Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు
Harish Rao | నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు.
- ఆధారాలతో రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీశ్‌రావు
- పాలమూరుకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే
- 30 ఏళ్లలో 30వేల ఎకరాలకే నీళ్లు
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 10లక్షల ఎకరాలకు నీరిచ్చాం
- పల్నాడు, రాయలసీమ లిఫ్ట్‌పై పత్రాలు బయటపెట్టి విమర్శలు
Harish Rao | నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు విఫలయత్నం చేస్తున్నారని, నీళ్ల లెక్కలు అడిగితే అబద్ధాల వరద పారిస్తున్నారని విమర్శించారు. నోరు పెంచినంత మాత్రాన, నిందలు వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ భవన్‌లో ఆధారాలు, పత్రాలతో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటాలు, పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జిరాక్స్ కాగితాలు ఇచ్చి నాటకాలు ఆడారు
కేసీఆర్‌ను ఉరి తీయాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని, అసలు ఎందుకు ఉరి తీయాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయడం తప్పా? ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడం తప్పా? ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయడం తప్పా? గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడటం తప్పా? అని నిలదీశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తప్పన్నట్లు రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి సమైక్యవాదుల పంచన ఉన్నారని, తెలంగాణ బిడ్డలపై తుపాకులు గురిపెట్టడమే సరైనదన్నట్లు వ్యవహరించారని ఆరోపించారు. రాజీనామాలు చేయకుండా జిరాక్స్ కాగితాలు ఇచ్చి నాటకాలు ఆడారని, రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలానికే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించి నోట్ల కట్టలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని విమర్శించారు. ఏపీ నాయకుల డబ్బు మూటలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసినవారు ఇప్పుడు నీళ్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో పాలమూరు ప్రజలు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు బతకడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆరోపించారు. కాలిపోయే మోటార్లు, ఎండిపోయే బావుల పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేసేందుకే గులాబీ జెండా పుట్టిందన్నారు. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ నీళ్ల హక్కుల గురించి ఎవరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడింది బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ పోరాటంతోనే నీళ్లు
నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్వహణకు ప్రభుత్వ నిధులు వినియోగిస్తుండగా, ఎడమ కాల్వ నిర్వహణకు మాత్రం రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అప్పట్లో కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ వివక్షపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హాలియా నుంచి పాదయాత్ర చేస్తామని కేసీఆర్ బయలుదేరిన తర్వాతే కుడి కాల్వ మాదిరిగానే ఎడమ కాల్వ నిర్వహణను ప్రభుత్వ నిధులతో చేపట్టేలా జీవో ఇచ్చారని తెలిపారు. జూరాల ఆయకట్టుకు కర్ణాటక నుంచి నీళ్లు రాకముందు పది వేల ఎకరాలకు కూడా నీరు అందలేదని, కేసీఆర్ నిలదీసిన తర్వాతే జూరాల నింపి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ఎకరాకూ నీరు అందని పరిస్థితి ఉండేదని, కేసీఆర్ పోరాటంతోనే ఆ జిల్లాకు ఆయకట్టు వచ్చిందన్నారు. ఎస్సారెస్పీ కింద ఐదు లక్షల ఎకరాలకు కూడా నీరు అందని పరిస్థితి నుంచి తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు అందించామని వివరించారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో తుమ్మలు మొలిచే పరిస్థితి ఉండేదని, దాన్ని మార్చామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు సైతం గులాబీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాతే సాగునీరు వచ్చిందన్నారు. ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం వరకు గోదావరిపై గత పాలకులు ఒక్క ఆనకట్టైనా కట్టారా? ఒక్క చుక్క నీరైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించామని, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల పనులు చేపట్టింది కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
పాలమూరును పచ్చబరిచింది బీఆర్‌ఎస్సే
మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు కలిపి 30 ఏళ్ల పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చాయని, కేసీఆర్ పదేళ్ల పాలనలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, చెరువులు, చెక్‌డ్యామ్‌ల ద్వారా మొత్తం పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. 'పల్లెన పల్లేర్లు మొలిచే' అంటూ గోరటి వెంకన్న పాట రాసిన పాలమూరును పచ్చబడగొట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఒక్క పాలమూరు ప్రాజెక్టులపైనే రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన జీవోలు 403, 405 ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు. 2024 డిసెంబర్ 3న లైనింగ్ పనులకు జీవో వచ్చిందని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేందుకు పనులు సాగుతున్నా పాలమూరుకు మాత్రం నీళ్లు రావడం లేదని విమర్శించారు.
కుప్పానికి నీళ్లు ఎలా వెళ్తున్నయ్?
కుప్పానికి నీళ్లు ఎలా వెళ్తున్నాయి? పాలమూరుకు ఎందుకు రావడం లేదు? అని నిలదీశారు. ప్రస్తుతం పాలమూరులో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. పాలమూరులోనే పుట్టి ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని రేవంత్‌పై మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 75 శాతానికి పైగా పనులు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని, ప్యాకేజీ-3లో రెండు మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేస్తే 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని వివరించారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో బడ్జెట్ పద్దులు ఆమోదింపజేసుకున్న రేవంత్ ప్రభుత్వం.. అందులో కనీసం ఐదు శాతం ఆయకట్టుకైనా నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఇచ్చినట్లయితే ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో కొత్త ఆయకట్టుకు, స్థిరీకరణకు కలిపి 47 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకే నీరు ఇచ్చిందని పేర్కొన్నారు.
వరి ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలిచింది అందుకే..
తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2021-22లోనే తెలంగాణ ఈ ఘనత సాధించిందని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నీళ్లు, కరెంట్, రైతుబంధు అందించడం వల్లే వ్యవసాయ రంగంలో ఈ పురోగతి సాధ్యమైందని చెప్పారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇవ్వలేకపోయారని, ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం మూడో డీఎసీ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని ఆరోపించారు. కొత్త ఆయకట్టు తీసుకురాలేదని, కొత్త ప్రాజెక్టు నిర్మించలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 218 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించిందని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఒక్క టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు.
ఎన్ని గంటలు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయండి..
కేసీఆర్ హయాంలో నిర్మించిన లిఫ్ట్ ప్రాజెక్టులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదన్నారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి ప్రాజెక్టులను ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉందని, ఏపీలో క్రాప్ హాలిడే లేకపోయినా తెలంగాణలో పంటలకు విరామం ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. తాగునీటి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదన్నారు. ఫ్లోరైడ్ రక్కసి నుంచి ప్రజలను కాపాడటంలో గత పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సైతం తెలంగాణ తాగునీటి సరఫరా విధానాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ కార్యక్రమం ముందుకు సాగిందని పేర్కొన్నారు.
పల్నాడు వాటర్ గ్రిడ్‌పై బ్యాక్‌డేట్ లేఖలంటూ ఆరోపణలు
పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలోనూ రేవంత్‌రెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు, కేటీఆర్ ఆధారాలతో ప్రశ్నించిన తర్వాత బ్యాక్‌డేట్‌తో లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పల్నాడు స్కీంకు 2025 జనవరిలోనే టెండర్లు పిలిచారని, మరి అప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ నెల 15, 16 తేదీల్లో పత్రికల్లో కథనాలు వచ్చాయని, 16న ప్రభుత్వం లేఖ రాసిందని, 18న కేటీఆర్ ఈ అంశంపై మాట్లాడారని గుర్తుచేశారు. ఏడాది నుంచి ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంటే నీళ్ల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస సమాచారం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ గట్టిగా నిలదీసిన తర్వాతే ప్రాజెక్టులను అప్పగించబోమని బ్యాక్‌డేట్ లేఖలు రాశారని ఆరోపించారు. గోదావరిపై తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలన్న ఏపీ ఆలోచనను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పోరాడితే, ఆ తర్వాతే ప్రభుత్వం లేఖలు రాసిందన్నారు. బనకచర్ల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని విమర్శించారు.
అబద్ధాలకు అంగీ, లాగు వేస్తే రేవంత్‌రెడ్డిలా ఉంటది
పల్నాడు ప్రాజెక్టుకు సంబంధించిన జీవో 2022లోనే వచ్చిందని రేవంత్ చెబుతున్నారని, అయితే ఆ జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్తామని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన జీవో 453, జీవో 458ల్లో నాగార్జునసాగర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని తీసుకునే అంశం స్పష్టంగా ఉందని తెలిపారు. గతంలో తాగునీటికి వినియోగించే నీటి వనరును నాగార్జునసాగర్‌కు మార్చాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. 2022 నాటి జీవోలో ఈ అంశం ఉందా? అని ప్రశ్నించారు. జీవో నంబర్ 482 అని రేవంత్ చెబుతున్నారని, వాస్తవానికి అది 483 అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌పీ ఓబీసీ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని తీసుకుంటామని అందులో ఉందని, అయితే ముఖ్యమంత్రి మాత్రం నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలిస్తారని చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో పల్నాడు అంశంపై ఒక్క మాట కూడా చర్చించలేదని, ఏపీ ఇంజినీర్లే ఈ విషయాన్ని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఇంజినీర్లు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆరోపించారు. అబద్ధాలకు అంగీ, లాగు వేస్తే రేవంత్‌రెడ్డిలా ఉంటుందని, ఆయనకు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
299:512 వాటాలకు కాంగ్రెస్‌దే బాధ్యత..
కృష్ణా జలాల 299:512 టీఎంసీల వాటా విషయంలోనూ ముఖ్యమంత్రి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. 299 టీఎంసీల వాటాకు కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి పాలకులే కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న పీకే మొహంతి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలోనే ఈ వివరాలు ఉన్నాయని, అప్పట్లో ఎమ్మెల్యేలందరికీ ఆ కాపీలు అందించారని గుర్తుచేశారు. విభజన బిల్లులో ఈ వాటా అంశాన్ని చేర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సెక్షన్-3 కింద ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. 299 టీఎంసీలకు అదనంగా మరో 581 టీఎంసీల నీరు తెలంగాణకు అవసరమని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారని వివరించారు. 2015లో కుదిరిన ఒప్పందం శాశ్వత ఒప్పందం కాదని, ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు.
30 సార్లు లేఖలు ఎందుకు రాస్తం..
శాశ్వతంగా అంగీకరించి ఉంటే 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించాలని 30 సార్లు లేఖలు ఎందుకు రాశామని ప్రశ్నించారు. 2018 నుంచి ప్రాజెక్టులు పూర్తిచేసుకున్నందున తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ అనేక లేఖలు రాశామని తెలిపారు. 2021 ఆగస్టు, 2022 అక్టోబర్, డిసెంబర్‌లోనూ లేఖలు రాశామని చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని రేవంత్ ఆరోపిస్తున్నారని, వాస్తవానికి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించిన ఆదిత్యనాథ్ దాస్ సంతకం చేశారని విమర్శించారు. 2020 తర్వాత శాశ్వతంగా నీటి వాటాను అప్పగించారన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. 2025 ఫిబ్రవరి 17న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే 299:512 తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలంటే కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కారం సాధ్యమని చెప్పారు. ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపిస్తే తెలంగాణకు న్యాయమైన నీటి వాటా దక్కుతుందని పేర్కొన్నారు. మూడేళ్లుగా ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదనలు వినిపించలేకపోతున్నారని విమర్శించారు. కేంద్ర జలశక్తి మంత్రి, ప్రధానిని కలిసి తెలంగాణకు న్యాయం చేయాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.
నీటి వినియోగంలో తెలంగాణది చరిత్రలోనే అత్యల్పం
కృష్ణా జలాల వినియోగం విషయంలోనూ రేవంత్‌రెడ్డి లెక్కలను ఇష్టానుసారంగా చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అవసరమైనప్పుడు శాతాల్లో, మరికొన్నిసార్లు టీఎంసీల్లో లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 2024-25లో ఏపీ 718 టీఎంసీలు వినియోగించగా తెలంగాణ 286 టీఎంసీలే వినియోగించిందని, ఇది 28 శాతమని వివరించారు. 2025-26లో ఏపీ 771 టీఎంసీలు వినియోగించగా తెలంగాణ 267 టీఎంసీలకే పరిమితమైందని, ఇది 25 శాతమని తెలిపారు. చరిత్రలోనే తెలంగాణ నీటి వినియోగం అత్యల్ప స్థాయికి పడిపోయిందని విమర్శించారు. 2026-27లో ఇప్పటివరకు 110 టీఎంసీలు వినియోగించామని ప్రభుత్వం చెబుతోందని, అవసరాన్ని బట్టి లెక్కల విధానం మారుస్తోందని మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్‌ను అడ్డుకున్నది బీఆర్‌ఎస్సే
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం మరో అబద్ధమని హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంలో చంద్రబాబే రేవంత్‌కు సమాధానం చెప్పారని గుర్తుచేశారు. ఎన్జీటీలో కేసులు వేసి తెలంగాణ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని, రేవంత్ ఆపలేదని చంద్రబాబు గతంలో ప్రకటన విడుదల చేశారని చెప్పారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారని, 2020 మే 5న రాయలసీమ లిఫ్ట్‌కు జీవో వచ్చిందని గుర్తుచేశారు. అయితే జీవో రాకముందే 2020 జనవరి 20న పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. జీవో వచ్చిన వారం రోజుల్లోనూ మరోసారి అభ్యంతరాలు తెలిపామని వివరించారు. 