Katta Shekar Reddy | తెలంగాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరిశోధనలు జరగాలి..
Katta Shekar Reddy | తెలంగాణ వాస్తవిక చరిత్రను ఆవిష్కరించుకునే పరిశోధన మార్గంలో పూర్వ సంపాదకులు, ఆర్టీఐ మాజీ కమిషనర్, రచయిత కట్టా శేఖర్ రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకం దిక్సూచి వంటిదని సీనియర్ సంపాదకులు, రచయితలు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
చరిత్రను ఆవిష్కరించుకునేందుకు
తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకం దిక్సూచి వంటిది..
ఆంధ్ర, తెలుగు భాష చరిత్రలో కొత్త మలుపులు
తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకావిష్కరణలో వక్తల అభిప్రాయం
Katta Shekar Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వాస్తవిక చరిత్రను ఆవిష్కరించుకునే పరిశోధన మార్గంలో పూర్వ సంపాదకులు, ఆర్టీఐ మాజీ కమిషనర్, రచయిత కట్టా శేఖర్ రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకం దిక్సూచి వంటిదని సీనియర్ సంపాదకులు, రచయితలు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కే రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తొలి కాపీని నాగారం సర్పంచ్, పుస్తక రచయిత కట్టా శేఖర్‌రెడ్డి మామగారైన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి అందించారు.
ఈ సందర్భంగా కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. చరిత్ర అంటేనే మార్పులు, కూర్పులతో కూడిందని అన్నారు. దేశంలో విజేతలు చరిత్రను రాసుకున్న ఆనవాయితీ కొనసాగడంతో అసలు చరిత్ర ఏమిటన్నది నిత్య సత్యశోధనగా కొనసాగుతుందన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను రాసుకునే టైమ్ వచ్చిందని, ఈ క్రమంలోనే కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ మూలలు పుస్తకంతో తెలుగు భాష, తెలంగాణ చరిత్ర పరిశోధనపై లోతైన పరిశోధన చేశారని కొనియాడారు. తెలంగాణ చరిత్రపై మరిన్ని పరిశోధనలు రావాల్సిన పరిస్థితిని కల్పించడంలో పుస్తక రచయిత విజయవంతమయ్యారని ప్రశంసించారు. తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, తెలుగు భాష, ఆంధ్ర భాష, చరిత్రలు కొత్త మలుపులు తిరుగబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తకంలోని అంశాలు ప్రాచీన తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటే ప్రయత్నం చూస్తే.. కట్టా శేఖర్ రెడ్డిని కట్టర్ తెలంగాణవాదిగా చెప్పవచ్చన్నారు.
తెలంగాణ చరిత్రను స్థిరీకరించాలి : జీ జగదీశ్ రెడ్డి
తెలంగాణ చరిత్రను, భాష, సంస్కృతులను అణిచివేసే కుట్రలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయని మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే స్వరాష్ట్రం ఏర్పాటు పిదప మన చరిత్ర, భాషలను స్థిరీకరించుకునే ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో జరుగలేదని విచారం వ్యక్తం చేశారు. కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో తెలంగాణ భాష, చరిత్ర పరిశోధనలపై గొప్ప ప్రయత్నం చేశారని అభినందించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై ఆంధ్రావాళ్ల నుంచి ప్రతిస్పందనలు తప్పక వస్తాయన్నారు.
కాల్పనిక నవలల ఉంది : కే శ్రీనివాస్
కట్టా శేఖర్ రెడ్డి రచనలో వచ్చిన తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకం చదువుతుంటే థ్రిల్లర్ నవలను, కాల్పనిక నవలను చదువుతున్నట్టు ఆసక్తికరంగా సాగుతుందని పూర్వ సంపాదకులు కే శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ చరిత్రపై ప్రాంతీయ ఆధిపత్య శక్తుల ప్రభావం నుంచి స్వీయ అస్థిత్వం, ఆత్మగౌరవంతో కూడిన చరిత్రను ఆధారాలు, పరిశోధనలతో చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తెలుగు భాష తెలంగాణకు చెందినదని.. త్రిలింగ, తెనుగు, తెలంగాణ భావనను తొక్కిపెట్టేందుకు ఆంధ్ర భాష, సంస్కృతిని పైకి తెచ్చారని చెప్పే ప్రతిపాదనలను చేశారని తెలిపారు. ఆంధ్ర పదాన్ని జాతి, సంస్కృతి, భాషా వాచకంగా వాడుతున్నారన్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మీద ప్రాంతీయ ఆధిపత్యం కోణం ఏమైనా ఉందా అనే పరిశోధనతో కట్టా శేఖర్ రెడ్డి త్రిలింగ దేశం, తెనుంగు, తెలింగ, తెలంగాణ ప్రతిపాదనలను చేసి..తెలంగాణ, ఆంధ్ర చరిత్రలపై మరింత పరిశోధన చేయడంపై ఆసక్తిని పెంచేశారని అభివర్ణించారు.
మన చరిత్రను మనమే చెప్పుకోవాలి : ఘంటా చక్రపాణి
భారత దేశ చరిత్రతో పాటు, ఆంధ్రులు, తెలంగాణ చరిత్ర కూడా వక్రీకరణలతో సాగాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ పరిస్థితులో తెలంగాణ చరిత్ర మూలాలు రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్రను తిరగరాసే, పునర్నిర్వచించే ప్రయత్నం చేశారని అభినందించారు. హైందవత్వానికి అతీతమైన చరిత్రను భారత చరిత్రగా చూడలేకపోతున్నారని ఆరోపించారు. సింహాలు తమ చరిత్రను చెప్పుకోనంతవరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుందని ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మన చరిత్రను మనం చెప్పుకోవాలని, ఈ దిశగా ప్రభుత్వం కూడా పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు.
కట్టా శేఖర్ రెడ్డి పుస్తకంతో ఆసక్తికర చర్చ : అల్లం నారాయణ
ఉమ్మడి రాష్ట్రంలో భాష, సంస్కృతుల అస్తిత్వం కోల్పోయిన తెలంగాణకు స్వరాష్ట్రంలో చరిత్ర నిర్మాణం, భాషలపై జరుగాల్సిన పరిశోధనలు జరుగలేదని సీనియర్ సంపాదకులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ చరిత్ర మూలాల రచనతో కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ చరిత్ర, భాషలపై ఆసక్తికర చర్చను లేవనెత్తారని అభినందించారు. తెలంగాణ భాష, చరిత్ర చర్చ జరిగిన ప్రతిసారి ఆంధ్ర ఆధిపత్యశక్తుల నుంచి ప్రతివాదన ఎదురవుతుందన్నారు. తెలంగాణ చరిత్ర, మూలాలు, తెలుగు భాషా తెలంగాణ చరిత్ర అనుబంధాలను శాసనాలు, ఆధారాలతో ఒక కూర్పుగా తీసుకురావడంలో శేఖర్‌రెడ్డి సఫలీకృతులయ్యారన్నారు.
తెలంగాణ గొప్ప జనపదంగా విలసిల్లింది : జూలూరి గౌరీశంకర్
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ.. చరిత్రను ఎప్పుడూ ఎవరూ పూర్తిగా రాయలేరని అన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఆంధ్ర ప్రాంతం వారు ఆది కవి నన్నయ్య కంటే ముందు తెలుగు లేదంటారని.. దానికి సమాధానంగా అంతకుముందే తెలంగాణలో తెలుగు, తెనుంగు భాషతో తెలంగాణ గొప్ప జనపదంగా విలసిల్లిందని తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకంతో కట్టా శేఖర్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేశారని కొనియాడారు.
ఆ సంఘటనతోనే తెలుగు భాషా చరిత్రపై ఆసక్తి : కట్టా శేఖర్ రెడ్డి
ఏదైనా అంశంపై గత చరిత్రను అన్వేషించే స్వీయ ఆసక్తి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తక రచన వైపు తనను నడిపించిందని పుస్తక రచయిత కట్టా శేఖర్ రెడ్డి చెప్పారు. తమిళ భాషకు ప్రాచీన హోదా అంశంతో తెలుగు భాషపై మూలాలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడాన్ని మద్రాసు హైకోర్టులో సవాల్ చేయడం కూడా తనను తెలుగు భాషా చరిత్రపై ఆసక్తిని పెంచిందన్నారు. తెలుగు మూలాలు పరిశోధన చేసే క్రమంలో రాజరాజచోళుడు ఆదికవి నన్నయ్యను మహాభారతాన్ని తెలుగులో రాయమని కోరడం.. ఆయన కూడా తెలుగులోనే రాస్తానని చెప్పారని అయితే.. అది కాస్తా అంధ్ర మహాభారతంగా మారిందన్నారు. దీంతో తెలుగు పదాన్ని.. తెలంగాణ చరిత్రను ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం చేశారన్న భావన తనలో బలపడిందని చెప్పారు. తెలంగాణ చరిత్రను గుర్తించాల్సి వస్తుందన్న భయంతోనే తెలుగు, తెనుంగు పదాలు ఆంధ్ర పరిశోధకులకు మింగుడు పడనివిగా మారాయన్నారు. తెలుగు మూలం తెనుగు అని స్థిరీకరించారని.. అంతకుముందు తెలుగు లేదా అన్న ప్రశ్నతో తాను పరిశోధన చేసి పుస్తకాన్ని తెచ్చానని తెలిపారు. తెలుగు, తెలంగాణ లింక్ తో తన పరిశోధనను కొనసాగించి చారిత్రక ఆధారాలు, శాసనాలతో తెలంగాణ చరిత్ర మూలాలు రచన చేశానని వివరించారు. అయితే ఇది మాత్రమే తెలంగాణ చరిత్ర అని తాను నిర్ధారించడం లేదని.. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగాల్సి ఉందని శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన కే శ్రీనివాస్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం చెప్పే ప్రయత్నాలు చేస్తాననన్నారు.
సంబంధిత వార్తలు

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే ‘కాటమయ్య గుండు’
ఆగస్టు 13, 2026

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే
ఆగస్టు 8, 2026

Allam Narayana | తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి: అల్లం నారాయణ
జులై 21, 2026
తాజావార్తలు
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
- ●CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
- ●Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి



