త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజ‌య్ జాజు

CS Sanjay Jaju | గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్‌ రంగాలకు హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

P

Telangana | Published On Sep 30, 2026, 5.40 pm IST

CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజ‌య్ జాజు
Advertisement

CS Sanjay Jaju | గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్‌ రంగాలకు హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ జాయింట్‌ సెక్రటరీ అనుదీప్‌ దురిశెట్టి, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

‘స్టోరీస్, గేమ్స్‌ అండ్‌ డ్రీమ్స్‌’ థీమ్‌తో..

రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగానే తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నట్లు సంజయ్‌ జాజు తెలిపారు. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్‌తో పాటు క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లోని అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘స్టోరీస్, గేమ్స్‌ అండ్‌ డ్రీమ్స్‌’ థీమ్‌తో యువతను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమ్మిట్‌లో భాగంగా కామిక్, గేమింగ్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌ బిజినెస్‌ డే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కామిక్‌ కాన్‌, డ్రీమ్‌హ్యాక్‌తోపాటు..

కామిక్‌ కాన్, డ్రీమ్‌హ్యాక్, ఇండియా గేమ్‌ ఉత్సవ్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. వీటితోపాటు బీ2బీ ఎక్స్‌పో, ఇన్నోవేషన్‌ జోన్, యానిమేషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసి టెక్నాలజీ, ఆవిష్కరణలు, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రదర్శించేందుకు వేదిక కల్పించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 50 పెద్ద సంస్థలు, దాదాపు 150 మధ్యతరహా యానిమేషన్, గేమింగ్‌ కంపెనీలు ఉన్నాయని సంజయ్‌ జాజు వెల్లడించారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను నగరానికి ఆకర్షించి యువతకు ఈ అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

50వేల మంది సందర్శకులకు ఏర్పాట్లు

హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సమ్మిట్‌లోని కార్యక్రమాలు, ప్రదర్శనలను తిలకించేలా ఆహ్వానించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. సుమారు 70 కళాశాలల విద్యార్థులతోపాటు దాదాపు 50 వేల మంది సందర్శకులు కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యువతలో సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రోత్సహించడంతోపాటు క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని సంజయ్‌ జాజు పేర్కొన్నారు.

Advertisement
Advertisement