త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC MD Nagireddy | రాష్ట్ర ప్ర‌గ‌తిలో ఆర్టీసీ భాగమ‌వ‌డం గ‌ర్వ‌కార‌ణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

RTC MD Nagireddy | తెలంగాణ జెండా అనేది వస్త్రం కాదని.. అది కోట్ల మంది ఆత్మగౌరవ నినాద‌మ‌ని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతిలో ఆర్టీసీ కూడా ముఖ్యమైన భాగస్వామి కావడం మనందరికీ గర్వకారణమన్నారు.

S

Telangana | Published On Jun 2, 2026, 4.01 pm IST

RTC MD Nagireddy | రాష్ట్ర ప్ర‌గ‌తిలో ఆర్టీసీ భాగమ‌వ‌డం గ‌ర్వ‌కార‌ణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
Advertisement
  • మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం సంతోష‌క‌రం
  • ఆర్టీసీ ప్ర‌గ‌తిలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సేవ‌లు అభినంద‌నీయం
  • ప్రయాణికుల భద్రతే మన ప్రథమ కర్తవ్యం
  • ప్రతి ప్రయాణికుడిని కుటుంబ సభ్యుడిగా చూడాలి
  • అప్పుడే ఆర్టీసీపై న‌మ్మ‌కం క‌లుగుతుంది
  • రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌ల్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్ల‌డి

RTC MD Nagireddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ జెండా అనేది వస్త్రం కాదని.. అది కోట్ల మంది ఆత్మగౌరవ నినాద‌మ‌ని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. లక్షలాది మంది పోరాటాల స్వేచ్ఛా గీతం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతిలో ఆర్టీసీ కూడా ముఖ్యమైన భాగస్వామి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. బస్‌భవన్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన 12వ రాష్ట్ర అవతరణ వేడుకల సంద‌ర్భంగా జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమరవీరులను స్మరిస్తూ వారికి ఘన నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న‌ ప్ర‌సంగించారు. ప్ర‌తి ప్ర‌యాణికుడిని కుటుంబ స‌భ్యుడిగా భావించి సేవ‌లందించాల‌ని సిబ్బందికి సూచించారు.

ప్రజా రవాణాలో రోల్ మోడల్‌..

ఎన్నో సవాళ్లతో ఉన్న ఆర్టీసీ సంస్థ, నేడు ప్రజా రవాణాలో దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. దానికి కారణం ఉద్యోగుల క్రమశిక్షణ, కష్టం, నిబద్ధత మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. ఈ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మహిళల నుండి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. సంస్థ ఇప్పటికే రూ.10 వేల కోట్ల ఉచిత మహిళా ప్రయాణాలను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళా సంఘాలకు బస్సులు కేటాయించడం ద్వారా వారు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ సేవలని మరింత ఆధునీకరిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణను ధ్యేయంగా పెట్టుకుని, కాలుష్య నివారణ కోసం పెద్ద ఎత్తున అధునాతన ఎలక్ట్రిక్ బస్సులను (e-buses), సరికొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడుపుతూ తెలంగాణ ఆర్టీసీ అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపులు, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక మార్పులను సంస్థలో విజయవంతంగా అమలు చేస్తున్నాం అని నాగిరెడ్డి పేర్కొన్నారు.

బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగినప్పటికీ, డ్రైవర్లు, కండక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎంతో ఓపికతో, బాధ్యతాయుతంగా సేవలు అందిస్తూ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ నా ప్రత్యేక అభినందనలు. సంస్థ ఎదుగుదలతో పాటు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యోగుల శ్రేయస్సును కాపాడటంలో, వారి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ మనకు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలుస్తోంది. భవిష్యత్తు లో కూడా కార్మికుల సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వం అని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.

ప్ర‌మాద ర‌హిత ప్ర‌యాణ‌మే ఏకైక ల‌క్ష్యం..

ప్రయాణికుల భద్రతే మన ప్రథమ కర్తవ్యం. ప్రమాద రహిత ప్రయాణాన్ని అందించడమే మన ఏకైక లక్ష్యం కావాలి. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడిని మన కుటుంబ సభ్యుడిగా భావించాలి. అప్పుడే ప్రజల్లో సంస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను అధిగమిస్తూ, లాభాల బాటలోకి పయనిస్తూ, తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకమైన రవాణా వారధిగా తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు మనమంతా పునరంకితం కావాలి అని నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈడీ సిహెచ్.వెంకన్న, ఫైనాన్సియల్ అడ్వైజర్ విజయ పుష్ప, సిటీఎం శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీటీఎం ట్రాఫిక్ శ్రీదేవి, కవిత, ప్రభులత పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement