త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad School Picnic Tragedy | స్కూల్ పిక్నిక్‌లో విషాదం : భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి

నార్సింగీ హ్యాపీ స్కాలర్స్ స్కూల్ పిక్నిక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ లోటస్ పాండ్ పార్క్‌లో భారీ ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాలివే.

J

Hyderabad | Published On Nov 24, 2026, 7.13 pm IST

Hyderabad School Picnic Tragedy | స్కూల్ పిక్నిక్‌లో విషాదం : భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి

సంక్షిప్త సారాంశం

నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు పిక్నిక్‌కు వెళ్లగా ఈ విషాద ఘటన జరిగింది. పార్క్‌లోని భారీ ఇనుప ఊయల వేగంగా వెనక్కి వచ్చి బలంగా తగలడంతో 10 ఏళ్ల బాలుడు అభిరామ్ మృతి చెందగా, యశ్వంత్ అనే మరో విద్యార్థికి గాయాలయ్యాయి. పిల్లలు ఊయల ఊగుతున్న సమయంలో కనీసం ఒక్క టీచర్ లేదా స్కూల్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యపు మృతి కింద కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Hyderabad School Picnic Tragedy | త్రినేత్ర న్యూస్ : నగర శివారులోని మొయినాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నార్సింగికి చెందిన 'హ్యాపీ స్కాలర్స్ స్కూల్' (Happy Scholars School) విద్యార్థులు పిక్నిక్ కోసం మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు (Moinabad Lotus Pond Park) వెళ్లగా, అక్కడ జరిగిన ప్రమాదంలో అభిరామ్ (10) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో యశ్వంత్ అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే?

ప్రత్యక్ష సాక్షులైన తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్క్‌లో ఉన్న ఒక భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చుని ఉన్నారు. వెనుక వైపు నిలబడిన మరో నలుగురు విద్యార్థులు ఆ ఊయలను అత్యంత వేగంగా ఊపుతున్నారు.

ఆ వయసు పిల్లలకు భారీ ఊయల వేగాన్ని, దాని తీవ్రతను అంచనా వేసే అవగాహన లేకపోవడంతో ఊహించని ప్రమాదం జరిగింది. ముందుకు వెళ్లిన ఊయల అంతే వేగంతో వెనక్కి దూసుకురాగా, అదుపుతప్పిన అభిరామ్ నుదురు, ఛాతీ భాగంలో బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో బాలుడు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. పక్కనే ఉన్న యశ్వంత్‌కు కూడా గాయాలయ్యాయి.

పర్యవేక్షణ ఎక్కడ? తల్లిదండ్రుల ఆగ్రహం

పదుల సంఖ్యలో చిన్న పిల్లలు అంత భారీ ఇనుప ఊయల వద్ద ఆడుకుంటున్నా, అక్కడ కనీసం ఒక్క టీచర్ (Teacher) లేదా స్కూల్ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్కూల్ యాజమాన్యం, లోటస్ పాండ్ పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ బలయ్యాడని మృతుడి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

"స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి పిల్లలను పిక్నిక్‌కు పంపిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?" అంటూ ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన బయటకు పొక్కకుండా కొన్ని వ్యవస్థలను మేనేజ్ (Manage) చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు

సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సరైన భద్రతా చర్యలు లేకపోవడం, నిర్లక్ష్యంతో మృతికి కారణమవ్వడం, పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యులైన స్కూల్ యాజమాన్యం, పార్క్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement