త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suchitra-Medchal Flyover | నిలిచిన‌ సుచిత్ర-మేడ్చ‌ల్ ఫ్లై ఓవర్ పనులు.. పిల్లర్లకు పిండ ప్రధానం

Suchitra-Kompally Flyover | ఏండ్లు గ‌డుస్తున్నా సుచిత్ర-మేడ్చ‌ల్‌ ఫ్లై ఓవ‌ర్ (Suchitra-Medchal Flyover) నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిర్మాణ ప‌నులు స‌గంలోనే నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్‌ల‌తో నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

G

Telangana | Published On Oct 11, 2026, 11.54 am IST

Suchitra-Medchal Flyover | నిలిచిన‌ సుచిత్ర-మేడ్చ‌ల్ ఫ్లై ఓవర్ పనులు.. పిల్లర్లకు పిండ ప్రధానం
Advertisement

Suchitra-Kompally Flyover | త్రినేత్ర న్యూస్‌: ఏండ్లు గ‌డుస్తున్నా సుచిత్ర-మేడ్చ‌ల్‌ ఫ్లై ఓవ‌ర్ (Suchitra-Medchal Flyover) నిర్మాణం పూర్తి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిర్మాణ ప‌నులు స‌గంలోనే నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్‌ల‌తో నిత్యం న‌ర‌కం అనుభ‌విస్తున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ అల‌స‌త్వానికి నిర‌స‌న‌గా మేడ్చ‌ల్ మెట్రో సాధ‌న స‌మితి (Medchal Metro Sadhana Samithi) ఆధ్వ‌ర్యంలో సుచిత్ర కూడ‌లి వ‌ద్ద ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌కు పిండ ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. సుచిత్ర-మేడ్చల్ మార్గంలో ఫ్లైఓవర్‌ పనులు పూర్తికాకపోవడంతో వాహ‌న‌దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం వేలాది మంది ట్రాఫిక్‌ జామ్‌లలో చిక్కుకుంటున్నారని, దుమ్ము, ధూళి కారణంగా స్థానికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సుచిత్ర–మేడ్చల్ ఫ్లైఓవర్‌ పనులను తక్షణమే పునఃప్రారంభించాల‌ని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

జాతీయ ర‌హ‌దారి 44పై ట్రాఫిక్ చిక్కుల‌ను త‌ప్పించేందుకు సుచిత్ర‌-కొంప‌ల్లి-మేడ్చ‌ల్ ఎలివేటెడ్ కారిడార్ ప‌నులను జాతీయ రహదారుల సంస్థ (NHAI) చేప‌ట్టింది. 2022, ఆగ‌స్టు 1న ప‌నులు ప్రారంభించింది. 2024, జూలై 30 నాటికి ప‌నులు పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. ఇందులో భాగంగా బోయిన్‌ప‌ల్లి (డెయిరీ ఫామ్‌) నుంచి కొంప‌ల్లి వ‌ర‌కు పిల్ల‌ర్లు నిర్మించింది. అయితే కాంట్రాక్ట‌ర్‌ ఆర్థిక ఇబ్బందుల‌తో ఫ్లైఓవ‌ర్ ప‌నులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్ట‌ర్‌ను తొల‌గించిన NHAI కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. కొత్త కాంట్రాక్టర్ ఖరారైన తర్వాత మిగిలిన పనులు పూర్తి కావడానికి మరో 1.5 నుంచి 2 ఏండ్ల‌ సమయం పట్టే అవకాశం ఉంది.

గుండ్లపోచంపల్లి నుంచి బోయిన్‌పల్లి వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి వెడల్పు, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం దాదాపు రూ.492 కోట్ల నుంచి రూ.521 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సుచిత్ర, డెయిరీ ఫామ్ జంక్షన్, సినీ ప్లానెట్, జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి, ధూలపల్లి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లతో పాటు అండర్‌పాస్‌లను కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సికింద్రాబాద్, బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ప్రయాణం సులువవుతుంది. అయితే నిర్మాణ పనులు సగం దశలోనే నిలిచిపోవడంతో సర్వీస్ రోడ్లు దెబ్బతిని, తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము కాలుష్యంతో రోజూ లక్షలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement