త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | మ‌హిళా సంఘాల‌కు గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేని రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు: మంత్రి సీతక్క

Minister Seethakka | మహిళా స్వయం సహాయక సంఘాల (Self Help Groups) ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రకటించారు.

G

Telangana | Published On May 7, 2026, 3.59 pm IST

Minister Seethakka | మ‌హిళా సంఘాల‌కు గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేని రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు: మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka | హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (Self Help Groups) ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27 ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.26,621.47 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు.

గత రెండేండ్ల‌లో రూ.40 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రూ.60 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదంతా మహిళా సంఘాలు బ్యాంకర్ల సహకారంతోనే సాధ్యమైంద‌ని వెల్లడించారు.

మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి

`మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో ప్రభుత్వం పని చేస్తున్న‌ది. మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా కృషి చేస్తున్నాం. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. పంట కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించాం.

రీపేమెంట్‌లో అద్భుతమైన క్రమశిక్షణ

గతంలో మహిళలకు చిన్న మొత్తాల రుణాలు కూడా లభించని పరిస్థితి ఉండేది. ఇప్పుడు లక్షల రూపాయల రుణాలు బ్యాంకులు నమ్మకంతో ఇస్తున్నాయి. మహిళా సంఘాలు రుణాల రీపేమెంట్‌లో అద్భుతమైన క్రమశిక్షణ చూపిస్తున్నాయి. SHGల NPA కేవలం 1.40 శాతంగా ఉండటం మహిళల ఆర్థిక బాధ్యతకు నిదర్శనం` అన్నారు.

నిర్మల్ జిల్లా జీరో NPA సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు 100 శాతం రీపేమెంట్ సాధించాలని పిలుపునిచ్చారు. వడ్డీ వ్యాపారుల దోపిడీని చూడలేక తాను నక్సలైట్లలో చేరానని గుర్తు చేశారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలిపిస్తూ వడ్డీ వ్యాపారుల దోపిడీని అడ్డుకుంటున్నామని తెలిపారు.

నమ్మకాన్ని నిలబెట్టే మహిళా శక్తి.. 

బ్యాంకులకు మేమే గ్యారెంటీ ఇస్తున్నాం. మహిళా సంఘాలకు రుణాలు ఇస్తే మీ డబ్బులకు పూర్తి భద్రత ఉంటుంది. వ్యక్తులకు ఇచ్చిన రుణాలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది. కానీ మహిళా శక్తి నమ్మకాన్ని నిలబెడుతుంద‌న్నారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం రూ.2500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఉద్యోగార్ధుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఎస్‌హెచ్‌జీ క్యాంటీన్లు, బస్సులు, పాడి కేంద్రాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, మహిళా మార్టులు, గోదాములు వంటి రంగాల్లో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ ఉమెన్ మీన్ స్ట్రాంగ్ ఎకాన‌మీ అని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయని, కుటుంబాలు బలపడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement