది మీరు కాదా – బీఆర్ఎస్ కు మంత్రి తుమ్మల కౌంటర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేయడం తమ వల్ల కాదని, రైతులకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామంటూ బీఆర్ఎస్ నిందలు వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా సీఏం రేవంత్ రెడ్డి రైతులకు రణమాఫీని అమలు చేసి చూపించారని తుమ్మల పేర్కొన్నారు. రైతు బంధును ఐదు వేల నుంచి ఆరు వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని మినిస్టర్ వెల్లడించారు.

a

Telangana | Published On Dec 22, 2025, 6.13 pm IST

Thummala Nageswara Rao | వరి వేయకుండా ష‌ర‌తులు పెట్టింది మీరు కాదా  – బీఆర్ఎస్ కు మంత్రి తుమ్మల కౌంటర్
Advertisement

Thummala Nageswara Rao | పదేళ్ల పాలనలో లక్ష రుణమాఫీ చేయడానికే బీఆర్ఎస్ నానా అవస్థలు పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే సాహసోపేతమైన నిర్ణయాలతో కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుందని పేర్కొన్నారు. యూరియా సరఫరా కోసం మా ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్ కేవలం రైతుల సమయాన్ని ఆదా చేయడానికేనని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. “పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు” రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండే వారికి మేము చేసే మంచి పని కూడా మోసంలాగే కనిపిస్తుందని బీఆర్ఎస్ నాయకులను తుమ్మల ఎద్దేవా చేశారు. తెలంగాణను దోచుకుందెవరు? దాచుకుందెవరు అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మినిస్టర్ పేర్కొన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు ? ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అన్నది తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే వాళ్ళ స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో వారికే తెలియాలని మినిస్టర్ అన్నారు. మొదటి రెండు పంటకాలలలో యూరియా సరఫరాలో ఆటంకాలు లేకుండా తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తుమ్మల వెల్లడించారు. మూడవ పంటకాలంలో కేంద్రం నుండి కేటాయింపులు అనుకొన్న సమయానికి రాకపోవడంలో సరఫరాలో ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమేనని అన్నారు. ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండని మినిస్టర్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 50 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీని అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోపే పూర్తి చేశామని చెప్పారు. రుణమాఫీ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 20,600 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

విమర్శలు చేశారు...

అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేశారని తుమ్మల అన్నారు. రుణమాఫీ చేయడం తమ వల్ల కాదని, రైతులకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామంటూ నిందలు వేశారని తుమ్మల వెల్లడించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఆర్థికంగా పరిస్థితులు సరిగ్గా లేకపోయినా అన్నం పెట్టిన రైతులకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని, 25 లక్షలకు పైగా అర్హత కలిగిన రైతులకు 2 లక్షలలోపు రుణమాఫీని అమలు చేసి చూపించారని మినిస్టర్ తుమ్మల నాగేశ్వరారవు చెప్పారు. తమ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా “కుక్క తోక వంకర” అన్న విధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు నోటికి పని చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. తాము కూడా అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు మంచి పనులు చేస్తూ వారికి దిమ్మతిరిగి పోయేలా సమాధానం ఇస్తూనే ఉంటామని అన్నారు.

వరి వద్దని అన్నారు...

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించారు. వరి వేయకుండా చేసింది మీరే కదా? రైతులకు ఆ పంట వేయకూడదు, ఈ పంట వేయకూడదు అని షరతులు పెట్టింది మీరే కదా అంటూ బీఆర్ఎస్ పై తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వడ్లు కొనడం గురించి, బోనస్ ల గురించి మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేవలం బోనస్ కోసమే దాదాపు 1800 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తుచేశారు.రైతుబంధుగా మీరు ఎకరానికి 5000 ఇస్తే, మేము అధికారంలోకి వచ్చాక దానిని 6000 పెంచి, 67 లక్షల మంది రైతులకు అందించామని చెప్పారు. . మీరు రైతుబంధు పేరుతో రైతు సబ్సిడీ పథకాలు బంద్ చేస్తే, మేము రైతుభరోసా అందించడంతో పాటు రైతు సబ్సిడి పథకాలను తిరిగి ప్రారంభించామని మంత్రి అన్నారు.తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వామని మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

పక్క దారి పట్టకుండా...

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా అందుబాటులో ఉన్నప్పటికి, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను భయపెట్టే విధంగా మాట్లాడారని, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని చెప్పారు. అంతేకాకుండా కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మోసాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో ఉంటూ వారి సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం యాప్ ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే కిసాన్ కా పాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించామని, ఈ యాప్ ను కూడా విజయవంతంగా అమలుచేసి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచల్ చేస్తామని చెప్పారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement