Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తే కమీషన్లు రావు.. కాళేశ్వరం నిర్మిస్తే కమీషన్లు వస్తాయనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ భేషజాలకు వెళ్లకుండా అర్హులందరికీ ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, ఆగిపోయిన ఇండ్లకు నిధులిచ్చి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మా నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్లు కేటాయిస్తే బాగుంటుందని కొందరు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని యోగ్యమైన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నం. తమ ప్రభుత్వంలో చెంచులందరికీ తొలి విడతలోనే ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లే దర్శనమిస్తున్నాయని చెప్పారు. పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇండ్ల నిర్మాణంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.