2020 జూన్ 4న కేఆర్‌ఎంబీ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకించి, ఏపీకి పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇప్పించామని చెప్పారు. అదే ఏడాది అక్టోబర్ 2న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు అక్రమమని, ఎలాంటి హక్కు లేదని, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చి వెంటనే పనులు నిలిపివేయాలని కోరారని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నియంత్రణను తెలంగాణకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారని వివరించారు. కేంద్ర మంత్రి సమక్షంలో జగన్‌ను ఎదురుగా కూర్చోబెట్టి రాయలసీమ లిఫ్ట్‌ను ఆపకపోతే ఆలంపూర్ దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని కేసీఆర్ హెచ్చరించారని గుర్తుచేశారు. జోగులాంబ బ్యారేజీకి జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ఎన్జీటీలో కేసులు వేసి స్టే తీసుకొచ్చామని, రాయలసీమ లిఫ్ట్ నేటికీ నిలిచివుండటానికి బీఆర్‌ఎస్ పోరాటమే కారణమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని మొత్తం 19 లేఖలు రాశామని, అపెక్స్ కౌన్సిల్‌లోనూ పోరాడామని చెప్పారు.
పోతిరెడ్డిపాడు విషయంలోనూ వాస్తవాల వక్రీకరణ
పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తాము మంత్రి పదవులను గడ్డి పోచల్లా భావించి రాజీనామాలు చేశామని, ఆ తర్వాతే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని చెప్పారు. తాము పదవులు వదులుకుంటే కాంగ్రెస్ నేతలు మంత్రులయ్యారని, ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై 2005లోనే అసెంబ్లీలో తాము తీవ్రంగా పోరాడామని తెలిపారు. 26 మంది ఎమ్మెల్యేలతో 42 రోజులపాటు అసెంబ్లీని స్తంభింపజేశామని గుర్తుచేశారు. 2005లో జీవో 170 రద్దు చేయాలని, పోతిరెడ్డిపాడుపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చామని చెప్పారు. అక్టోబర్ 3, 4, 5, 6, 7, 8 తేదీల్లో అసెంబ్లీలో జరిగిన చర్చలు, నిరసనలు సభ రికార్డుల్లో ఉన్నాయని తెలిపారు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర, చిన్నారెడ్డి ఈ అంశంపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు అంశంపై తాము నిలదీసినందుకే మైక్ ఇచ్చారని చెప్పారు. పోతిరెడ్డిపాడు విషయంలో అపోహలు వద్దంటూ చిన్నారెడ్డి వ్యాసాలు రాశారని గుర్తుచేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నేతలేనని, తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టారని విమర్శించారు.
గ్రావిటీ నీళ్లపై ప్రశ్నలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ రేవంత్‌రెడ్డి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో అన్నారం, సుందిళ్ల కూలితే భద్రాచలం మునిగిపోతుందని అన్నారని, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తకపోతే దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమనే కుట్రలు
తమ పోటీ బీఆర్‌ఎస్‌తోనేనని రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో చెప్పారని, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఇలాంటి కుట్రలు, బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. నిద్రలో కూడా కేసీఆర్ పేరే కలవరిస్తున్నారని, ప్రతి ప్రెస్‌మీట్‌లో పదేపదే కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారని అన్నారు. నీళ్ల విషయంలో అసెంబ్లీలో వారం, పది రోజులపాటు చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, మైకులు కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నం తినకుండా అయినా చర్చలో పాల్గొంటామని, రేవంత్‌రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
నవంబర్ 24, 2026

Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ
నవంబర్ 24, 2026

Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మెగావెర్స్ ప్రోమో రిలీజ్ - నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి టాక్ షో - రానున్న గెస్ట్‌లు వీళ్లే....
- ●Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
- ●Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- ●Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
- ●Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

Chiranjeevi | మెగావెర్స్ ప్రోమో రిలీజ్ - నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి టాక్ షో - రానున్న గెస్ట్‌లు వీళ్లే....

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!

Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!



