త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy Krishna Waters | అవి పచ్చి అబద్ధాలు.. ఇవిగో అసలు వాస్తవాలు

కృష్ణా జలాల వాటా, పల్నాడు గ్రిడ్, సీమ లిఫ్ట్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు. పూర్తి వివరాలివే.

J

Telangana | Published On Nov 24, 2026, 7.48 pm IST

Harish Rao vs Revanth Reddy Krishna Waters | అవి పచ్చి అబద్ధాలు.. ఇవిగో అసలు వాస్తవాలు

సంక్షిప్త సారాంశం

కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. 2022 పల్నాడు వాటర్ గ్రిడ్ జీవోలో నాగార్జున సాగర్ ప్రస్తావనే లేదని, 2026 ఆగస్టు 4న ఏపీ జారీ చేసిన జీవో ద్వారానే సాగర్ నుంచి 1.865 టీఎంసీల నీటి తరలింపు మొదలైందని హరీశ్ రావు పేర్కొన్నారు. 512:299 టీఎంసీల తాత్కాలిక నీటి పంపకాలకు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే పునాది వేసిందని, కేసీఆర్ పోరాటం వల్లే కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటైందని ఆయన వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కేసు వేయడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Advertisement
  • కృష్ణా జలాలపై రేవంత్ వి అబద్ధాల వరద
  • బీఆర్ ఎస్ పై బురద జల్లే యత్నం
  • నీళ్లు ఎత్తమంటే..దుమ్మెత్తి పోస్తున్నడు
  • 2022 పల్నాడు జీవోలో సాగర్ నీటి ప్రస్తావనే లేదు
  • సాగర్ నీటిని తీసుకునేందుకు ఈ ఏడాది ఆగస్టులో జీవో
  • 512:299 విభజనను చేసిందే కాంగ్రెస్
  • సీమ లిఫ్ట్ పై కేసు వేసి ఆపిందే కేసీఆర్
  • పోతిరెడ్డి పాడును సమర్థిస్తూ నాడు వ్యాసాలు రాసింది మీ కాంగ్రెస్సే కదా
  • 30 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో నీళ్లు పారింది 30 వేల ఎకరాల్లోనే
  • కేసీఆర్ వచ్చాక.. 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం
  • బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు

Harish Rao vs Revanth Reddy Krishna Waters | త్రినేత్ర న్యూస్ : కృష్ణా జలాలపై హక్కులను ఆంధ్రకు తాకట్టు పెట్టారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. పల్నాడు ప్రాజెక్టు గ్రిడ్, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డి పాడు వంటి ప్రాజెక్టులకు బీఆర్ ఎస్(BRS) ఆమోదం ఉందంటూ .. అసత్యాల వరద కురిపిస్తున్నారని విమర్శించారు.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

సీఎం చేసిన ఆరోపణలను తిప్పి కొడుతూ.. హరీశ్ రావు (Harish Rao) మంగళవారం (నవంబరు 24) తెలంగాణ భవన్ లో 2 గంటల పాటు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం చేసిన పలు ఆరోపణలకు అంశాల వారీగా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

రేవంత్ రెడ్డి : పల్నాడు గ్రీడ్ జీవో వచ్చింది బీఆర్ ఎస్ హయాంలోనే

ఏపీ ప్రభుత్వం బీఆర్ ఎస్ హయాంలోనే అంటే 2022 ఫిబ్రవరి 16న పల్నాడు వాటర్ గ్రిడ్ (Palnadu Water Grid GO) ప్రాజెక్టు పై జీవో నంబర్ 56ను జారీ చేసింది. ఈ జీవో జారీ అయినప్పుడు ఇక్కడ కేసీయార్, అక్కడ జగన్ లే సీఎంగా ఉన్నారు. దీనికి సంబంధించి కేసీయార్ ఏనాడూ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ (కేఆర్ ఎంబీ) కు ఫిర్యాదు చేయలేదు. బీఆర్ ఎస్ ఇచ్చిన ఆమోదంతోనే ఇప్పుడు పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు నడుస్తున్నాయి. తమకు ఉన్న నీటి హక్కుల్లో భాగంగానే పల్నాడు గ్రిడ్ వాటర్ ప్రాజెక్టుకు నీటి ని తీసుకెళ్తున్నామని ఏపీ వాదిస్తున్నది.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

హరీశ్ రావు : ఆ జీవోలో సాగర్ నుంచి నీళ్ల ప్రస్తావనే లేదు..

నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకుంటామని 2022 ఫిబ్రవరి 16న విడుదలైన జీవో \56లో ..ఎక్కడా ప్రస్తావించలేదు. అందులో అసలు నీళ్ల ప్రస్తావనే లేనే లేదు. అది కేవలం ఫైనాన్షియల్ శాంక్షన్ కు సంబంధించిన జీవో మాత్రమే. పల్నాడు ప్రాంతంలో స్థానిక చెరువుల నుంచి ఆయా గ్రామాలకు నీళ్లు తీసుకుపోయేలా చేసుకున్న ఏర్పాటు అది. నాగార్జున సాగర్ నుంచీ నీళ్లు తీసుకుంటామని ఈ జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. అయితే.. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో 492 అడుగుల మట్టం నుంచి నీళ్లు తీసుకునేలా 2026 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

ఈ జీవోలో ఉన్న ముఖ్యాంశాలు రెండు. 1) 2022లో ఏపీలో ఇచ్చిన జీవో 56 ప్రకారం.. పల్నాడు ప్రాంత గ్రామాలకు స్థానిక చెరువుల నుంచి నీళ్లు తీసుకునే స్కీం ను రద్దు చేస్తున్నాం
2) ఆయా గ్రామాలకు అవసరమైన 1.865 టీఎంసీని నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటాం. అంటే.. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోతామనే జీవో ఈ ఏడాది ఆగస్టులోనే జారీ అయ్యింది. దీనిపై తెలంగాణ ఇంజనీర్లు కేఆర్ ఎంబీలో కనీసం ఫిర్యాదు చేయలేదు. చర్చకూ పెట్టలేదు. ఈ విషయాన్ని కేఆర్ ఎంబీలో పాల్గొన్న ఆంధ్ర చీఫ్ ఇంజనీరే స్వయంగా వెల్లడించారు.

రేవంత్ రెడ్డి : ప్రకాశం జిల్లాకు సాగర్ నీళ్లు ..కేసీఆర్ పాపమే

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రకాశం జిల్లాకు రోజూ 0.22 టీఎంసీల నీటిని కేటాయించుకుంటూ ఏపీ ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 24 జీవో 482 జారీ చేసింది. అప్పుడు కూడా కేసీయారే సీఎం. అంటే ఆయన ఆమోదం ఉన్నట్టే కదా.

హరీశ్ రావు : ఆ నీళ్లు సాగర్ నుంచి కాదు.. ఒంగోల్ బ్రాంచ్ కెనాల్ నుంచి

రేవంత్ రెడ్డి చాలా కన్వీనియంట్ గా అబద్దాలు చెబుతున్నాడు. ఆయన ఇంగ్లిష్ లో చదువుతూ ఎన్ ఎస్ పీ (నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ) అని అన్నాడు. కానీ అది నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకునే జీవో కాదు. నాగార్జున సాగర్ నుంచి వెళ్లే ఒంగోల్ బ్రాంచ్ కెనాల్ లో కోటారెడ్డి పాలెం వద్ద పొదిలి ట్యాంక్ కు 29 క్యూసెక్కులు తీసుకుంటాం...అని ఆ జీవో సారాంశం. ఆ జీవోలో పేర్కొన్నది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గానీ, నాగార్జునసాగర్ రిజర్వాయర్ గానీ కాదు. ఆల్రెడీ ఏపీ ఉన్న కోటాలో వాళ్ల ప్రాంతం లో ఉన్న కెనాల్ నుంచి నీళ్లు తీసుకు పోయే జీవో అది.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

రేవంత్ రెడ్డి : 512:299 తో కేసీఆర్ మరణశాసనం రాశారు

2015 లో ఆనాటి కేంద్ర జల శక్తి మంత్రి ఉమా భారతి గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ అంగీకరించి ఒప్పందాలు చేసుకున్నారు. కృష్ణా జలాలపై 2020 లో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు (Krishna River Management Board) సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నిష్పత్తిలో నీటివాటా కొనసాగించాలని మరోమారు అంగీకరిస్తూ తెలంగాణకు మరణ శాసనం రాశారు.

హరీశ్ రావు : 2013లో నే కాంగ్రెస్ 512:299గా విభజించింది

512:299 పాపం కాంగ్రెస్ దే. ఈ నిష్పత్తికి మూల కర్త, కర్మ, క్రియనే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దీన్ని పొందుపరిచిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 811 టీఎంసీల కృష్ణా జలాలకు గాను తెలంగాణకు 298.96 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు కేటాయిస్తూ నాటి ప్రభుత్వమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్.. దీనికి సాక్ష్యమే నాటి చీఫ్ సెక్రెటరీ పీకే మొహంతి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాసిన అధికారిక లేఖ. అయితే ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ ఆ లేఖకు ఆధారం మాత్రం 2013 అక్టోబర్ 18 న అధికారికంగా లేఖ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానిదే. నాడు ఆ ప్రభుత్వంలో దామోదర రాజ నర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

రేవంత్ రెడ్డి : అవకాశం ఉన్నా వదిలేశారు

నీటి వాటాలో తెలంగాణ హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా అడ్డుకోవడానికి అవకాశం ఉండింది. కానీ కావాలనే బీఆర్ ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆ పని చేయకుండా వదిలేసి మన నీటి హక్కులను ఆంధ్రకు తాకట్టు పెట్టారు ప్రతి ఏడాది చర్చించి ముందుకు వెళ్లే అవకాశం ఉండేది.. కానీ ఈ పంపకాలే శాశ్వతం అని 2020, జనవరి 29న ఒప్పుకున్నారు..

హరీశ్ రావు : కొత్త ట్రిబ్యునల్ సాధించాం.. 50:50కి 30 లేఖలు రాసినం

తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే నాటి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. కృష్ణా జలాలను పునర్ పంపిణీ చేసి తెలంగాణకు హక్కులు కల్పించేలా సెక్షన్ 3 కింద కొత్త వాటర్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు కు నాటి కేంద్ర ఇరిగేషన్ మంత్రి ఉమాభారతిని ఒప్పించా రు. తెలంగాణకు కృష్ణ జలాల్లో కేటాయించింది 299 టీఎంసీలు సరిపోవని స్పష్టంగా చెప్పారు. ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు కృష్ణా జలాల్లో 50:50 లెక్కన నీటిని తీసుకోవాలని కేంద్రానికి, జలశక్తి కమిషన్ కు, కేఆర్ ఎంబీకి దఫదఫాలుగా 30 లేఖలు రాశారు. కొత్త రాష్ట్రంలో కొట్టుకోబోయే కొత్త ప్రాజెక్టుల కోసం నీటి అవసరాలు పెరుగుతాయి కాబట్టి అదనంగా 581 టీఎంసీలు కావాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ భేటీల్లో ఈ విషయాలన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. అయితే.. 512:299 అనేది ఒక తాత్కాలిక ఒప్పందం మాత్రమే. అది కోర్టుల్లో, ట్రిబ్యునల్ లో చెల్లకుండా అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏడేండ్లు వేచి చూసినా ట్రిబ్యునల్ ఏర్పాటు కాకపోయే సరికి కేసీఆర్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. తీరా కేంద్రం అభ్యర్థన మేరకు ఆ కేసును విత్ డ్రా చేసుకున్న తర్వాత ..కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. వాదనలు పూర్తై మన హక్కులపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటే మనకు మొత్తంగా 600కు పైగా టీఎంసీలు హక్కుగా వచ్చే అవకాశం ఉన్నది.

Krishna Water Dispute Harish Rao Counters CM Revanth Reddy's Allegations Point-by-Point

రేవంత్ రెడ్డి : సీమ లిఫ్ట్ కు అంగీకరించిండు.. మనల్ని ముంచిండు

కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2020లో రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతులు వచ్చాయి. దీంతో సీమ కష్టాలన్నీ తీరిపోయేలా నీళ్లు అటు తరలిపోతున్నాయి. ఇలా మనల్ని కేసీఆర్ ముంచిండు.

హరీశ్ రావు: సీమ లిఫ్ట్ పై కేసు వేసి నిలిపివేయించిందే కేసీఆర్

మొన్నా ఆ మధ్యన ఓ సారి ఎక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu Naidu)తో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపివేయించిన అని అన్నాడు రేవంత్. మరుసటి రోజే ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఖండించింది కూడా. సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం వల్లనే సీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని చంద్రబాబు ప్రభుత్వం పత్రికల్లో వివరణ ఇచ్చింది. 2020 మే 5 సీమ లిఫ్ట్ పై జీవో రాకముందే అభ్యంతర పెట్టినం. జీవో వచ్చిన తర్వాత లేఖ రాసినం. కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినం. అయినా ఆపకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేంద్ర జలశక్తి చైర్మన్ కు లేఖ రాశారు. ఆ ప్రాజెక్టును ఆపకపోతే శ్రీశైలం రిజర్వాయర్ మొత్తాన్ని తెలంగాణకు అప్పగించాల్సిందిగా కోరారు. ఆ ప్రాజెక్టు పనులు ఇంకా నడుస్తూ ఉండగా రెండో అపెక్స్ కౌన్సిల్ లో..ఆంధ్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు. అవసరమైతే అలంపూర వద్ద బ్యారేజీ కట్టి రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలిస్తామని చెప్పారు. తర్వాత.. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడంతో ప్రస్తుతం సీమ లిప్ట్ పనులు ఆగిపోయాయి.

రేవంత్ రెడ్డి : పోతిరెడ్డిపాడుకు అనుమతులు వీళ్ల వల్లే

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. అప్పుడే పోతిరెడ్డిపాడు(Pothireddypadu) ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి అనుమతులొచ్చాయి. 2005 మార్చి 29 న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్‌లో పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యాన్ని పెంచి తరలించుకుపోతామని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత 2005 సెప్టెంబరు 13న జీవో వచ్చింది. మంత్రులుగా బడ్జెట్‌ను ఆమోదించారు. కానీ అసెంబ్లీలో నిలదీయలేదు..

హరీశ్ రావు : ఆ రోజు 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసినం

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ గురించి సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బడ్జెట్ ను కేబినెట్ అప్రూవ్ చేస్తది. డిమాండ్స్ గ్రాంట్స్ ను అసెంబ్లీ ఆమోదిస్తది. మేం ఆ రోజు పోతిరెడ్డి పాడుపై 26 మంది ఎమ్మెల్యేలం అసెంబ్లీలో పోరాటం చేసినం. 42రోజులు అసెంబ్లీని స్తంభింపజేసినం.

కానీ ఆరోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు శ్రీదర్ బాబు, ఉత్తం, కోమటి, దామోదర, చిన్నారెడ్డి నోళ్లు మూసుకొని ఉన్నరు.పోతిరెడ్డి పాడుపై అపోహలొద్దంటూ.. నాడు పత్రికల్లో చిన్నారెడ్డి వ్యాసాలు కూడా రాసిండు.

Advertisement
Advertisement